
సాక్షి, అమరావతి/కాకినాడ: సరోగసి(అద్దె గర్భం) ద్వారా తల్లి అయిన ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌కు మాతృత్వపు సెలవు మంజూరు చేయని పలువురు అధికారుల తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఆమెకు కూడా మాతృత్వపు సెలవు మంజూరు చేయాల్సిందేనని ఆదేశించింది. ఈ మాతృత్వపు సెలవు ఇదే వ్యాజ్యంలో తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య డైరెక్టర్, రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కాకినాడకు చెందిన ఉండమట్ల మురళీకృష్ణ ఆడిటర్‌గా పని చేస్తుండగా, ఆమె భార్య డాక్టర్ కిరణ్మయి రంగరాయ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కిరణ్మయి గత నెలలో సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లి అయ్యారు. మాతృత్వపు సెలవు కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు తిరస్కరించారు. దీంతో కిరణ్మయి గత నెల 24న హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ జయసూర్య అధికారుల తీరును ఆక్షేపించారు. విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment