బదిలీ కావాలంటే.. బేరం కుదరాలి! | Transfer | Sakshi
Sakshi News home page

బదిలీ కావాలంటే.. బేరం కుదరాలి!

Published Thu, Apr 23 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

Transfer

జిల్లాలో బదిలీల జాతర మొదలు కానుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మే 1 నుంచి 20 వరకూ నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దాదాపు ఖరారయింది. దీంతో ఉద్యోగులు ఆశించిన స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే పోస్టింగ్‌ల్లో ప్రాధాన్యత దక్కనుంది. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సు లేఖలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బదిలీ కావాలని వెళుతున్న వారికి ముందు బేరం కుదరాలిగా అనే మాటలు ఎదురవుతున్నాయి.
 
 సాక్షి ప్రతినిధి, అనంతపురం :  ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మే 1-20 వరకూ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయనుంది. ఈమేరకు ఆర్థికశాఖ రెండుమూడురోజుల్లో జీవో జారీచేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జిల్లా, జోనల్‌స్థాయి ఉద్యోగుల బదిలీలకు మాత్రమే ప్రభుత్వం అనుమతిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కేడర్ ఉద్యోగులను బదిలీ నుంచి మినహాయించనున్నారు. అలాగే మే 1కి ఉద్యోగంలో  చేరి రెండేళ్ల సర్వీసు పూర్తికాని వాళ్లకు మినహాయింపు ఇవ్వనున్నారు. ఐదేళ్లు పూర్తయినవారిని కచ్చితంగా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పనితీరు, దీర్ఘకాలం ఒకేచోట ఉన్నవారు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉండి వేర్వేరు చోట్ల ఉన్న వారికి బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రకేడర్ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నారు.
 
 ఎమ్మెల్యే లేఖలే పోస్టింగుకు కీలకం:
 ఆశించినచోట పోస్టింగు దక్కించుకునేందుకు అధికారపార్టీ నేతల ఆశీస్సులు తప్పనిసరి అని భావించిన అధికారులు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ‘మీరు చెప్పినట్లుగా నడుచుకుంటాను. నాకు లెటర్ ఇవ్వండిసార్!’ అంటూ ఇళ్లచుట్టూ తిరుగుతున్నారు. కొందరు అధికారులు నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు ఎంపీ లెటరు కూడా తీసుకుంటున్నారు. ఉరవకొండ, కదిరి నియోజకవర్గాల్లో మాత్రం ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన వారు కావడంతో మాజీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, కందికుంట ప్రసాద్‌లతో సిఫార్సు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు నాయకులు ఈ లేఖలు ఇప్పిచ్చేందుకు పోస్టును బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
  పదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడం, ఇసుక తవ్వకాలు మినహా తక్కిన వాటిలో ఆదాయం లేకపోవడంతో ప్రస్తుతం బదిలీ పర్వాన్ని ఉపయోగించుకోనున్నారు. వీలైనంత వరకూ ముడుపులు తీసుకుని పోస్టింగులు ఇప్పించేందుకు సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తహశీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌తో పాటు పలు కీలకశాఖలకు సంబంధించిన పోస్టులను తాము సిఫార్సు చేస్తూ లేఖలు ఇచ్చినవారికే ఇవ్వాలని కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులకు హుకూం జారీ చేసినట్లు తెలిసింది.
 
 అధికారులు కూడా అధికారపార్టీ చెప్పిన వారికే పోస్టింగులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లేదంటే తమ స్థానాలకు ఎక్కడ ముప్పువాటిల్లుతుందో అని జంకుతున్నారు.
 ఎంపీడీవోల నియామకంలో ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ సిఫార్సు తప్పనిసరి అవుతోంది. ఎమ్మెల్యే లేఖ ఇచ్చినా జెడ్పీచైర్‌పర్సన్ అభిప్రాయం కూడా ఉన్నతాధికారులు తెలుసుకుంటున్నారు. తమకు అనుకూలంగా వ్యవహరించని అధికారులను బదిలీ చేయాలని ఇప్పటికే పలువురు మండలస్థాయి నేతలు జెడ్పీ చైర్‌పర్సన్ చమన్ దృష్టికి తీసుకొచ్చారు. మే 1నుంచి బదిలీల ప్రక్రియ మొదలయ్యే పరిస్థితులు ఉండటంతో అధికారులు సెలవుల్లో వెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
 
 20రోజులు కాసుల పంట:
 టీడీపీలో ఎమ్మెల్యేల వద్ద సన్నిహితంగా ఉండే టీడీపీ కార్యకర్తలు అధికారులతో పోస్టింగుకు బేరం మాట్లాడుకుని ఎమ్మెల్యేలతో లెటర్లు ఇప్పించేందుకు బేరాలు మొదలెట్టారు. తమ సన్నిహితులకు ఫోన్ చేసి ‘ఎవరికైనా పోస్టింగు కావాలంటే చెప్పు..ఇప్పిస్తాం’ అని వీలైనన్ని బదిలీలు తమ పరిధిలోకి వచ్చేలా చూస్తున్నారు. మేలో వందల సంఖ్యలో బదిలీలు జరగనున్నాయి. దీంతో టీడీపీ నేతల జేబుల్లోకి అధికారుల సొమ్ము భారీగా చేరనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement