బంగారు తల్లికి బెంగ
ఆడపిల్లంటే సమాజంలో ఇప్పటికీ చిన్నచూపే. నగరాలు, పట్టణాల్లో పరిస్థితి కొంత మారుతున్నా.. గ్రామాల్లో ఇప్పటికీ ఆడపిల్లను గుదిబండగా భావిస్తున్నారు. పెంచి, చదివించి, పెళ్లి చేయడం ఆర్థిక భారమన్న భావన తల్లిదండ్రుల్లో పాతుకుపోయింది. ఈ అపవాదును పోగొట్టి ఆడపిల్ల పెళ్లీడుకు వచ్చేనాటికి ఆర్థిక ఆలంబన కల్పించి.. ఆమెను బంగారు తల్లిగా మార్చేందుకు ఉద్దేశించిన బంగారు తల్లిపథకాన్ని కొత్త ప్రభుత్వం దాదాపు మూలన పడేసింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పథకం పేరు మార్చి కొనసాగిస్తామని ప్రకటించినా.. అదీ చేయకుండా.. ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయకుండా పథకాన్ని..దానిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను డోలాయమానంలో పడేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఈ పథకం స్థితిగతులపై ‘సాక్షి’ ప్రొగ్రెస్ రిపోర్ట్..
వీరఘట్టం, కోటబొమ్మాళి: బంగారు తల్లి పథకం కొనసాగుతుందా లేదా అన్న బెంగ పేద తల్లిదండ్రులను వేధిస్తోంది. పేదవర్గాలకు చెందిన ఆడపిల్లలు పెళ్లీడుకు వచ్చేనాటికి ఆర్థిక ఆసరా కల్పించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం 2013 మే ఒకటో తేదీన అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆస్పత్రిలో కాన్పు అయిన వెంటనే దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తించి తొలివిడతగా పాప పేరిట బ్యాంకు ఖాతాల్లో రూ.2500 జమ చేస్తారు. అక్కడి నుంచి ప్రతి ఏటా విడతల వారీగా నగదు జమ చేస్తూ 21 ఏళ్లు వచ్చేనాటికి గరిష్టంగా రూ.2.16 లక్షలు అందజేస్తారు. పథకం ప్రారంభమై ఈ ఏడాది మే ఒకటో తేదీకి ఏడాది గడిచిపోయినా లబ్ధిదారుల ఖాతాలకు రెండో ఏడాది జమ చేయాల్సిన సొమ్ము విడుదల చేయలేదు.
కొత్త దరఖాస్తుదారులనూ పట్టించుకోవడం లేదు. జిల్లాలోని 38 మండలాల్లో ఇప్పటివరకు 13,931 మంది ఈ పథకం కింద పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో 659 మందిని అనర్హులుగా గుర్తించారు. మిగిలిన వారిలో 6637 మంది ఖాతాలకు రూ.2500 చొప్పున జమ చేశారు. ఇందులోనూ 5688 మందికే సర్టిఫికెట్లు(బాండ్లు) అందాయి. మిగతావారు బాండ్ల కోసం ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మిగిలిన 6635 మంది దరఖాస్తుదారులకు పథకం మంజూరు నిలిచిపోయింది. మార్చి నుంచి నిధులు నిలిచిపోయాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పథకం పేరును మా ఇంటి మహాలక్ష్మిగా మార్చి కొనసాగిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఉ న్న లబ్ధిదారులకు 5 నెలలుగా నిధులు కూడా ఇవ్వలేదు. అధికారులను అడిగితే తమకు ఉత్తర్వు లు లేవంటున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ పథకం లక్ష్యం
ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించేం దుకు ఈ పథకాన్ని నిర్దేశించారు. ఆడపిల్ల పుట్టిన వెంటనే తగిన ధ్రువపత్రాలతో పేదవర్గాల వారు దరఖాస్తు చేసుకుంటే అర్హతలను గుర్తించి వెంటనే ఆ పాప పేరిట బ్యాంకు ఖాతాలో రూ.2500 జమ చేస్తారు. టీకాలు అన్నీ సక్రమంగా వేయిస్తే రెండో ఏడాది వెయ్యి రూపాయలు జమ చేస్తారు. ఆ తర్వాత చదువు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని విడతల వారీగా నగదు జమ చేస్తూ ఆడపిల్లకు 21 ఏళ్లు.. అంటే పెళ్లి వయసు వచ్చేనాటికి గరిష్టంగా రూ.2.16 లక్షలు ఆ కుటుంబానికి అందించాలన్నది లక్ష్యం.
