మిలియన్ డాలర్ల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష
ఇటలీలో అమల్లోకి కొత్త చట్టం
సరోగసీపై చట్టాన్ని ఇటలీ విస్తృతం చేసింది. సరోగసీ టూరిజాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టం చేసింది. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ప్రతిపాదించిన బిల్లును సెనేట్ 58–84 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ చట్టం 2004 నుంచే ఇటలీలో అమలులో ఉన్న సరోగసీ నిషేధాన్ని యునైటెడ్ స్టేట్స్, కెనడా వంటి దేశాలకు వెళ్లేవారికి వర్తింపజేస్తుంది. దీనిని ఉల్లంఘించిన వారికి ఒక మిలియన్ డాలర్ల వరకు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
అయితే సరోగసీ ద్వారా జని్మంచిన పిల్లలను ఇప్పటికే దేశంలో నమోదు చేసుకున్న తల్లిదండ్రులను ఈ చట్టం ప్రభావితం చేయబోదు. అయితే తమ పిల్లలు పాఠశాలలో చేరి్పంచే సమయంలో సమస్యల పాలవుతామని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సెనేట్ నిర్ణయాన్ని ప్రధానమంత్రి జార్జియా మెలోని స్వాగతించారు. కాగా, కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ సెనేట్ దగ్గర కొందరు నిరసన ప్రదర్శనలు చేశారు.
ఎల్జీబీటీక్యూ జంటలను తల్లిదండ్రులుగా మారకుండా చేసే ఈ చట్టాలు మధ్యయుగాల నాటివని విమర్శించారు. మెలోనీ 2022లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అత్యంత సాంప్రదాయిక సామాజిక ఎజెండాను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. స్వలింగ సంఘాలను చట్టబద్ధం చేసిన చివరి యురోపియన్ దేశాల్లో ఇటలీ ఒకటి. ఇటాలియన్ కేథలిక్ చర్చి ఒత్తిడితో స్వలింగ వివాహాలకు మాత్రం ఇంకా చట్టబద్ధత ఇవ్వలేదు.
పోప్ ఫ్రాన్సిస్ సరోగసీపై ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ నిషేధానికి పిలుపునిచ్చారు. పిల్లలు దేవుడు ఇచ్చే బహుమతి అని, వాణిజ్య ఒప్పందం కాదని నొక్కి చెప్పారు. ఎల్జీబీటీక్యూ వ్యక్తులను చర్చికి స్వాగతిస్తూ ఫ్రాన్సిస్ చర్చి విధానాలను మార్చారు. అబార్షన్, సరోగసీలను మాత్రం బలంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కొత్త చట్టం రాజకీయంగా మెలోనికి సవాలుగా మారవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment