ఐదేళ్లు అధికారంలో ఉన్నారు.. కానీ అధికారం లేదు.. విచిత్రంగా ఉంది కదూ.. కానీ వాస్తవం ఇదే. మండల కార్యాలయాల్లోని ఎంపీటీసీ సభ్యులు కేవలం సంతకాలు పెట్టడానికి మాత్రమే పరిమితమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు చేసిన అరాచకానికి ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో.. ప్రజలచేత ఎన్నుకోబడిన వీరు అంతే అవస్థలు పడ్డారు. ప్రజలకు ఏదో చేద్దామని వచ్చిన వారికి నిధులు ఇవ్వలేదు సరికదా.. కనీసం వీరికి ప్రతినెలా ఇచ్చే గౌరవ వేతనం కూడా సక్రమంగా అందివ్వని పరిస్థితి. నేటితో వారి పదవీకాలం కూడా ముగుస్తోంది.
సాక్షి, పెనుగంచిప్రోలు (కృష్ణా): టీడీపీ ప్రభుత్వ పాలనలో జన్మభూమి కమిటీల పుణ్యమా అని పంచాయతీ రాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై పోయింది. సొంత అజెండాతో ముందుకు సాగాల్సిన ఎంపీటీసీ సభ్యులు.. జన్మభూమి కమిటీల పెత్తనంతో ఉత్సవ విగ్రహాలుగా మారారు. దీంతో వారు కేవలం మండల సమావేశాలకే పరిమితం అయ్యారు. దీనికి తోడు ప్రతి నెలా ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా సరిగా ఇవ్వక ఇబ్బందులకు గురి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ పరంగా ప్రజలు తమను ఓట్లు వేసి ఎన్నుకున్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తమ గౌరవానికి ఆటంకం కలిగించిందంటూ విమర్శిస్తున్నారు.
అధికారం పేరుకే.. నిధులన్నీ వారికే..
ప్రజలు ఎన్నుకోబడిన వీరు పేరుకే తప్ప టీడీపీ ప్రభుత్వం వచ్చిన అరకొర నిధులన్నీ వారి నాయకులకే కట్టబెట్టింది. దీంతో వారు గ్రామాల్లో రెచ్చిపోయారు. ప్రతిపక్ష ఎంపీటీసీ సభ్యులపై వివక్ష చూపుతూ నిధులు కేటాయింపులో సక్రమంగా జరగలేదు. దీంతో అభివృద్ధి కుంటు పడింది. ఎంపీటీసీ సభ్యులకు ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు. ప్రజలకు ఏమీ చేయకుండానే పదవీకాలం ముగించాల్సిన పరిస్థితి.
నియోజకవర్గంలో మండలాలు | 3 |
గ్రామ పంచాయతీలు | 58 |
ఎంపీటీసీ స్థానాలు | 52 |
జెడ్పీటీసీ స్థానాలు | 3 |
అందని గౌరవ వేతనం..
స్థానిక ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలకు ప్రభుత్వం ప్రతి నెలా గౌరవ వేతనం కింద రూ.3 వేలు అందించాల్సి ఉంది. అయిదే ఎనిమిది నెలలుగా గౌరవ వేతనం మంజూరు కావటం లేదని పలువురు ఎంపీటీసీ సభ్యులు వాపోతున్నారు. ఐదేళ్లలో ప్రతి సారీ గౌరవ వేతనం సక్రమంగా ఇచ్చిన పాపాన పోలేదని అంటున్నారు.
గుర్తింపు కరువు..
గత ఐదేళ్లలో జన్మభూమి కమిటీల పెత్తనంతో ఎంపీటీసీ సభ్యులు ఉన్నారనే సంగతిని ప్రజలు మర్చి పోయారంటే అతిశయోక్తి కాదు. ఎంపీటీసీ సభ్యులు కేవలం మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు హాజరు కావటం.. సంతకాలు పెట్టటానికే పరిమితం అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు జన్మభూమి కమిటీలే చూశాయి. దీంతో సమావేశాల్లో ఎంపీటీసీ సభ్యులు మాట్లాడినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.
ప్రజాస్వామ్యం ఖూనీ..
జన్మభూమి కమిటీ సభ్యులను రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసి టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఎంపీటీసీలకు ఎలాంటి నిధులు మంజూరు చేయకుండా ప్రతిపక్ష సభ్యులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని విలువలను తుంగలో తొక్కేసింది.
–కుంటముక్కల భద్రమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు, వెంకటాపురం
సమావేశాలకే పరిమితమయ్యాం..
ప్రజల చేత ఎన్నుకున్న మమ్మల్ని గత ప్రభుత్వం కేవలం సమావేశాలకే పరిమితం చేసింది. కేవలం సంతకాలు పెట్టటానికే మమ్మల్ని ఉపయోగించుకున్నారు. ఎటువంటి నిధులు, విధులు లేకుండా చేశారు. ఇంకా ఐదు నెలల గౌరవ వేతనం అందాల్సి ఉంది.
–అంగడాల సాంబశివరావు, ఎంపీటీసీ సభ్యుడు, శనగపాడు
Comments
Please login to add a commentAdd a comment