అత్యధికంగా రణస్థలంలో..
పథకం మంజూరుకు దరఖాస్తు చేయడంలో రణస్థలం అగ్రస్థానంలో ఉంది. ఈ మండలం నుంచి 668 మంది దరఖాస్తు చేయగా.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా గార(637), ఎచ్చెర్ల(570), రేగిడి(559), లావేరు(538), కోటబొమ్మాళి(519), వీరఘట్టం(507) మండలాలు ఉన్నాయి.
రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం
తెల్లకార్డు కలిగిఉన్న పేదవర్గానికి చెందిన వారికి తొలి రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుడితే బంగారు తల్లి పథకం కింద లబ్ధి పొం దే అవకాశం ఉండటంతో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొద్ది నెలల క్రితం వరకు ప్రజలు ఆసక్తి చూపేవారు. అయితే అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకా న్ని పట్టించుకోకపోవడం.. కొన్ని నెలలుగా డబ్బులు కూడా జమ కాకపోవడంతో కొన్నాళ్లుగా రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి.
నిధులు విడుదల కాలేదు
ఎస్.తనూజారాణి, పీడీ, డీఆర్‌డీఏ
జిల్లా వ్యాప్తంగా బంగారుతల్లి పథకం కోసం అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాం. వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. అయితే పథకానికి ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. అందువల్ల ఇప్పటివరకు గుర్తించిన లబ్ధిదారులకు ఖాతాలకు సొమ్ము జమ చేయలేకపోతున్నాం. పథకం పేరును మా ఇంటి మహా లక్ష్మిగా మార్చుతున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వ నిర్ణ యం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
దరఖాస్తుకే బోలెడు తంతు
ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవడమే పెద్ద తంతు. ఆడపిల్ల పుట్టిన వెంటనే వైద్య సిబ్బంది ఇచ్చే కాన్పు ధ్రువపత్రం, ఆ తర్వాత జనన ధ్రువపత్రం తీసుకోవాలి. గ్రామైక్య సంఘం వద్ద మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాటితోపాటు తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, మరికొన్ని పత్రాలు జతచేసి ఐకేపీ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి రూ. 3 వేల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది.
ఆడపిల్ల పుడితే బంగారుతల్లి
పథకం ద్వారా డబ్బులు వస్తాయన్నారు. ఎంతో ఆశతో దరఖాస్తు చేశాం. తీరా 5 నెలల తర్వాత లిస్టులో నాపేరు లేదన్నారు. నాలుగు నెలలు క్రితం మళ్లీ దరఖాస్తు చేశాను. అయినా ఇంతవరకు బాండ్ రాలేదు.
-భోగాది భారతి, వీరఘట్టం
పాప పుట్టిన వెంటనే బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేశాను. కానీ ఇంతదాకా ఒక్క రూపాయి కూడా బ్యాంకులో జమకాలేదు. అధికారులను అడిగితే అదిగో వచ్చేస్తాది .. ఇదిగో వచ్చేస్తాది అంటున్నారు.
- కసింకోట సంతు, వీరఘట్టం
గత సంవత్సరంలో జూన్‌లో పాప పుట్టింది. బంగారుతల్లికి దరఖాస్తు చేస్తే వెంటనే బ్యాంక్ ఖాతాలో రూ.2500 పడుతుందని అధికారులు చెప్పారు. ఏడాదైనా పైసా రాలేదు
-మయిగాపు చంద్ర, వీరఘట్టం