సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితికి సెంటిమెంట్ కరీంనగర్. పార్టీ ఆవిర్భావం తరువాత కేసీఆర్ 2001లో తొలి సింహగర్జన సభ నిర్వహించింది ఇక్కడే. మొన్నటి లోక్‌సభ ఎన్నికలకు ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో కేటీఆర్ సన్నాహక సభ నిర్వహించి జోష్ పెంచింది ఇక్కడి నుంచే. చివరికి ఎన్నికల షెడ్యూల్ విడుతలైన తరువాత తొలి బహిరంగసభను కూడా కరీంనగర్ నుంచే మొదలు పెట్టి ఈ జిల్లాపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత ఈ కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్‌కు షాకిచ్చింది. కరీంనగర్ లోక్‌సభ స్థానంలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగింట బీజేపీకి ఘననీయమైన ఓట్లు పోల్ కావడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అలాగే నిజామాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమిలో పూర్వ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్ల భాగస్వామ్యం కూడా ఎక్కువే. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో సైతం మంథని, రామగుండంలలో టీఆర్‌ఎస్ కన్నా కాంగ్రెస్ మెరుగైన ఓట్లు సాధించింది. మొత్తంగా చూస్తే పూర్వ కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, ధర్మపురి, పెద్దపల్లిలో మాత్రమే టీఆర్‌ఎస్‌కు ఊరట లభించింది. మిగతా 8 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్‌ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు రావడం పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు.
కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఏకంగా 52వేల మెజారిటీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై 14వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఇదే నియోజకవర్గంలో బీజేపీకి ఏకంగా 52,181 ఓట్ల మెజారిటీ లభించడం గమనార్హం. మైనారిటీ వర్గాలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మెజారిటీ వర్గంలో 70 శాతం ఓట్లు బీజేపీకే పోలయినట్లు అంచనా వేస్తున్నారు.
మిగతా స్థానాల్లోనూ...
ఇక చొప్పదండి, మానకొండూరులలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు రవిశంకర్, రసమయి బాలకిషన్‌లు అనూహ్యంగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. రవిశంకర్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో 91వేల ఓట్లు పోల్ కాగా, ఈసారి ఇక్కడ టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్లు కేవలం 41,396 అంటే దాదాపు 50వేల ఓట్లు మైనస్. బండి సంజయ్‌కు ఈ నియోజకవర్గం నుంచి ఎవరూ ఊహించని విధంగా 97,441 ఓట్లు సాధించారు. మానకొండూరులో గత ఎన్నికల్లో రసమయికి 89వేల ఓట్లు రాగా, ఈసారి 41వేల ఓట్లకు టీఆర్‌ఎస్ పరిమితమైంది. ఆ ఎన్నికల్లో 4356 ఓట్లు మాత్రమే వచ్చిన బీజేపీకి 73వేల ఓట్లు పోలవడం గమనార్హం. వేములవాడలోనూ గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 28వేల మెజారిటీ కట్టబెట్టిన ఓటర్లు ఈసారి బీజేపీ 25వేల ఓట్ల ఆధిక్యతనిచ్చారు. కరీంనగర్ పార్లమెంటులో కరీంనగర్ మినహా మిగతా ఆరు అసెంబ్లీల్లో గత ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ రాకపోగా, ఈసారి భారీగా ఓట్లు పోలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
నిజామాబాద్, పెద్దపల్లి లోక్‌సభ పరిధిల్లో సైతం...
నిజామాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమికి ఆ జిల్లాలోని నియోజకవర్గాలతోపాటు కరీంనగర్‌లోని జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్లు కూడా ప్రధాన కారణమయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ కన్నా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు భారీగా మెజారిటీ లభించింది. జగిత్యాలలో 7,300, కోరుట్ల నుంచి 20వేల మెజారిటీ బీజేపీకి లభించడం గమనార్హం. నిజామాబాద్‌లో కవిత ఓటమిలో ఈ రెండు నియోజకవర్గాలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఇక పెద్దపల్లిలో టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ, మంథని, రామగుండంలలో టీఆర్‌ఎస్‌కన్నా కాంగ్రెస్‌కే ఓట్లు అధికంగా పోలయ్యాయి. మంథనిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా, రామగుండంలో టీఆర్‌ఎస్ నేతల వర్గపోరుతో కాంగ్రెస్‌కు 2వేల స్వల్ప ఆధిక్యత లభించింది.
కొంప ముంచిన అతివిశ్వాసం
అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీఆర్‌ఎస్ మూడు నెలల తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలను తుడిచేస్తుందని ఆ పార్టీ నేతలు నమ్మారు. కరీంనగర్‌లో ఏడుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, వారి మధ్య సరైన సయోధ్య కరువైంది. సిట్టింగ్ ఎంపీ వినోద్‌కుమార్‌తోపాటు మంత్రి ఈటల రాజేందర్ గెలుపుపై పూర్తి ధీమాతో వ్యవహరించారు. కరీంనగర్‌తోపాటు ఒకటి రెండు పట్టణాల్లో బీజేపీకి ఓటింగ్ పెరిగినా, గ్రామీణ ఓటర్లు టీఆర్‌ఎస్ వైపే ఉంటారని కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ కోల్పోవడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అలాగే బహిరంగసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అభ్యర్థి ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకోగా, దాన్ని కౌంటర్ చేయడంలో టీఆర్‌ఎస్ నేతలు విఫలమయ్యారు. రైతుబంధు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలే తిరిగి ఓట్లు తెచ్చిపెడతాయని భావించిన ఎమ్మెల్యేలకు గట్టి దెబ్బ తగిలినట్లయింది. కాగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కన్నా 30వేల మెజారిటీ సాధించిన మంత్రి ఈటల రాజేందర్ బీజేపీని మూడోస్థానానికి పరిమితం చేయడం గమనార్హం. టీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి పోలుకాకుండా ఆయన పకడ్బందీగా వ్యవహరించారు. హుస్నాబాద్‌లో సైతం 23వేల మెజారిటీ టీఆర్‌ఎస్ సాధించింది.
త్వరలో మేథోమథనం
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై టీఆర్‌ఎస్ అధిష్టానం త్వరలో పోస్టుమార్టం చేయనుంది. హైదరాబాద్‌లో పార్లమెంటరీ సమావేశం తరువాత వచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేస్తారు. కరీంనగర్‌లో ఓటమికి హిందుత్వ నినాదం, మోదీ ఎఫెక్ట్ బాగా పనిచేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయిలో మేథోమథనం జరపనున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ బీజేపీకి పెరగడానికి గల కారణాలపై విశ్లేషణ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment