హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి కొన్నాళ్లుగా ప్రతీ ఎన్నికల్లోనూ భంగపాటు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీచినా.. నరేంద్ర మోదీ హవా స్పష్టంగా కనిపించిన తాజా ఎన్నికల్లో సైతం వరంగల్ లోక్‌సభ పరిధిలో బీజేపీ అభ్యర్థికి గతంతో పోలిస్తే ఓట్లు ఇంకా తగ్గిపోవడం గమనార్హం. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 2,05,803 ఓట్లు పోల్ కాగా.. ప్రస్తుత ఎన్నికల్లో 83,777 ఓట్లు మాత్రమే రావడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. గతంలో దేశం మొత్తం మీ ద రెండు స్థానాల్లోనే బీజేపీ గెలుపొందగా.. అందులో ఒకరు హన్మకొండ నుంచి గెలవడం చరిత్రగా చెబుతారు. కానీ అదంతా గతంగానే మిగిలిపోగా.. ఇప్పుడు కనీసం డిపాజిట్లు దక్కించుకోలేని స్థితికి ‘కమలం’ చేరుకోవడాన్ని ఆ పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
గతంలో ఎంపీ, ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం ఉండేది. అయితే, 1999 తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు పరాజయాన్నే మూటగట్టుకుంటున్నారు. పరకాల, రద్దయిన శాయంపేట, వర్ధన్నపేట, హన్మకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో బీజేపీకి చెందిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించారు. పాత హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీకి ప్రాతినిథ్యం ఉంది. అలాగే, రద్దయిన శాయంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున 1978, 1983లో చందుపట్ల జంగారెడ్డి విజయం సాధించారు.
1985, 1989లో పరకాల నుంచి ఒంటేరు జయపాల్, వర్ధన్నపేట నుంచి 1985లో వన్నాల శ్రీరాములు, 1989లో డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు గెలిచారు. ఇక 1999లో రద్దయిన హన్మకొండ నియోజకవర్గం నుంచి మార్తినేని ధర్మారావు విజయం సాధించారు. 1984లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో దేశంలో రెండు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి మాత్రమే బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా.. ఇందులో ఒకరు రద్దయిన హన్మకొండ లోక్‌సభ నుంచి చందుపట్ల జంగారెడ్డి కావడం విశేషం. ఆ ఎన్నికల్లో రాజకీయ ఉద్దండుడు మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు(ప్రధాని కాక ముందు)ను ఓడించారు. ఇలా గతంలో బీజేపీ గెలిచిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలోనే ఉన్నా గత ప్రాభవాన్ని సాధించలేక మరింత చతికిలపడడం గమనార్హం.
ఇప్పుడు అంతంతే...
1999 అనంతరం జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ పూర్వ వైభవం చాటుతామని బీజేపీ పార్టీ నాయకులు గొప్పలు చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి, రెండో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ తన సత్తా చాటలేకపోతోంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. తెలంగాణలోనూ నాలుగు స్థానాల్లో విజయం సాధించినా మోదీ చరిష్మా, బీజేపీ పవనాలు ఇక్కడ పనిచేయలేదు.
కాగా, 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున అభ్యర్థులు పోటీ చేసినా ఒక్క స్థానంలోనైనా కమలం వికసించలేదు. ఈసారి గతంలో మాదిరి కాకుండా పార్టీలో సీనియర్ అయిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తిని వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిపారు. అయినా విజయానికి సాధ్యం కాకపోగా.. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. 2014లో టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన రామగల్ల పరమేశ్వర్‌ను పార్టీ అభ్యర్థిగా నిలిపితే 2,05,803 ఓట్లు వచ్చాయి. 2015 ఉప ఎన్నికల్లో డాక్టర్ పగిడిపాటి దేవయ్యను నిలపగా 1,29,868 ఓట్లు సాధించారు.
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకీ చెందిన అభ్యర్థినే బరిలోకి దింపినా గత రెండు ఎన్నికల్లో పోలిస్తే ఓట్ల సంఖ్య మరింత పడిపోయి కేవలం 83,777 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలా ప్రతీ ఎన్నికకు ఓట్లు తగ్గుతుండడం చర్చనీయాంశంగా మారింది.
గడ్డు పరిస్థితులు..
వరంగల్ జిల్లాలో బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పడంలేదు. అభ్యర్థుల ఎంపికే సమస్యగా మారుతోందని తెలుస్తోంది. గెలిచే వారికి, పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి, ప్రజల్లో పట్టు ఉన్న వారికి కాకుండా.. అధిష్టానం వద్ద పట్టు ఉన్న వారికి టికెట్లు ఇస్తుండడంతో ఓటమి తప్పడం లేదని ఆ పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఇక టికెట్లు పొందిన వారు ఆ పార్టీలోని అసమ్మతి వాదులను కలుపుకుపోకపోవడం కూడా మరో సమస్య మారినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టపర్చకుండా ఎన్నికలకు వెళ్లడం వంటి వైఫల్యాలతో ఆ పార్టీ పూర్వ వైభవం సాధించలేక పోతోందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment