గెలుపెవరిదో..! | Mandal Co By Elections In Telangana | Sakshi
Sakshi News home page

గెలుపెవరిదో..!

Published Sat, Jun 15 2019 6:57 AM | Last Updated on Sat, Jun 15 2019 6:57 AM

Mandal Co By Elections In Telangana - Sakshi

సాక్షి, కొత్తగూడెం: నాలుగు మండలాల్లో శనివారం మండల పరిషత్‌ కో ఆప్షన్, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నెల 7వ తేదీన 20 మండలాలకు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా, 16 మండలాల్లోనే ఎన్నికలు జరిగాయి. సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి, ఆళ్లపల్లి మండలాల్లో ఎన్నికలు వాయిదా పడ్డ విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల పరిధిలోని 18 మండలాల్లో ఎన్నికలు వాయిదా పడగా, అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అత్యధికంగా నాలుగు మండలాలు ఉన్నాయి. వాటిలో నేడు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.  ఆళ్లపల్లి మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలే ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోగా.. గెలిచిన నలుగురు ఎంపీటీసీలూ ఎంపీపీ పదవి ఆశిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌ మండలాలకు సంబంధించి ఇతర ప్రాంతాల్లో శిబిరాలు పెట్టారు. నేరుగా ఎన్నిక సమయానికి ఎంపీటీసీలు రానున్నారు. ములకలపల్లిలో కూడా క్యాంప్‌ రాజకీయం జోరుగా సాగుతోంది.

  • ములకలపల్లి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్‌ 2, టీడీపీ 3, న్యూడెమోక్రసీ 2, సీపీఐ 1, సీపీఎం 1 దక్కించుకోగా, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు సీపీఐ, స్వతంత్ర ఎంపీటీసీలు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఈ ప్యానెల్‌కు 4 సీట్లు ఉన్నాయి. టీడీపీకి సీపీఎం మద్దతు తెలుపుతోంది. దీంతో ఈ ప్యానెల్‌కు సైతం 4 స్థానాలు ఉన్నాయి. ఈ మేరకు టీఆర్‌ఎస్, టీడీపీలు విడివిడిగా క్యాంప్‌లు పెట్టుకున్నాయి. న్యూడెమోక్రసీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎంపీటీసీలు మాత్రం ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్నారు. మరోవైపు సీపీఎం మద్దతు కోసం టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది. తమకు మద్దతు ఇస్తే వైస్‌ ఎంపీపీ ఇస్తామని టీడీపీ.. టీఆర్‌ఎస్‌లో ఒక ఎంపీటీసీకి ఆఫర్‌ చేస్తోంది. దీంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి రెండు ప్యానల్స్‌కు నులుగురి చొప్పున ఉండడంతో చివరకు లాటరీ తీయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. 
     
  • ఆళ్లపల్లి మండలంలో మొత్తం 4 సీట్లు ఉండగా, ఇక్కడ టీఆర్‌ఎస్‌ 2, సీపీఐ 1, కాంగ్రెస్‌ 1 గెలుచుకున్నాయి. ఇక్కడ గత 7వ తేదీన నలుగురు సభ్యులు వచ్చినప్పటికీ మ్యాజిక్‌ ఫిగర్‌ మాత్రం ఎవరికీ రాలేదు. గెలిచిన ప్రతి ఎంపీటీసీ ఎంపీపీఈ పదవి ఆశించడంతో ఎన్నిక సాధ్యపడలేదు. దీంతో నేడు జరుగనున్న ఎన్నికకు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరు కానున్నారు.
     
  • లక్ష్మీదేవిపల్లి మండలంలో 11 సీట్లకు టీఆర్‌ఎస్‌కు 5, సీపీఐ 3, స్వతంత్ర 3 గెలిచారు. దీంతో ఈ ఎంపీపీ గెలుచుకునేందుకు టీఆర్‌ఎస్‌ జాగ్రత్తగా పావులు కదుపుతోంది.
  • సుజాతనగర్‌ మండలంలో 8 సీట్లకు గాను టీఆర్‌ఎస్‌ 3, సీపీఐ 2, కాంగ్రెస్‌ 2, స్వతంత్ర 1 గెలిచారు. దీంతో ఇక్కడ కూడా ఆసక్తి నెలకొంది.  

ఎంపిక షెడ్యూల్‌ ఇలా... 
15వ తేదీన ఉదయం 9 గంటలకు కో–ఆప్షన్‌ సభ్యులు నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో నామినేషన్లు స్క్రూట్నీ చేయనున్నారు. 12 గంటలకు అర్హులైన అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. 1 గంటకు కో–ఆప్షన్‌ మెంబర్‌ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఎంపికైన కో–ఆప్షన్‌ మెంబర్ల పేర్లు ప్రకటించి, తరువాత మధ్యాహ్నం 3 గంటలకు మండల ప్రజాపరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement