జానకంపేటలో పోలింగ్ సెంటర్ వద్ద ఏఎన్‌ఎంలతో మాట్లాడుతున్న కలెక్టర్ రామ్మోహన్‌రావు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మండుటెండలో ఓట్ల వాన కురిసింది. రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఉత్సాహంగా ఓట్లేశారు. భగభగ మం డుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా పో లింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు తమ ఓ టుహక్కును వినియోగించుకున్నారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ముఖ్యంగా మహిళలు, యువత, వృద్ధులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొలి మూడు గంటల్లోనే భారీగా పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసే సమయానికి 76.28 శాతం నమోదైంది.
మొదటి విడత కంటే 3.97 శాతం అధికంగా ఓటర్లు ఓట్లేశారు. రెండో విడతలో భా గంగా బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలు, 75 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ విడతలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఎక్కువగా ఉండటంతో పోలీసుశాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని బోధన్ డివిజన్ మొత్తం 144 సెక్షన్‌ను అమలు చేసింది. మొత్తం మీద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా సజావుగా, ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో అధికార యంత్రాంగం, పోలీసుశాఖ ఊపిరి పీల్చుకుంది.
ఉదయం నుంచే ఉత్సాహంగా..
పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభానికి ముందే తరలివచ్చిన ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 21 శాతం మంది ఓట్లేశారు. మధ్యాహ్నం 11 గంటల వరకు 48 శాతం పోలింగ్ దాటగా, ఒంటి గంట వరకు పోలింగ్ 60 శాతానికి చేరింది. ఎండ తీవ్రతకు మధ్యాహ్నం మందకొడిగా సాగింది. 3 గంటల వరకు 68.56 శాతం పోలింగ్ జరిగింది. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. పోలింగ్ సమయం ముగిసే వరకు మొత్తం 76.28 శాతం పోలింగ్ నమోదైంది.
ముందు జాగ్రత్తగా 144 సెక్షన్..
గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు బోధన్ డివిజన్‌లో శుక్రవారం 144 సెక్షన్‌ను అమలు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక బందోబస్తు కనిపించింది. 16 స్ట్రైకింగ్ ఫోర్స్, 14 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని సీపీ కార్తికేయ ప్రకటించారు. ఒక మొబైల్ టీంను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి సమస్యాత్మక కేంద్రాల్లో ఎస్‌ఐ స్థాయి అధికారిని నియమించారు. జాన్కంపేట్, నీలా, రెంజల్, సాటాపూర్ తదితర చోట్ల భారీ బందోబస్తు కనిపించింది.
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. జాన్కంపేట్, నీలా, సాటాపూర్, బోధన్ మండలం సాలూర, ఎడపల్లి, కోటగిరి, వర్ని తదితర పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఓటర్లకు అందించాల్సిన సౌకర్యాలు, తాగునీరు, దివ్యాంగులకు వీల్‌చైర్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల వంటి సౌకర్యాలపై ఆరా తీశారు. పోలింగ్ సజావుగా జరిపేందుకు ఎప్పటికప్పుడు ఎంపీడీఓలకు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును సీపీ కార్తికేయ పరిశీలించారు. జాన్కంపేట్, నీలా, రెంజల్ పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు.
లైవ్ వెబ్‌కాస్టింగ్..
పోలింగ్‌ను ఎప్పటి కప్పుడు పరిశీలించేందుకు పలు పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో లైవ్ వెబ్‌కాస్టింగ్‌ను కలెక్టర్ పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment