9వ అంతస్తు నుంచి పడి ఒడిశా యువతి మృతి
హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
వేధింపులు భరించలేనంటూ చివరగా భర్తకు ఫోన్
బాల్కనీ నుంచి కిందకు దిగే ప్రయత్నంలో జారిపడి దుర్మరణం
గచ్చిబౌలి: పిల్లల్లేని జంటకు సరోగసీ (అద్దెగర్భం) ద్వారా బిడ్డను కని ఇచ్చే ఒప్పందంపై హైదరాబాద్ వచ్చిన ఓ యువతి ప్రమాదవశాత్తూ ఓ బహుళ అంతస్తుల భవనంలోని 9వ అంతస్తు నుంచి జారిపడి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. నాలెడ్జ్ సిటీలోని మై హోం భూజ ఈ–బ్లాక్‌లోని 9వ అంతస్తు ఫ్లాట్ నంబర్ 901లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రాజేష్ బాబు (54), జయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు.
వారికి సంతానం లేకపోవడంతో అద్దె గర్భం (సరోగసీ) ద్వారా సంతానం పొందాలనుకున్నారు. ఇందుకోసం రాజేష్ బాబు తన స్నేహితుడి ద్వారా శ్రీకాకుళానికి చెందిన సందీప్ అనే మధ్యవర్తిని సంప్రదించగా అతను ఒడిశాకు చెందిన సంజయ్ సింగ్‌ను సంప్రదించాడు. అందుకు సంజయ్ తన భార్య ఆశ్రిత సింగ్ (25)ను ఒప్పించాడు. దీంతో సరోగసీ ద్వారా సంతానం కలిగితే రూ. 10 లక్షలు అశ్రితకు ఇచ్చేందుకు రాజేష్‌బాబు దంపతులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
మరికొన్ని రోజుల్లో సరోగసీ ప్రక్రియ..
ఆశ్రిత తన భర్త సంజయ్‌తోపాటు నాలుగేళ్ల కొడుకుతో కలిసి అక్టోబర్ 24న మై హోం భూజకు వచ్చింది. అప్పటి నుంచి వాచ్‌మన్ గదిలో సంజయ్, అతని కుమారుడు ఉంటుండగా ఒక బెడ్రూమ్‌లో అశ్రిత ఉంటోంది. ఈలోగా సరోగసీకి చట్టపరమైన అనుమతి కోసం రాజేష్ బాబు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇటీవల ఆశ్రితసింగ్‌ను కోర్టులో హాజరుపరిచారు. డిసెంబర్ మొదటి వారంలో కోర్టు అనుమతి రావాల్సి ఉంది. అనుమతి వచి్చన అనంతరం సరోగసీ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది.
బాల్కనీ నుంచి దిగేందుకు చీరలను వేలాడదీసి
అయితే కొన్ని రోజులుగా ఆశ్రిత తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని చెబుతోంది. కానీ భర్త మాత్రం ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో భర్తకు ఫోన్ చేసిన ఆశ్రిత.. వేధింపులు తాను భరించలేనని.. చనిపోతానని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అయితే అన్నీ సర్దుకుంటాయని భర్త సర్దిజెప్పగా ఆశ్రిత ఫోన్ కట్ చేసింది. గంట తర్వాత ఆశ్రిత మూడు చీరలను ముడేసి బాల్కనీ నుంచి కిందకు వేలాడదీసింది. చీరలను పట్టుకొని కిందకు దిగి పారిపోవాలని భావించి దిగే ప్రయత్నంలో జారి కింద పడటంతో తీవ్ర గాయాలపై అక్కడికక్కడే మృతి చెందింది.
ప్రమాద సమయంలో రాజేష్ దంపతులు ఓ బెడ్రూమ్‌లో ఉండగా మరో బెడ్రూంలో తల్లి, కేర్‌టేకర్‌గా పనిచేసే శ్రీనివాస్ కిచెన్‌లో నిద్రిస్తున్నాడు. సరోగసీకి అంగీకరించిన ఆశ్రిత మనసు మార్చుకుందా లేక రాజేష్ బాబు నుంచి వేధింపులు ఎదురయ్యాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment