నిందితురాలు మంజుల
సాక్షి, సిటీబ్యూరో: నీలోఫర్ ఆస్పత్రి నుంచి శిశువును కిడ్నాప్ చేసి, ఆ శిశువు మరణానికి కారణమైన కేసులో నిందితురాలు సత్తూరి మంజుల పోలీసుల చిక్కడానికి ఓ ఆటో వెనుక ఉన్న ప్రకటన కీలకంగా మారింది. దీని ఆధారంగా సదరు ఆటోడ్రైవర్‌ను గుర్తించిన అధికారులు అతడు చెప్పిన వివరాలతో బండరోనిపల్లిలో గాలించారు. అక్కడ దొరికిన వివరాలతో రాజేంద్రనగర్‌లోని కాటేదాన్‌లో నిందితురాలిని పట్టుకోగలిగారు. ఈ కేసు దర్యాప్తుపై సాగిందిలా....
గర్భస్రావం విషయం దాచి...
మహబూబాబాద్ జిల్లా కె.సముద్రానికి చెందిన మంజుల, బండరోనిపల్లికి చెందిన కుమార్ గౌడ్ హైదరాబాద్ కాటేదాన్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో పని చేస్తున్నారు. కుమార్ మూడేళ్ల క్రితం మంజులను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటిసారి గర్భందాల్చిన మంజులకు మూడో నెలలోనే గర్భస్రావమైంది. ఈ ఏడాది రెండోసారి గర్భందాల్చగా... ఐదున్నర నెలలకు అబార్షన్ అయ్యింది. ఈ విషయాన్ని భర్త, కుటుంబీకులకు చెప్పకుండా దాచిన మంజుల తనకు తొమ్మిదో నెల వచ్చే వరకు మేనేజ్ చేసింది. ఆపై శనివారం ప్రసవం కోసం వెళ్తున్నానంటూ భర్తకు చెప్పి అతడిని ఆదివారం రమ్మంటూ పేట్లబురుజు ఆస్పత్రికి వచ్చింది. మూడో నెలలో గర్భవతి కార్డు కోసం, ఆపై మరోసారి వైద్య పరీక్షలకు ఆస్పత్రికి వచ్చిన మంజులకు దీనిపై అవగాహన ఉంది. శనివారం ఆస్పత్రి వరకు చేరుకున్న మంజుల తొలుత ఎవరైనా శిశువులను ఇస్తారేమోనని ప్రయత్నించి విఫలమైంది. ఆ రోజు అన్ని వార్డుల్లో కలియదిరిగినా ఫలితం లేకపోవడంతో రాత్రికి అక్కడే నిద్రించింది.
ఆటో... బస్సు... బైక్‌పై ప్రయాణం...
నగరంలోని ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన పాండు భార్య నిర్మల శుక్రవారం పేట్లబురుజు ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. పొత్తికడుపు సంబంధిత సమస్యతో బా«ధపడుతున్న శిశువును ఆదివారం నీలోఫర్ ఆస్పత్రికి పంపాలని పేట్లబురుజు ఆస్పత్రి వర్గాలు నిర్ణయించాయి. అయితే శిశువు వెంట నిర్మలను తీసుకువెళ్ళడం సాధ్యం కాకపోవడంతో ఆమె తల్లి కల్పన ఆయా కోసం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ఆయాగా వారికి పరిచయమైన మంజుల సహాయం చేస్తున్నట్లు నటిస్తూ నీలోఫర్ వరకు వెళ్ళింది. ఆపై అదును చూసుకుని శిశువును తీసుకుని ఆటోలో ఉడాయించింది. ఆటోలో లక్డీకాపూల్‌లోని సంధ్య హోటల్ వరకు వెళ్లిన మంజుల అక్కడి నుంచి బస్సులో అఫ్జల్‌గంజ్, అటునుంచి పేట్లబురుజు ఆస్పత్రికి చేరుకుంది. అప్పటికే ఆమె భర్త కుమార్‌గౌడ్ అక్కడకు రావడంతో అతడితో కలిసి బైక్‌పై బండరోనిపల్లికి బయలుదేరింది. ఆమన్‌గల్ సమీపంలో బైక్ పంక్చర్ కావడంతో కుమార్ తన భార్య, శిశువును బస్సులో పంపించాడు.
ఆటోడ్రైవర్ కీలక సమాచారం
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నీలోఫర్ ఆస్పత్రి వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. మంజుల శిశువుతో సహా ఓ ఆటో ఎక్కినట్లు కనిపించడంతో దాని నెంబర్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయితే ఆ ఆటో వెనుక వైపు ఓ వ్యాపార ప్రకటన ఉండటంతో దానిపై ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఆధారంగా పోలీసులు వారిని సంప్రదించారు. ముందే ఉన్న ఓ ప్రకటనపై మీ ప్రకటన అతికించినట్లు పోలీసులు చెప్పడంతో తాము కేవలం రెండు ఆటోలకే అతికించామంటూ వారు వివరాలు చెప్పారు. ఆ ఇద్దరు ఆటోడ్రైవర్లను గుర్తించి ప్రశ్నించగా.. ఓ వ్యక్తి సదరు మహిళను లక్డీకాపూల్‌లోని సంధ్య హోటల్ వరకు తీసుకువెళ్ళానని, ఆమెది కల్వకుర్తి ప్రాంతంగా చెప్పినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు కల్వకుర్తి, ఆమన్‌గల్, వెల్దండ తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అనుమానితురాలి ఫొటోతో స్థానికులను ఆరా తీశారు, మంగళవారం సాయంత్రం బండరోనిపల్లికి వెళ్లి ఆరా తీయగా గ్రామానికి చెందిన వృద్ధుడు ఆమెను కుమార్ భార్య మంజులగా గుర్తించాడు.
కాటేదాన్‌లో చిక్కిన కిడ్నాపర్ మంజుల..
రెండు రోజుల క్రితమే మంజుల ప్రసవించిందని, సోమవారం తెల్లవారుజామున శిశువు మరణించడంతో ఖననం చేసి హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్లు చెప్పాడు. దీంతో కుమార్ కోసం ఆరా తీయగా.. ఎవరూ స్పష్టమైన చిరునామా చెప్పలేకపోయారు. నేరచరితుడైన అతడికి ఊరంతా దూరంగా ఉంటుందని తేలింది. చివరకు అతడి సోదరుడి వివరాలు తెలియడంతో నగరంలో పట్టుకున్న పోలీసులు కుమార్ మొదటి భార్య చిరునామా సేకరించారు. ఆమె ద్వారా కుమార్, మంజుల ఇంటిని గుర్తించి మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కుటుంబీకులను ఏమార్చడానికి తానే శిశువును కిడ్నాప్ చేశానని, సోమవారం తెల్లవారుజామున మరణించడంతో ఖననం చేసినట్లు అంగీకరించడంతో కేసు కొలిక్కి వచ్చింది.
నిందితురాలి రిమాండ్
నాంపల్లి: నీలోఫర్ ఆసుపత్రిలో మగ శిశువును కిడ్నాప్ చేసిన మహిళ మంజులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఖనంనం చేసి శిశువు మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు మండల మెజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితురాలిపై ఐపీసీ 363, 304, 201, 75, 84 జెజె, 3(2),(5),(5ఎ),లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ఆర్.సంజయ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment