సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జనాలకు.. ముఖ్యంగా ఫ్యాన్స్‌కు ఎక్కడా లేని ఆసక్తి. అయితే సంక్లిష్టమైన అంశాల జోలికి పోయినప్పుడు.. వాళ్లను వివాదాల్లోకి లాగడం తరచూ చూస్తుంటాం. అక్వామ్యాన్ ఫేమ్ హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.
ఐదేళ్ల కిందట నటుడు జానీ డెప్ నుంచి విడాకులు తీసుకున్న అంబర్.. ఆ తర్వాత ఏడాదిపాటు టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌తో డేటింగ్ చేసింది. ఆ బ్రేకప్ తర్వాత నుంచి సోలోగానే ఉంటున్న అంబర్.. సరోగసీ ద్వారా ఆమె బిడ్డను కనడం హాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్‌లో తాను సరోగసీ ద్వారా బిడ్డను కన్నానని, ఆ బిడ్డ పేరు ఉనగ్ పైగె హెర్డ్ అని తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించుకుంది అంబర్ హెర్డ్. ఒళ్లో బిడ్డను పడుకోబెట్టుకున్న ఫొటోను ఆమె షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు తెలిపారు. అయితే..
ఆమె పోస్ట్‌ను పూర్తిగా చదవకుండా.. అర్థం చేసుకోని కొందరు.. ఆమె క్యారెక్టర్‌ను తప్పుబడుతూ కామెంట్లు చేశాడు. ‘ఎవరితో ఆ బిడ్డను కన్నావ్.. సిగ్గు లేదా?’ అంటూ విరుచుకుపడ్డారు. రహస్యంగా బిడ్డను కన్నావా? ఈసారి ఎవరి జీవితాన్ని నాశనం చేస్తావ్? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పనిలో పనిగా ఆమె మీద గుస్సాగా ఉన్న జానీ డెప్ ఫ్యాన్స్.. ఈ వ్యవహారాన్ని మరింత ముదిరేలా చేశారు. అయితే ఆ విమర్శలకు ఆమె శాంతంగానే స్పందిస్తూ.. ఘాటు రిప్లై ఇచ్చింది.
‘నాలుగేళ్ల క్రితమే బిడ్డను కనాలనుకున్నా. ఇప్పటికీ నా కల నెరవేరింది. అయినా నా వ్యక్తిగత జీవితం నా ఇష్టం. నేను ఎవరితో బిడ్డను కంటే మీకేం నొప్పి. సరోగసీ అనేది మీలాంటి వాళ్లకు అర్థం కానీ విషయం. అది అర్థమై ఉంటే మీరు మూర్ఖంగా ఎందుకు మాట్లాడతారు’ అని ఓ మీడియా ఛానెల్ ద్వారా విమర్శకులకు బదులిచ్చింది 35 ఏళ్ల అంబర్ లారా హెర్డ్. కాగా, హాలీవుడ్‌లో టైరా బ్యాంక్స్, జెమ్మీ ఫాలోన్, సారా జెస్సికా పార్కర్, ఎల్టోన్ జాన్.. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు సరోగసీ ద్వారా బిడ్డల్ని కన్నారు. బాలీవుడ్, అంతెందుకు టాలీవుడ్‌లోనూ సరోగసీ ద్వారా బిడ్డల్ని కన్నవాళ్లు ఉన్నారు. వైవాహిక బంధం, కాపురాలపై అయిష్టత ఉన్న వాళ్లు ఎక్కువగా సరోగసీని ఆశ్రయిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment