వివరం: తొమ్మిది నెలల అమ్మ! | Mothers' Day: Mother of become surrogate for neighbour | Sakshi
Sakshi News home page

వివరం: తొమ్మిది నెలల అమ్మ!

Published Sun, May 11 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

వివరం: తొమ్మిది నెలల అమ్మ!

వివరం: తొమ్మిది నెలల అమ్మ!

అమ్మ ఎప్పటికీ అమ్మే. అమ్మకు ప్రతి బిడ్డా ఒక మాతృత్వపు మధురిమే. ఏ అమ్మా తొమ్మిది నెలలు మాత్రమే అమ్మగా ఉండదు. ఏ బిడ్డా కడుపులో ఉన్నంత కాలమే బిడ్డగా ఉండదు. మరి ‘సరొగసీ మదర్’ మాటేమిటి? ఆమె కూడా అమ్మే కదా! కాకపోతే, బిడ్డను మోసి, కని ఇచ్చేసే అమ్మ! కన్నతల్లికీ, కని ఇచ్చే తల్లికీ బిడ్డపై ఒకే రకమైన మమకారం ఉంటుంది. అయితే ఒక్కటే తేడా! ఉపకారాన్ని పొంది, మమకారాన్ని వదులుకుంటుంది సరోగసి మదర్. మమకారం కోసం ఉపకారాన్ని ప్రతిఫలంగా ఇస్తుంది బిడ్డలు లేని తల్లి. ఈ నేపథ్యంలో -  సరోగసి మదర్ ఉద్వేగాల వీక్షణే ఈవారం ‘వివరం’. మదర్స్ డే సందర్భంగా...
 
గత నెల 20వ తేదీన ఢిల్లీలో ‘ఇండియన్ సొసైటీ ఫర్ థర్ట్ పార్టీ రీప్రొడక్షన్’ వారు ఒక ర్యాలీ నిర్వహించారు. అందులో వైద్యులతో పాటు కొందరు సరోగేట్స్ (బిడ్డను కనిచ్చే తల్లులు) కూడా పాల్గొన్నారు. అపోహలు మాని సరోగసీని ప్రోత్సహించమని పిలుపునిచ్చారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వందలాది వైద్యలు ‘‘సరోగసి అంటే తల్లీబిడ్డల్ని విడదీయడం కాదు... మాతృత్వానికి నోచుకోని అభాగ్యురాలికి బిడ్డను ప్రసాదించడం’’అంటూ గొంతెత్తి చాటారు. ‘‘సరోగసి విధానంతో బిడ్డను పొందడాన్ని భూతద్దంలో పెట్టి చూడకండి’’ అని వేడుకున్నారు. అయితే తొమ్మిదినెలలు మోసి, పురిటి నొప్పులు భరించి బిడ్డను కన్న తర్వాత...అక్కడితో ఆ ‘బంధం’ తీరిపోతుందంటున్న ఈ వైద్యుల మాటతో మాట కలపనివారు చాలామందే ఉన్నారు. వారంతా సరోగేట్ మదర్ అంటుంటే... వైద్యులు మాత్రం సరోగేట్ క్యారియర్ అంటున్నారు. పిలుపు ఏదైనా ఫలితం మాత్రం ‘కన్నబిడ్డ’. ఎవరికి ‘కన్న’ బిడ్డ అన్నదే విషయం. ఇక్కడ అవసరం.. అమ్మ కావాలనుకున్నవారిదా? అద్దెకు గర్భం ఇచ్చేవారిదా!
 
సరోగసి అంటే ఇంకొకరి గర్భం సహాయంతో బిడ్డను పొందడం. అసలు తల్లిదండ్రుల శుక్రకణం, అండంతో ప్రయోగశాలలో అభివృద్ధి పరచిన పిండాన్ని (ఎంబ్రియో) సరోగేట్ మదర్  (ఆ పిండాన్ని నవమాసాలు మోసి కని ఇవ్వడానికి సిద్ధపడిన స్త్రీ) గర్భంలో ప్రవేశ పెడతారు. ఆ క్షణం నుంచి ప్రసవం అయ్యేవరకూ తల్లిగా నిర్వర్తించే ప్రతి బాధ్యతను ఆమె తు.చ తప్పకుండా నెరవేరుస్తుందన్నమాట! తెలియని వ్యక్తికి ఇంట్లో చోటివ్వాలంటేనే సవాలక్ష భయాలు...అలాంటిది తన గర్భసంచిలో మరొకరి బిడ్డకు తొమ్మిదినెలలు చోటిచ్చి పెంచి పెద్దచేయడమంటే మాటలు కాదు కదా! సొంత వ్యవహారానికి, పరాయి వాళ్లకోసం చేసే పనికి బోలెడంత వ్యత్యాసం ఉంటుంది. కడుపులో ఉన్నది సొంతబిడ్డయితే మన మనసుకు తోచినట్టుగా మలుసుకుంటాం. తినే తిండి దగ్గర నుంచి అన్నింటిలో మనకు నచ్చినట్టే చేస్తాం. అయితే సరోగేట్ అయినవారి జీవనశైలి అందుకు భిన్నంగా ఉంటుంది. అంతా వైద్యుల పర్యవేక్షణలో ఆ తొమ్మిది నెలలు గడుస్తాయి. కానీ అదంత సులువు కాదేమోనని ఓ సరోగేట్ మదర్‌తో మాట్లాడినప్పుడు అనిపించింది.  
 
‘‘మాది మహబూబ్‌నగర్ జిల్లాల ఓ పల్లెటూరు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. నేను, నా భర్త ఇద్దరం వ్యవసాయ కూలీలం. సంవత్సరం కిందట నా భర్తకు టీబీ వచ్చింది. వైద్యం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. ఇప్పుడు పనికి పోకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఎవరో ఒకామె సరోగసి గురించి చెప్పింది. ఓ ఏడాది హైదరాబాద్‌లోనే ఉండి బిడ్డని కనిస్తే రెండు లక్షలిస్తరని చెబితే వచ్చిన. ఇప్పుడు నాకు ఆరోనెల. ఇంక నాలుగు నెలలు ఓపిక పడితే పైసలు తీసుకుని ఊరికిపోవచ్చు’’ అని లక్ష్మమ్మ(పేరు మార్చాం) చెప్పిన మాటల్లో అర్థమైన విషయం ఏమిటంటే... పరిస్థితుల రీత్యా మాత్రమే కొంతమంది మహిళలు సరోగేట్‌గా మారుతున్నారని. ‘‘మరి నీకు ఇద్దరూ ఆడపిల్లలే కదా! ఇప్పుడు నీ కడుపున మగపిల్లవాడు పుడితే?’’ అని లక్ష్మమ్మను ప్రశ్నించినపుడు...‘‘నా బిడ్డగానప్పుడు మగైతే ఏంది, ఆడైతే ఏంది? ఏమో పుట్టిన తర్వాత నా మనసేమైనా బిడ్డమీదికి గుంజుతదేమో! 

అయినా చేసేదేంది? ఊకే కంటున్నమా! పైసలు తీసుకుంటున్నప్పుడు పనిని పనిలెక్కనే చేయాలేకదా!’’ అని ఆమె చెప్పే సమాధానంలో మనం తెలుసుకోవాల్సిన వాస్తవాలు కొన్ని ఉన్నాయి. మితిమీరిన ఆర్థిక ఇబ్బందుల మధ్యన నలిగిపోయే మహిళలు మాత్రమే సరోగేట్ అయ్యేందుకు సిద్ధపడుతున్నారు. అది కూడా భర్తల అంగీకారంతోనే చేస్తున్నారు కాబట్టే కుటుంబం పరంగా సరోగేట్స్ ఎవరూ ఇబ్బందులు ఎదుర్కొనడం లేదు. ‘‘నా భర్త, పిల్లలు వారానికొకసారి వచ్చి చూసిపోతుంటారు. వచ్చినపుడు పళ్లు పట్టుకొస్తారు.‘‘ఎందుకు పైసల ఖర్చు. ఇక్కడ అన్ని పెడతరు కదా! అంటే...‘వాళ్లు పెట్టేది బిడ్డ కోసమే. నేను నీ కోసం తెచ్చిన’ అంటడు నా భర్త’’ అని లక్ష్మమ్మ చెప్పిన మాట ఎలాంటి హృదయాన్నైనా కదిలిస్తుంది.
 
 కుటుంబం కోసం భార్య పడుతున్న కష్టానికి ఆమె భర్త పండ్లు తెచ్చి కొంత రుణం తీర్చుకుంటే, రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలవరకు డబ్బులిచ్చి వైద్యులు కొంత రుణం తీర్చుకుంటున్నారు. బిడ్డను కావాలనుకునేవారి దగ్గర నుంచి మాత్రం వైద్యులు 8-10 లక్షల రూపాయలు తీసుకుంటారు. సరోగేట్‌కి అయ్యే ఖర్చుతో పాటు మిగతా ఖర్చులన్నీ కూడా ఎక్కువే కాబట్టి మన దేశంలో ఇది సాధారణ ధర. బిడ్డను కావాలనుకుంటున్నవారు విదేశీయులైతే ఖరీదుల విషయంలో కొంచెం మార్పులుంటాయి.
 
 వైద్యుల మాట
 ‘‘సరోగేట్ కేవలం బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలను మాత్రమే అందిస్తుంది. తన అండాన్ని ఇవ్వదు, రక్తాన్ని పంచదు. తన కడుపులో పెరుగుతున్నది తన బిడ్డ కాదన్నది తనకు ముందే తెలుసు. పైగా ఆమెకు అది మొదటి సంతానం కాదు కదా! ఒకరిద్దరు పిల్లల్ని కని...వారి భవిష్యత్తు కోసం సరోగేట్ అవుతోంది. పైగా వాళ్లు మనసుని ఇబ్బంది పెట్టుకుని చేస్తున్న పని కాదు. అన్ని విషయాల్లో చాలా స్పష్టమైన అవగాహనకు వచ్చాకనే సరోగేట్ అవ్వడానికి సిద్దపడుతున్నారు. ఇంతవరకూ ఏ ఒక్క సరోగేట్ కూడా మాకు ఫోన్ చేసి బిడ్డ వివరాలు అడగలేదంటే విషయం అర్థం చేసుకోండి. ఏదో ఒకరిద్దరు మాత్రం బిడ్డ క్షేమం అడిగారు. దానికి కారణం కూడా ఆ పిల్లలు కొద్దిగా బలహీనంగా పుట్టారు.
 
‘ఏమ్మా... బిడ్డపై బెంగ పెట్టుకున్నావా!’ అనడిగితే...‘లేదు సార్...బిడ్డ కోసం అన్ని లక్షలు ఖర్చుపెట్టారు. పాపం...ఆరోగ్యంగా లేకపోతే బాధపడతారు కదా!’ అని అందామె. వారు తీసుకున్న డబ్బులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలన్న వారి తపనకు ఇది నిదర్శంన. అనవసరమైన భావోద్వేగాలకు లోనవ్వడం ఇక్కడ న్యాయం కాదు. సొంతపిల్లలకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనుకుని వచ్చే సరోగేట్స్ ఎలాంటి పరిస్థితుల్లోను తన పొట్టలో పెరుగుతున్న పొరుగుబిడ్డపై ప్రేమను పెంచుకోలేరు. పెంచుకోకూడదు’’ అని కచ్చితంగా చెబుతున్నారు హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ ఇన్‌ఫెర్టిలిటి సెంటర్ వైద్యులు.
 
‘‘ఆపరేషన్ చేసేప్పుడు పొట్టను కత్తితో చీరాలి. ఆ సమయంలో డాక్టర్లు అయ్యో... రక్తం పోతుంది, బంగారంలాంటి పొట్టకు గాయమైపోయిందే...అంటూ తలపట్టుకోవడం ఎంత తప్పో, ఎదుటివారికోసం బిడ్డను మోసిపెడతానని మాటిచ్చి ఆ బిడ్డపై ప్రేమను పెంచుకోవడం కూడా అంతే తప్పు. మానసికంగా చిన్నపాటి సంఘర్షణ ఉన్నప్పటికీ దానిని అధిగమించడం సరోగేట్ పాటించాల్సిన మొదటి సూత్రం’’ అని మరొక ఇన్‌ఫెర్టిలిటి సెంటర్ వైద్యుల వాదన.
 
 నిజమే! రోజురోజుకీ పెరుగుతున్న సరోగేట్స్ సంఖ్యను చూస్తుంటే కడుపులో పెరుగుతున్న పొరుగుబిడ్డపై వారు పెద్దగా భావోద్వేగాలు పెంచుకోవడంలేదనే తెలుస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విశేషం ఏమిటంటే... ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాన సరోగేట్స్ సంఖ్య పెద్దగా పెరగడంలేదు. మన రాష్ట్రంలో మరీ తక్కువగా ఉంది. సరోగేట్ సౌకర్యం కల్పించే సెంటర్లు మాత్రం పదులసంఖ్యలో పెరిగిపోతున్నాయి.
 
 ఉత్తర భారతంలో...
 పదిహేనేళ్ల కిందట సరోగేట్ ద్వారా బిడ్డను పొందిన జపనీస్ దంపతులకు బిడ్డను అప్పగించకూడదంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అప్పటివరకూ ఎవరికీ సరోగేట్ పద్ధతి గురించి తెలియదు. ఈ కేసులో  సుప్రీం కోర్టు ఇచ్చిన  తీర్పు తర్వాత సరోగేట్ అంటే అక్రమ సంబంధం కాదని, కేవలం ప్రయోగశాల ప్రమేయంతో తయారయిన పిండాన్ని గర్భంలో పెట్టడమేనని...అందరికీ తెలిసింది. అప్పటివరకూ అదో దైవరహస్యంగా ఉండేది. మన దేశంలో మొదటిసారి గుజరాత్‌లో ‘ఆకాంక్ష ఇన్‌ఫెర్టిలిటి అండ్ ఐవిఎఫ్ క్లినిక్’ పేరుతో నయనా పటేల్ అనే డాక్టర్ సరోగసిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘బేబీ ఫ్యాక్టరీ’ పేరుతో విదేశీయులకు సరోగేట్ బిడ్డల్ని అందించడంలో బాగా పేరుగాంచారు. నయనాపటేల్ మాత్రం ఒక్కో సరోగేట్ తల్లికి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఒక్క గుజరాత్‌లో అనే కాదు...ఉత్తరాన చాలాప్రాంతాల్లోని మహిళలు సరోగేట్ అవ్వడానికి ముందుకొస్తున్నారు.
 
అయితే సరోగసిని కేవలం ఒక ఆదాయ మార్గంగా భావించే వారి ఆలోచనతీరే వారిని ప్రోత్సహిస్తోందన్నది వైద్యుల మాట. ‘‘వారితో పోలిస్తే దక్షిణాన మహిళలు సరోగేట్ అవడం పట్ల అంత సుముఖతగా లేనట్టే. రావడమే బోలెడన్ని అపోహలు, భయాలు, ఆందోళనలతో వస్తారు. మేం చెప్పిన అన్ని విషయాలు విన్నాక కాస్త సర్దుకుంటారు. సరోగేట్ అవ్వడానికి సిద్దపడ్డాక ఇక ఎలాంటి సమస్యను జోలికి రానివ్వరు. అదే ఉత్తరభారత దేశంలో అయితే నేరుగా వైద్యమే. కౌన్సెలింగ్‌లతో పెద్దగా పనిలేదు’’ అని చెప్పుకొచ్చారు మన రాష్ట్రానికి చెందిన ఓ ఇన్‌ఫెర్టిలిటి డాక్టర్. సరోగేట్ సేవ కాదు, అలాగని వ్యాపారం కాదు...‘డబ్బులేని వారికి డబ్బు ఇస్తున్నాం, బిడ్డలేని వారికి బిడ్డనిస్తున్నాం’ అని చెబుతున్న వైద్యల మాటలో మనకి తెలియని మరో విషయం ఉంది. రెండు లక్షల రూపాయల వల్ల ఓ బిడ్డ భూమ్మీదకు రాలేదు. పేద మహిళలకు సరోగసి వరమైతే, పిల్లలు పుట్టనివారికి సరోగేట్ దేవత.
 
 ఎలాంటి పరిస్థితుల్లో సరోగేట్ అవసరం?
* గర్భాశయం లేనివారికి(జన్యులోపం కారణంగా)
*   ఏదైనా కారణంగా గర్భాశయం తొలిగించబడ్డవారికి(క్యాన్సర్ వంటి జబ్బులకారణంగా)
*      జన్మతః గర్భాశయ నిర్మాణం లోపభూయిష్టంగా ఉండడం వల్ల
*     పదే పదే గర్భస్రావం అవుతున్నవారికి
*      టెస్ట్‌ట్యూబ్ బేబీ ఫెయిల్ అయినపుడు
*      గుండెజబ్బుతో బాధపడుతున్నవారికి
*      వెన్నెముక సంబంధిత సమస్యలున్నవారికి
 
 నిబంధనలు
 సరోగేట్ ద్వారా బిడ్డను పొందాలనుకునేవారికి, వైద్యులకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వారు సూచించిన మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి:
*      సరోగేట్ అవ్వాలనుకునేవారి వయసు 21 నుంచి 35 వరకూ ఉండాలి.
*      ముగ్గురు పిల్లలకన్నా ఎక్కువున్నవారు సరోగేట్‌కి అర్హులు కాదు.
*      పెళ్లయిన మహిళ అయితే తప్పనిసరిగా భర్త అంగీకారం తీసుకోవాలి.
*      భారతీయ మహిళ మాత్రమే మనదేశంలో సరోగసికీ అర్హురాలు
*      సరొగేట్ అయ్యే మహిళ ఆరోగ్యం అన్నివిధాలుగా బాగుండాలి. హెచ్‌ఐవి, మధుమేహం, రక్తపోటు, కిడ్నీ, హృద్రోగ సంబంధిత అనారోగ్యాలుంటే గనక సరోగసీకి అనర్హులు.
 - భువనేశ్వరి
 
ఇండియన్ సరోగేట్‌కే డిమాండు ఎక్కువ!
విదేశీయులు చాలామంది ఇండియన్ సరోగేట్‌నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ దేశస్థులు చాలావరకూ సరోగసి కోసం మనదేశం వస్తున్నారు. రెండే రెండు కారణాలు వారిని ఇక్కడికి రప్పిస్తున్నాయి. మొదటిది... ఖరీదు. అమెరికన్ సరోగేట్ ద్వారా బిడ్డను పొందాలంటే మన కరెన్సీలో దాదాపు 25 నుంచి 40 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఆసుపత్రి, వైద్యుల ఖర్చు పక్కన పెడితే ఒక్క సరోగేట్‌కే 8 నుంచి 14 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదే మన దేశంలో అయితే రెండు నుంచి నాలుగు లక్షల రూపాయలకే సరోగేట్ అందుబాటులో ఉంటుంది.
 
 అలాగే మొత్తం ఖర్చు కూడా 10 నుంచి 12 లక్షల లోపే ఉంటుంది. ఇక రెండవ కారణం: అమెరికా సరోగసి నియమాల ప్రకారం బిడ్డను పొందాలనుకునేవారికి సరోగేట్‌ని చూపించకూడదు. అదే భారతదేశంలో అయితే సరోగేట్‌ని కలవొచ్చు. పైగా మన దేశంలో సరోగేట్ అవసరం ఉందని చెప్పగానే కొన్నిరోజుల సమయంలోనే సిద్దం చేయగలరు. అదే అమెరికా, బ్రిటన్‌లో అయితే సరోగేట్ అందుబాటులోకి రావడానికి కనీసం ఆరు నుంచి ఏడాది సమయం పడుతుంది. వీటితో పాటు ఇక్కడ ఐవీఎఫ్ వైద్యం, అండ దాతలు కూడా చాలా చవక. ఇలాంటి రకరకాల కారణాల వల్ల విదేశీయులు ఇండియన్ సరోగసి విధానాన్ని ఉపయోగించుకోడానికి ముందుకొస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement