surrogacy mother
-
సరోగసి ద్వారా బిడ్డను కంటే క్యాన్సర్ వస్తుందా? డాక్టర్లు ఏమంటారంటే..
నేను కెరీర్ ఓరియెంటెడ్. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. దానివల్ల బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం కుదరదు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? – రంజనీ ప్రసాద్, పుణె సరోగసీ ద్వారా పిల్లల కోసం ప్లాన్ చేసినా కొంతమంది.. మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్‌కి ట్రై చేయవచ్చు. దాన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ టైమ్ కన్నా ముందు నుంచే మీరు బ్రెస్ట్ ఫీడ్ ట్రై చేయడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. అందరికీ ఇది సక్సెస్ కాకపోవచ్చు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఏడాది వరకు బ్రెస్ట్ ఫీడింగ్తో నాలుగు నుంచి అయిదు శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి మీద ఆధారపడి పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలుంటాయి. బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వనందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం మాత్రమే మారుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా, సరైన బీఎమ్ఐ ఉండేలా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ .. పోషకాహరం తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. హైరిస్క్ జన్యుపరమైన కారణాలు ఉన్నవారిలో అంటే బీఆర్సీఏ (ఆఖఇఅ) జీన్ పాజిటివ్ అని స్క్రీనింగ్‌లో తేలినవారిలో ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్‌ను తగ్గించవచ్చు. బ్రెస్ట్స్ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్ మార్పులను కనిపెట్టవచ్చు. ఈ రోజుల్లో సరోగసీతో పిల్లల్ని కన్నా కొన్ని మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేలా బిడ్డ.. తల్లి స్పర్శ పొందేలా చూస్తున్నాం. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ -
Health: సరోగసీకి ఎలాంటి వారు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చు?
సరోగసీకి ఎలాంటి వారు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చు?అంటే దానికి ఉండాల్సిన ఆరోగ్య లక్షణాలు ఏమిటి? – కొండపల్లి వాసవి, నందిగామ సరోగసీ అంటే అద్దెకు గర్భాన్ని తీసుకోవడం. ఎవరికైనా గర్భధారణ కష్టమైనప్పుడు గర్భకోశం బిడ్డని మొయ్యలేదని తేలినప్పుడు వాళ్ల అండం.. స్పెర్మ్ టెస్ట్ ట్యూబ్‌లో ఫలదీకరణం చెంది పిండంగా మారాక దాన్ని ఇంకొకరి గర్భంలో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఇంప్లాంట్ చేసి.. వారు డెలివరీ తరువాత బయోలాజికల్ పేరెంట్స్‌కి తిరిగి ఇచ్చేయడం.. ఇదన్న మాట ఆ ప్రక్రియ. మన దేశంలో అయితే కమర్షియల్ సరోగసీకి అనుమతి లేదు. ఎలాంటి డబ్బు ఆశ లేకుండా కేవలం స్వచ్ఛందంగా ఈ పని చేయాలి. ఇండియన్ సరోగసీ యాక్ట్ ప్రకారం పెళ్లయిన దంపతులు ఏవైనా అనారోగ్య సమస్యల వల్ల ప్రెగ్నెన్సీని క్యారీ చేయలేకపోతే.. ఒకసారి మాత్రమే సరోగేట్ ప్రెగ్నెన్సీని మోయాలి. ఐవీఎఫ్‌కి 3 అటెంప్ట్స్ మాత్రమే ప్రయత్నించాలి. శారీరకంగా.. మానసికంగా ఆరోగ్యంగా.. దృఢంగా ఉండాలి. వైద్య ఖర్చులు మాత్రమే తీసుకోవాలి. గోప్యతను పాటించాలి. సరోగసీ కోసం రిజిస్టర్ అయిన సంతానసాఫల్య కేంద్రంలో మాత్రమే ఈ ప్రక్రియను చేయాలి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
‘మనవరాలి’కి జన్మనిచ్చిన 56 ఏళ్ల మహిళ
వాషింగ్టన్: మనవరాలికి నానమ్మ జన్మనివ్వటమేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, సరోగసి పున్యమా అని ఇలాంటి వింత సంఘటనలు ఇటీవల సాధ్యమవుతున్నాయి. 56 ఏళ్ల ఓ మహిళ తన కొడుకు, కోడలి బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది. ఈ సంఘటన అమెరికాలోని ఉతాహ్ ప్రాంతంలో జరిగింది. తన కోడలికి గర్భాశయాన్ని తొలగించిన క్రమంలో ఈ సరోగసి పద్ధతికి తానే అంగీకరించారని, ఆ దంపతులు మరో అవకాశం లేకుండా పోయిందని ద పీపుల్స్ మీడియా పేర్కొంది. ఉతాహ్ ప్రాంతానికి చెందిన జెఫ్ హాక్ అనే వ్యక్తి భార్య కాంబ్రియాకు గర్భాశయం తొలగించారు. ఈ క్రమంలో సరోగసి ద్వారా వారి బిడ్డను కనివ్వడనికి అతడి 56 ఏళ్ల తల్లి నాన్సీ హాక్ ఆఫర్ చేసింది. అయితే, అది సాధ్యం కాదని మొదట వాదించాడు జెఫ్ హాక్. అయితే, వైద్యులు చేసి చూపించారు. జెఫ్ హాక్ తల్లి తన మనవరాలికి జన్మనిచ్చింది. మరోవైపు.. ఆ పాప జెప్ హాక్, కాంబ్రియాల ఐదో సంతానం కావటం గమనార్హం. ఇది ఒక గొప్ప సందర్భమని, ఎంత మంది తన తల్లి జన్మనివటాన్ని చూస్తారని పేర్కొన్నాడు జెఫ్ హాక్. బిడ్డకు జన్మనిచ్చిన క్రమంలో నాన్సీ హాక్ భావోద్వేగానికి గురయ్యారని, అయితే ఆ పాపను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లలేకపోయారని ద పీపుల్స్ పేర్కొంది. నానమ్మ గుర్తుగా పాపకు హన్నా అని నామకరణం చేశారు జెఫ్ హాక్, కాండ్రియా. తన తల్లి ఓరోజు అర్ధరాత్రి నిద్రలేచి తన పేరు హన్నాగా చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు జెఫ్ హాక్. డెలివరీకి ముందే, ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయకముందే కడుపులో ఉంది పాపేనని చేప్పారు నాన్సీ. ఒక మహిళ తన మనవరాలిని మోయడం అనేది అసాధారణమైన విషయమని డాక్టర్ రస్సెల్ ఫౌల్స్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Cambria Hauck (@cambriairene) ఇదీ చదవండి: విలాసవంతమైన ఇంట్లో 43 ఏళ్లపాటు పనిమనిషిగా.. బిడ్డ వల్లే ఇప్పుడు ఏకంగా ఓనర్! -
సెలబ్రిటీ సరొగసీ రచ్చ!
సినీ ప్రముఖుల ప్రతి అంశమూ ఆసక్తికరమే, అనేకసార్లు సంచలనమే. నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులు తల్లితండ్రులైన వార్త అభిమానుల్లో ఆసక్తితో పాటు అనేక చర్చలకూ దారి తీసింది. పెళ్ళయిన 4నెలలకే తల్లితండ్రులైన ఈ దంపతులు బాహాటంగా ప్రకటించకున్నా, సరొగసీ (అద్దె గర్భం) ద్వారానే మగ కవలల్ని కన్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అద్దె గర్భం ప్రక్రియ ఓ వ్యాపారంగా సాగడాన్ని అడ్డుకొనేందుకు కేంద్రం నిరుడు తెచ్చిన చట్టాలు ఉల్లంఘనకు గురయ్యాయని కొందరి అనుమానం. నయన కవలపిల్లల వ్యవహారంలో చట్ట ఉల్లంఘనలు జరిగిందీ, లేనిదీ రాష్ట్ర వైద్యసేవల డైరెక్టరేట్ ద్వారా విచారణ జరుపుతామంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించడంతో కథ మరో మలుపు తిరిగింది. నయనతార దంపతులేమీ అధికారికంగా వివరణ ఇవ్వకపోవడంతో, వ్యక్తిగత వ్యవహారం కాస్తా సెలబ్రిటీ సరొగసీ రచ్చగా మారింది. సరొగసీపై 2021 డిసెంబర్లో భారత పార్లమెంట్ రెండు చట్టాలను ఆమోదించింది. అవి – సరొగసీ (నియంత్రణ) చట్టం, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) నియంత్రణ చట్టం. మొదటి చట్టం దేశంలో సరొగసీ ప్రక్రియ, ఆచరణకు సంబంధించినది. రెండోది ఏఆర్టీ క్లినిక్‌లనూ, బ్యాంకు లనూ పర్యవేక్షించడానికీ, నియంత్రించడానికీ ఉద్దేశించినది. పిల్లలు లేనివాళ్ళు, నిర్ణీత వయస్కులు, అద్దెగర్భమే దిక్కయిన ఆరోగ్యపరిస్థితుల్లోని వారే ఈ చట్టాల కింద సరొగసీకి అర్హులు. గుజరాత్‌లోని ఆనంద్ సహా పలు ప్రాంతాలు అద్దెగర్భాల వ్యాపారానికి అడ్డా కావడంతో, అలాంటి అక్రమాలను ఈ చట్టాలు దేశంలో నిషేధించాయి. సరొగసీతో సంతానం పొందాలనుకొనే దంపతులకు సాయపడే అద్దె తల్లి వారికి రక్తసంబంధీకురాలై ఉండాలనీ పేర్కొన్నాయి. ఈ ఉద్దేశాలన్నీ మంచివే అయినా... సరొగసీ ద్వారా తండ్రి కావాలనుకున్న ఒంటరి మగాడి పట్ల, అలాగే ఒక బిడ్డ ఉన్నప్పటికీ అద్దెగర్భంతో కుటుంబాన్ని విస్తరించుకోవాలనుకొనే వివాహిత స్త్రీ పట్ల ఈ చట్టాలు దుర్విచక్షణతో ఉన్నాయనేది విమర్శ. దీనిపై ఢిల్లీ హైకోర్ట్‌లో ఓ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అలాగే, ఈ చట్టాల్లోని కొన్ని అంశాలను సవాలు చేస్తూ ఓ డాక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీమ్ కోర్ట్ విచారిస్తోంది. నయన, శివన్ 2022 జూన్‌లో చెన్నైలో పెళ్ళి చేసుకొన్నారు. నాలుగు నెలలకే సంతానం కలగడం, నటనలో బిజీగా ఉన్న నయన గర్భవతిగా ఉన్న సూచనలేవీ బయట కనిపించకపోవడం, ఆంతరంగిక వర్గాల కథనం అది అద్దెగర్భమనే అనడంతో ఇంత చర్చా మొదలైంది. నటి కస్తూరి సహా కొందరు ప్రముఖులు, నెటిజన్లు కమర్షియల్ సరొగసీ నిషేధమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసరికి ఇంటికథ రచ్చకెక్కింది. నిజానికి, సంతానం కోసం సెలబ్రిటీలు సరొగసీని ఆశ్రయించడం మన దేశంలోనూ కొత్తేమీ కాదు. హీరో షారుఖ్ ఖాన్ 2013 మేలో తన మూడో బిడ్డ అబ్రామ్ కోసం సరోగసీని ఆశ్రయించినప్పటి నుంచి చర్చ రేగింది. ధనికులు తప్పుడు కారణాలతో అద్దెతల్లుల్ని పెట్టుకుంటున్నారనే వివాదం మొదలైంది. నటి మంచు లక్ష్మి, 2017 మార్చిలో నిర్మాత కరణ్ జోహార్ దాకా పలువురు బిడ్డల కోసం సరొగసీనే ఆశ్రయించారు. సినిమా సహా గ్లామర్ ప్రపంచంలో ఉన్నవారు తమ వృత్తి అవసరాల రీత్యా అద్దె తల్లుల్ని అరువు తెచ్చుకోవడం జరుగుతూనే ఉంది. నైతిక చర్చలు పక్కనపెడితే, అందులో న్యాయ విరుద్ధమేమీ లేదు. పెళ్ళికాక ముందే ఏడేళ్ళుగా 2015 నుంచి నయన, శివన్ రిలేషన్షిప్లో ఉన్నారు. సహ జీవనం సైతం చట్టబద్ధమని కోర్టులే తేల్చాయి. కాబట్టి, పెళ్ళయి అయిదేళ్ళయితేనే సరొగసీకి అర్హులనే చట్ట నిబంధనను వారు ఉల్లంఘించారనే వాదన నిలుస్తుందా? అలాగే, కొత్త సరొగసీ చట్టాలు ఈ ఏడాది జనవరి 25 నుంచి అమలులోకి వచ్చాయి. అప్పటికే అద్దె తల్లులుగా ఉన్నవారి క్షేమం కోసం పది నెలల గర్భధారణ కాలమూ ఇచ్చాయి. దాని ప్రకారం చూస్తే జనవరికి ముందే నయన దంపతులు సరొగసీని ఎంచుకొని ఉంటే, అదీ చట్టవిరుద్ధం అనలేం. కాబట్టి వారి సరొగసీ చట్టవిరుద్ధమనే వాదన చివరకు నిలబడకపోవచ్చు. విచారణలో వివరాలు బయటకొచ్చేదాకా, నయన దంపతులు పెదవి విప్పేదాకా జరిగిందేమిటో తెలియదు. తొందరపడి తీర్పులు చెప్పడమూ భావ్యం కాదు. నిజానికి, సరొగసీ దోపిడీని అరికట్టడానికి పెట్టిన చట్టాలు సైతం పేదలైన వేలాది అద్దెతల్లుల్ని మరింత దోపిడీకి గురి చేస్తున్నాయనే వాదన ఉంది. నయనతారతో పాటు వేలాది కేసుల్లో ఒకవేళ చట్ట ఉల్లంఘనలు జరిగాయనుకున్నా, ప్రతి కేసులో విచారణ అయ్యేపనీ కాదు. వైవాహిక అత్యాచారం సహా అనేకవాటిని నేరంగా తీర్మానించడానికి నిరాకరిస్తున్న మనం ఒక మహిళ తన బతుకుతెరువు కోసం తన దేహాన్ని వాణిజ్య సరొగసీకి వాడి, మరో స్త్రీకి సాయం చేస్తే తప్పేమిటనే వాదనకు జవాబు లేదు. సమాజంలో పెళ్ళికీ, మాతృత్వానికీ ఇచ్చిన అతి ప్రాధాన్యమూ సరొగసీపై చర్చోపచర్చలకు కారణమవుతోంది. అద్దె గర్భంతో బిడ్డను కంటే ఆ స్త్రీ ‘మంచి తల్లి’ కాదంటారా? అలాంటి తప్పుడు మూస ఆలోచన నుంచి మనం బయటపడేదెప్పుడు? నటి ప్రియాంకాచోప్రా, నిక్ జోన్స్ దంపతులు ఆ మధ్య సరొగసీతో సంతానం పొందినప్పుడూ వారిని అనరాని మాటలన్నారు. ఒక మహిళ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుని, తన హక్కును వినియో గించుకుంటే... ‘ఆడవాళ్ళంటే ఇలానే ఉండాలి, ఇలాగే అమ్మతనం పొందా’లంటూ పితృస్వామ్య భావజాలంతో ఒత్తిడి చేయడానికి ఎవరికి ఏం హక్కుంది? ఈ సెలబ్రిటీ సరొగసీ రచ్చతో చర్చకు వచ్చిన అనేక అంశాలను సావధానంగా ఆలోచించాల్సిందే! సమాజం సమాధానం చెప్పాల్సిందే! -
సరోగసి తల్లికీ మాతృత్వపు సెలవు
సాక్షి, అమరావతి/కాకినాడ: సరోగసి(అద్దె గర్భం) ద్వారా తల్లి అయిన ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌కు మాతృత్వపు సెలవు మంజూరు చేయని పలువురు అధికారుల తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఆమెకు కూడా మాతృత్వపు సెలవు మంజూరు చేయాల్సిందేనని ఆదేశించింది. ఈ మాతృత్వపు సెలవు ఇదే వ్యాజ్యంలో తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య డైరెక్టర్, రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కాకినాడకు చెందిన ఉండమట్ల మురళీకృష్ణ ఆడిటర్‌గా పని చేస్తుండగా, ఆమె భార్య డాక్టర్ కిరణ్మయి రంగరాయ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కిరణ్మయి గత నెలలో సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లి అయ్యారు. మాతృత్వపు సెలవు కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు తిరస్కరించారు. దీంతో కిరణ్మయి గత నెల 24న హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ జయసూర్య అధికారుల తీరును ఆక్షేపించారు. విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేశారు. -
విడాకులైన ఐదేళ్లకు బిడ్డా!.. ఎవరితో కన్నావ్?
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జనాలకు.. ముఖ్యంగా ఫ్యాన్స్‌కు ఎక్కడా లేని ఆసక్తి. అయితే సంక్లిష్టమైన అంశాల జోలికి పోయినప్పుడు.. వాళ్లను వివాదాల్లోకి లాగడం తరచూ చూస్తుంటాం. అక్వామ్యాన్ ఫేమ్ హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఐదేళ్ల కిందట నటుడు జానీ డెప్ నుంచి విడాకులు తీసుకున్న అంబర్.. ఆ తర్వాత ఏడాదిపాటు టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌తో డేటింగ్ చేసింది. ఆ బ్రేకప్ తర్వాత నుంచి సోలోగానే ఉంటున్న అంబర్.. సరోగసీ ద్వారా ఆమె బిడ్డను కనడం హాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్‌లో తాను సరోగసీ ద్వారా బిడ్డను కన్నానని, ఆ బిడ్డ పేరు ఉనగ్ పైగె హెర్డ్ అని తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించుకుంది అంబర్ హెర్డ్. ఒళ్లో బిడ్డను పడుకోబెట్టుకున్న ఫొటోను ఆమె షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు తెలిపారు. అయితే.. ఆమె పోస్ట్‌ను పూర్తిగా చదవకుండా.. అర్థం చేసుకోని కొందరు.. ఆమె క్యారెక్టర్‌ను తప్పుబడుతూ కామెంట్లు చేశాడు. ‘ఎవరితో ఆ బిడ్డను కన్నావ్.. సిగ్గు లేదా?’ అంటూ విరుచుకుపడ్డారు. రహస్యంగా బిడ్డను కన్నావా? ఈసారి ఎవరి జీవితాన్ని నాశనం చేస్తావ్? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పనిలో పనిగా ఆమె మీద గుస్సాగా ఉన్న జానీ డెప్ ఫ్యాన్స్.. ఈ వ్యవహారాన్ని మరింత ముదిరేలా చేశారు. అయితే ఆ విమర్శలకు ఆమె శాంతంగానే స్పందిస్తూ.. ఘాటు రిప్లై ఇచ్చింది. ‘నాలుగేళ్ల క్రితమే బిడ్డను కనాలనుకున్నా. ఇప్పటికీ నా కల నెరవేరింది. అయినా నా వ్యక్తిగత జీవితం నా ఇష్టం. నేను ఎవరితో బిడ్డను కంటే మీకేం నొప్పి. సరోగసీ అనేది మీలాంటి వాళ్లకు అర్థం కానీ విషయం. అది అర్థమై ఉంటే మీరు మూర్ఖంగా ఎందుకు మాట్లాడతారు’ అని ఓ మీడియా ఛానెల్ ద్వారా విమర్శకులకు బదులిచ్చింది 35 ఏళ్ల అంబర్ లారా హెర్డ్. కాగా, హాలీవుడ్లో టైరా బ్యాంక్స్, జెమ్మీ ఫాలోన్, సారా జెస్సికా పార్కర్, ఎల్టోన్ జాన్.. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు సరోగసీ ద్వారా బిడ్డల్ని కన్నారు. బాలీవుడ్, అంతెందుకు టాలీవుడ్‌లోనూ సరోగసీ ద్వారా బిడ్డల్ని కన్నవాళ్లు ఉన్నారు. వైవాహిక బంధం, కాపురాలపై అయిష్టత ఉన్న వాళ్లు ఎక్కువగా సరోగసీని ఆశ్రయిస్తుంటారు. View this post on Instagram A post shared by Amber Heard (@amberheard) చదవండి: సినిమాటోగ్రఫీ చట్టం సవరణలపై నిరసనలు -
వివరం: తొమ్మిది నెలల అమ్మ!
అమ్మ ఎప్పటికీ అమ్మే. అమ్మకు ప్రతి బిడ్డా ఒక మాతృత్వపు మధురిమే. ఏ అమ్మా తొమ్మిది నెలలు మాత్రమే అమ్మగా ఉండదు. ఏ బిడ్డా కడుపులో ఉన్నంత కాలమే బిడ్డగా ఉండదు. మరి ‘సరొగసీ మదర్’ మాటేమిటి? ఆమె కూడా అమ్మే కదా! కాకపోతే, బిడ్డను మోసి, కని ఇచ్చేసే అమ్మ! కన్నతల్లికీ, కని ఇచ్చే తల్లికీ బిడ్డపై ఒకే రకమైన మమకారం ఉంటుంది. అయితే ఒక్కటే తేడా! ఉపకారాన్ని పొంది, మమకారాన్ని వదులుకుంటుంది సరోగసి మదర్. మమకారం కోసం ఉపకారాన్ని ప్రతిఫలంగా ఇస్తుంది బిడ్డలు లేని తల్లి. ఈ నేపథ్యంలో - సరోగసి మదర్ ఉద్వేగాల వీక్షణే ఈవారం ‘వివరం’. మదర్స్ డే సందర్భంగా... గత నెల 20వ తేదీన ఢిల్లీలో ‘ఇండియన్ సొసైటీ ఫర్ థర్ట్ పార్టీ రీప్రొడక్షన్’ వారు ఒక ర్యాలీ నిర్వహించారు. అందులో వైద్యులతో పాటు కొందరు సరోగేట్స్ (బిడ్డను కనిచ్చే తల్లులు) కూడా పాల్గొన్నారు. అపోహలు మాని సరోగసీని ప్రోత్సహించమని పిలుపునిచ్చారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వందలాది వైద్యలు ‘‘సరోగసి అంటే తల్లీబిడ్డల్ని విడదీయడం కాదు... మాతృత్వానికి నోచుకోని అభాగ్యురాలికి బిడ్డను ప్రసాదించడం’’అంటూ గొంతెత్తి చాటారు. ‘‘సరోగసి విధానంతో బిడ్డను పొందడాన్ని భూతద్దంలో పెట్టి చూడకండి’’ అని వేడుకున్నారు. అయితే తొమ్మిదినెలలు మోసి, పురిటి నొప్పులు భరించి బిడ్డను కన్న తర్వాత...అక్కడితో ఆ ‘బంధం’ తీరిపోతుందంటున్న ఈ వైద్యుల మాటతో మాట కలపనివారు చాలామందే ఉన్నారు. వారంతా సరోగేట్ మదర్ అంటుంటే... వైద్యులు మాత్రం సరోగేట్ క్యారియర్ అంటున్నారు. పిలుపు ఏదైనా ఫలితం మాత్రం ‘కన్నబిడ్డ’. ఎవరికి ‘కన్న’ బిడ్డ అన్నదే విషయం. ఇక్కడ అవసరం.. అమ్మ కావాలనుకున్నవారిదా? అద్దెకు గర్భం ఇచ్చేవారిదా! సరోగసి అంటే ఇంకొకరి గర్భం సహాయంతో బిడ్డను పొందడం. అసలు తల్లిదండ్రుల శుక్రకణం, అండంతో ప్రయోగశాలలో అభివృద్ధి పరచిన పిండాన్ని (ఎంబ్రియో) సరోగేట్ మదర్ (ఆ పిండాన్ని నవమాసాలు మోసి కని ఇవ్వడానికి సిద్ధపడిన స్త్రీ) గర్భంలో ప్రవేశ పెడతారు. ఆ క్షణం నుంచి ప్రసవం అయ్యేవరకూ తల్లిగా నిర్వర్తించే ప్రతి బాధ్యతను ఆమె తు.చ తప్పకుండా నెరవేరుస్తుందన్నమాట! తెలియని వ్యక్తికి ఇంట్లో చోటివ్వాలంటేనే సవాలక్ష భయాలు...అలాంటిది తన గర్భసంచిలో మరొకరి బిడ్డకు తొమ్మిదినెలలు చోటిచ్చి పెంచి పెద్దచేయడమంటే మాటలు కాదు కదా! సొంత వ్యవహారానికి, పరాయి వాళ్లకోసం చేసే పనికి బోలెడంత వ్యత్యాసం ఉంటుంది. కడుపులో ఉన్నది సొంతబిడ్డయితే మన మనసుకు తోచినట్టుగా మలుసుకుంటాం. తినే తిండి దగ్గర నుంచి అన్నింటిలో మనకు నచ్చినట్టే చేస్తాం. అయితే సరోగేట్ అయినవారి జీవనశైలి అందుకు భిన్నంగా ఉంటుంది. అంతా వైద్యుల పర్యవేక్షణలో ఆ తొమ్మిది నెలలు గడుస్తాయి. కానీ అదంత సులువు కాదేమోనని ఓ సరోగేట్ మదర్‌తో మాట్లాడినప్పుడు అనిపించింది. ‘‘మాది మహబూబ్‌నగర్ జిల్లాల ఓ పల్లెటూరు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. నేను, నా భర్త ఇద్దరం వ్యవసాయ కూలీలం. సంవత్సరం కిందట నా భర్తకు టీబీ వచ్చింది. వైద్యం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. ఇప్పుడు పనికి పోకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఎవరో ఒకామె సరోగసి గురించి చెప్పింది. ఓ ఏడాది హైదరాబాద్‌లోనే ఉండి బిడ్డని కనిస్తే రెండు లక్షలిస్తరని చెబితే వచ్చిన. ఇప్పుడు నాకు ఆరోనెల. ఇంక నాలుగు నెలలు ఓపిక పడితే పైసలు తీసుకుని ఊరికిపోవచ్చు’’ అని లక్ష్మమ్మ(పేరు మార్చాం) చెప్పిన మాటల్లో అర్థమైన విషయం ఏమిటంటే... పరిస్థితుల రీత్యా మాత్రమే కొంతమంది మహిళలు సరోగేట్‌గా మారుతున్నారని. ‘‘మరి నీకు ఇద్దరూ ఆడపిల్లలే కదా! ఇప్పుడు నీ కడుపున మగపిల్లవాడు పుడితే?’’ అని లక్ష్మమ్మను ప్రశ్నించినపుడు...‘‘నా బిడ్డగానప్పుడు మగైతే ఏంది, ఆడైతే ఏంది? ఏమో పుట్టిన తర్వాత నా మనసేమైనా బిడ్డమీదికి గుంజుతదేమో! అయినా చేసేదేంది? ఊకే కంటున్నమా! పైసలు తీసుకుంటున్నప్పుడు పనిని పనిలెక్కనే చేయాలేకదా!’’ అని ఆమె చెప్పే సమాధానంలో మనం తెలుసుకోవాల్సిన వాస్తవాలు కొన్ని ఉన్నాయి. మితిమీరిన ఆర్థిక ఇబ్బందుల మధ్యన నలిగిపోయే మహిళలు మాత్రమే సరోగేట్ అయ్యేందుకు సిద్ధపడుతున్నారు. అది కూడా భర్తల అంగీకారంతోనే చేస్తున్నారు కాబట్టే కుటుంబం పరంగా సరోగేట్స్ ఎవరూ ఇబ్బందులు ఎదుర్కొనడం లేదు. ‘‘నా భర్త, పిల్లలు వారానికొకసారి వచ్చి చూసిపోతుంటారు. వచ్చినపుడు పళ్లు పట్టుకొస్తారు.‘‘ఎందుకు పైసల ఖర్చు. ఇక్కడ అన్ని పెడతరు కదా! అంటే...‘వాళ్లు పెట్టేది బిడ్డ కోసమే. నేను నీ కోసం తెచ్చిన’ అంటడు నా భర్త’’ అని లక్ష్మమ్మ చెప్పిన మాట ఎలాంటి హృదయాన్నైనా కదిలిస్తుంది. కుటుంబం కోసం భార్య పడుతున్న కష్టానికి ఆమె భర్త పండ్లు తెచ్చి కొంత రుణం తీర్చుకుంటే, రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలవరకు డబ్బులిచ్చి వైద్యులు కొంత రుణం తీర్చుకుంటున్నారు. బిడ్డను కావాలనుకునేవారి దగ్గర నుంచి మాత్రం వైద్యులు 8-10 లక్షల రూపాయలు తీసుకుంటారు. సరోగేట్కి అయ్యే ఖర్చుతో పాటు మిగతా ఖర్చులన్నీ కూడా ఎక్కువే కాబట్టి మన దేశంలో ఇది సాధారణ ధర. బిడ్డను కావాలనుకుంటున్నవారు విదేశీయులైతే ఖరీదుల విషయంలో కొంచెం మార్పులుంటాయి. వైద్యుల మాట ‘‘సరోగేట్ కేవలం బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలను మాత్రమే అందిస్తుంది. తన అండాన్ని ఇవ్వదు, రక్తాన్ని పంచదు. తన కడుపులో పెరుగుతున్నది తన బిడ్డ కాదన్నది తనకు ముందే తెలుసు. పైగా ఆమెకు అది మొదటి సంతానం కాదు కదా! ఒకరిద్దరు పిల్లల్ని కని...వారి భవిష్యత్తు కోసం సరోగేట్ అవుతోంది. పైగా వాళ్లు మనసుని ఇబ్బంది పెట్టుకుని చేస్తున్న పని కాదు. అన్ని విషయాల్లో చాలా స్పష్టమైన అవగాహనకు వచ్చాకనే సరోగేట్ అవ్వడానికి సిద్దపడుతున్నారు. ఇంతవరకూ ఏ ఒక్క సరోగేట్ కూడా మాకు ఫోన్ చేసి బిడ్డ వివరాలు అడగలేదంటే విషయం అర్థం చేసుకోండి. ఏదో ఒకరిద్దరు మాత్రం బిడ్డ క్షేమం అడిగారు. దానికి కారణం కూడా ఆ పిల్లలు కొద్దిగా బలహీనంగా పుట్టారు. ‘ఏమ్మా... బిడ్డపై బెంగ పెట్టుకున్నావా!’ అనడిగితే...‘లేదు సార్...బిడ్డ కోసం అన్ని లక్షలు ఖర్చుపెట్టారు. పాపం...ఆరోగ్యంగా లేకపోతే బాధపడతారు కదా!’ అని అందామె. వారు తీసుకున్న డబ్బులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలన్న వారి తపనకు ఇది నిదర్శంన. అనవసరమైన భావోద్వేగాలకు లోనవ్వడం ఇక్కడ న్యాయం కాదు. సొంతపిల్లలకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనుకుని వచ్చే సరోగేట్స్ ఎలాంటి పరిస్థితుల్లోను తన పొట్టలో పెరుగుతున్న పొరుగుబిడ్డపై ప్రేమను పెంచుకోలేరు. పెంచుకోకూడదు’’ అని కచ్చితంగా చెబుతున్నారు హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ ఇన్ఫెర్టిలిటి సెంటర్ వైద్యులు. ‘‘ఆపరేషన్ చేసేప్పుడు పొట్టను కత్తితో చీరాలి. ఆ సమయంలో డాక్టర్లు అయ్యో... రక్తం పోతుంది, బంగారంలాంటి పొట్టకు గాయమైపోయిందే...అంటూ తలపట్టుకోవడం ఎంత తప్పో, ఎదుటివారికోసం బిడ్డను మోసిపెడతానని మాటిచ్చి ఆ బిడ్డపై ప్రేమను పెంచుకోవడం కూడా అంతే తప్పు. మానసికంగా చిన్నపాటి సంఘర్షణ ఉన్నప్పటికీ దానిని అధిగమించడం సరోగేట్ పాటించాల్సిన మొదటి సూత్రం’’ అని మరొక ఇన్ఫెర్టిలిటి సెంటర్ వైద్యుల వాదన. నిజమే! రోజురోజుకీ పెరుగుతున్న సరోగేట్స్ సంఖ్యను చూస్తుంటే కడుపులో పెరుగుతున్న పొరుగుబిడ్డపై వారు పెద్దగా భావోద్వేగాలు పెంచుకోవడంలేదనే తెలుస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విశేషం ఏమిటంటే... ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాన సరోగేట్స్ సంఖ్య పెద్దగా పెరగడంలేదు. మన రాష్ట్రంలో మరీ తక్కువగా ఉంది. సరోగేట్ సౌకర్యం కల్పించే సెంటర్లు మాత్రం పదులసంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఉత్తర భారతంలో... పదిహేనేళ్ల కిందట సరోగేట్ ద్వారా బిడ్డను పొందిన జపనీస్ దంపతులకు బిడ్డను అప్పగించకూడదంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అప్పటివరకూ ఎవరికీ సరోగేట్ పద్ధతి గురించి తెలియదు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత సరోగేట్ అంటే అక్రమ సంబంధం కాదని, కేవలం ప్రయోగశాల ప్రమేయంతో తయారయిన పిండాన్ని గర్భంలో పెట్టడమేనని...అందరికీ తెలిసింది. అప్పటివరకూ అదో దైవరహస్యంగా ఉండేది. మన దేశంలో మొదటిసారి గుజరాత్లో ‘ఆకాంక్ష ఇన్ఫెర్టిలిటి అండ్ ఐవిఎఫ్ క్లినిక్’ పేరుతో నయనా పటేల్ అనే డాక్టర్ సరోగసిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘బేబీ ఫ్యాక్టరీ’ పేరుతో విదేశీయులకు సరోగేట్ బిడ్డల్ని అందించడంలో బాగా పేరుగాంచారు. నయనాపటేల్ మాత్రం ఒక్కో సరోగేట్ తల్లికి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఒక్క గుజరాత్లో అనే కాదు...ఉత్తరాన చాలాప్రాంతాల్లోని మహిళలు సరోగేట్ అవ్వడానికి ముందుకొస్తున్నారు. అయితే సరోగసిని కేవలం ఒక ఆదాయ మార్గంగా భావించే వారి ఆలోచనతీరే వారిని ప్రోత్సహిస్తోందన్నది వైద్యుల మాట. ‘‘వారితో పోలిస్తే దక్షిణాన మహిళలు సరోగేట్ అవడం పట్ల అంత సుముఖతగా లేనట్టే. రావడమే బోలెడన్ని అపోహలు, భయాలు, ఆందోళనలతో వస్తారు. మేం చెప్పిన అన్ని విషయాలు విన్నాక కాస్త సర్దుకుంటారు. సరోగేట్ అవ్వడానికి సిద్దపడ్డాక ఇక ఎలాంటి సమస్యను జోలికి రానివ్వరు. అదే ఉత్తరభారత దేశంలో అయితే నేరుగా వైద్యమే. కౌన్సెలింగ్‌లతో పెద్దగా పనిలేదు’’ అని చెప్పుకొచ్చారు మన రాష్ట్రానికి చెందిన ఓ ఇన్ఫెర్టిలిటి డాక్టర్. సరోగేట్ సేవ కాదు, అలాగని వ్యాపారం కాదు...‘డబ్బులేని వారికి డబ్బు ఇస్తున్నాం, బిడ్డలేని వారికి బిడ్డనిస్తున్నాం’ అని చెబుతున్న వైద్యల మాటలో మనకి తెలియని మరో విషయం ఉంది. రెండు లక్షల రూపాయల వల్ల ఓ బిడ్డ భూమ్మీదకు రాలేదు. పేద మహిళలకు సరోగసి వరమైతే, పిల్లలు పుట్టనివారికి సరోగేట్ దేవత. ఎలాంటి పరిస్థితుల్లో సరోగేట్ అవసరం? * గర్భాశయం లేనివారికి(జన్యులోపం కారణంగా) * ఏదైనా కారణంగా గర్భాశయం తొలిగించబడ్డవారికి(క్యాన్సర్ వంటి జబ్బులకారణంగా) * జన్మతః గర్భాశయ నిర్మాణం లోపభూయిష్టంగా ఉండడం వల్ల * పదే పదే గర్భస్రావం అవుతున్నవారికి * టెస్ట్‌ట్యూబ్ బేబీ ఫెయిల్ అయినపుడు * గుండెజబ్బుతో బాధపడుతున్నవారికి * వెన్నెముక సంబంధిత సమస్యలున్నవారికి నిబంధనలు సరోగేట్ ద్వారా బిడ్డను పొందాలనుకునేవారికి, వైద్యులకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వారు సూచించిన మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి: * సరోగేట్ అవ్వాలనుకునేవారి వయసు 21 నుంచి 35 వరకూ ఉండాలి. * ముగ్గురు పిల్లలకన్నా ఎక్కువున్నవారు సరోగేట్కి అర్హులు కాదు. * పెళ్లయిన మహిళ అయితే తప్పనిసరిగా భర్త అంగీకారం తీసుకోవాలి. * భారతీయ మహిళ మాత్రమే మనదేశంలో సరోగసికీ అర్హురాలు * సరొగేట్ అయ్యే మహిళ ఆరోగ్యం అన్నివిధాలుగా బాగుండాలి. హెచ్ఐవి, మధుమేహం, రక్తపోటు, కిడ్నీ, హృద్రోగ సంబంధిత అనారోగ్యాలుంటే గనక సరోగసీకి అనర్హులు. - భువనేశ్వరి ఇండియన్ సరోగేట్కే డిమాండు ఎక్కువ! విదేశీయులు చాలామంది ఇండియన్ సరోగేట్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ దేశస్థులు చాలావరకూ సరోగసి కోసం మనదేశం వస్తున్నారు. రెండే రెండు కారణాలు వారిని ఇక్కడికి రప్పిస్తున్నాయి. మొదటిది... ఖరీదు. అమెరికన్ సరోగేట్ ద్వారా బిడ్డను పొందాలంటే మన కరెన్సీలో దాదాపు 25 నుంచి 40 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఆసుపత్రి, వైద్యుల ఖర్చు పక్కన పెడితే ఒక్క సరోగేట్కే 8 నుంచి 14 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదే మన దేశంలో అయితే రెండు నుంచి నాలుగు లక్షల రూపాయలకే సరోగేట్ అందుబాటులో ఉంటుంది. అలాగే మొత్తం ఖర్చు కూడా 10 నుంచి 12 లక్షల లోపే ఉంటుంది. ఇక రెండవ కారణం: అమెరికా సరోగసి నియమాల ప్రకారం బిడ్డను పొందాలనుకునేవారికి సరోగేట్ని చూపించకూడదు. అదే భారతదేశంలో అయితే సరోగేట్ని కలవొచ్చు. పైగా మన దేశంలో సరోగేట్ అవసరం ఉందని చెప్పగానే కొన్నిరోజుల సమయంలోనే సిద్దం చేయగలరు. అదే అమెరికా, బ్రిటన్‌లో అయితే సరోగేట్ అందుబాటులోకి రావడానికి కనీసం ఆరు నుంచి ఏడాది సమయం పడుతుంది. వీటితో పాటు ఇక్కడ ఐవీఎఫ్ వైద్యం, అండ దాతలు కూడా చాలా చవక. ఇలాంటి రకరకాల కారణాల వల్ల విదేశీయులు ఇండియన్ సరోగసి విధానాన్ని ఉపయోగించుకోడానికి ముందుకొస్తున్నారు.