చేదెక్కనున్న చక్కెర..! | Sugarcane cultivation In Telangana Reduced Significantly | Sakshi
Sakshi News home page

చేదెక్కనున్న చక్కెర..!

Published Sun, Dec 29 2019 3:19 AM | Last Updated on Sun, Dec 29 2019 5:09 AM

Sugarcane cultivation In Telangana Reduced Significantly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడంతో చక్కెర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 2 వేల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం తగ్గగా, వచ్చే ఏడాది మరింత పడిపోయే అవకాశముందని కర్మాగారాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పదకొండు చక్కెర కర్మాగారాలకు గాను బోధన్‌లోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ 2008, ఎన్‌డీఎస్‌ఎల్‌ పరిధిలోని మరో మూడు చక్కెర కర్మాగారాలు 2016 నుంచి మూతపడ్డాయి. 

దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు చక్కెర కర్మాగారాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రతి ఏటా చెరకు క్రషింగ్‌ సీజన్‌ నవంబర్‌ రెండో వారంలో ప్రారంభం కావాల్సి ఉండగా, చెరకు కొరతతో క్రిష్ణవేణి చక్కెర కర్మాగారం మినహా, మిగతావన్నీ డిసెంబర్‌ మొదటి వారంలో క్రషింగ్‌ ప్రారంభించాయి. గత ఏడాది రాష్ట్రంలో సుమారు 29 వేల హెక్టార్లలో చెరకు సాగు చేయగా, ఈ ఏడాది 27 వేల హెక్టార్లకు సాగు విస్తీర్ణం పడిపోయింది. మంజీర నది పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గణపతి, గాయత్రి చక్కెర కర్మాగారాల పరిధిలో సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం చూపింది. 

మరోవైపు సాగునీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లోనూ రైతులు వరి, మొక్కజొన్న సాగువైపు మొగ్గుచూపుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత ప్లాంటేషన్‌ సీజన్‌లోనూ చెరుకు సాగు విస్తీర్ణం ఆశాజనకంగా లేదని చక్కెర శాఖ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే ఏడాది (2020–21) రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తి సగానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమల పూర్తిస్థాయి క్రషింగ్‌ సామర్ధ్యం 33 లక్షల నుంచి 36 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఈ ఏడాది 15లక్షల మెట్రిక్‌ టన్నులకు మించి క్రషింగ్‌ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. 

కష్టకాలంలో కర్మాగారాలు.. 
ఈ ఏడాది చెరుకు రైతులకు టన్నుకు సగటున రూ.3,080 చొప్పున మద్దతు ధర (ఎఫ్‌ఆర్‌పీ) చెల్లిస్తుండగా, పొరుగున ఉండే కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన చక్కెర కర్మాగారాలు అదనంగా టన్నుకు రూ.100 నుంచి రూ.150 వరకు చెల్లిస్తున్నాయి. స్థానికంగా క్రషింగ్‌ ఆలస్యంగా ప్రారంభం కావడం, పొరుగు రాష్ట్రాల్లో ఎక్కువ ధర లభిస్తుండటంతో రైతులు పొరుగు రాష్ట్రాలకు చెరుకు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు గత ఏడాది ఆల్కహాల్‌ తయారీకి సహకరించిన కర్మాగారాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేయాల్సి ఉంది. 

కాకతీయ, గణపతి చక్కెర కర్మాగారాల్లో కార్మికులు, యాజమాన్యం నడుమ నెలకొన్న వివాదాలు కూడా క్రషింగ్‌పై కొంత ప్రభావం చూపాయి. చెరుకు సాగుకు రైతులు మొగ్గు చూపకపోవడం, క్రషింగ్‌ సామరŠాధ్యనికి సరిపడా చెరుకు సరఫరా కాకపోవడంతో సీజన్‌ను కుదించాల్సిన పరిస్థితిలో యాజమాన్యాలు ఉన్నాయి. గత ఏడాది 24.83 లక్షల మెట్రిక్‌ టన్నుల చెరుకును క్రషింగ్‌ చేసి, 2.56 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి సాధించారు. 

ఈ ఏడాది రాష్ట్రంలోని ఏడు కర్మాగారాల పరిధిలో చక్కెర ఉత్పత్తి 1.6 లక్షల టన్నులకు మించక పోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కర్మాగారాల వద్ద కిలో చక్కెర ధర రూ.35 పలుకుతుండగా, బయట మార్కెట్‌ ధరలతో పోలిస్తే తమకు అంతగా లాభసాటిగా లేదని కర్మాగారాల ప్రతినిధులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరుకు సాగును ప్రోత్సహించని పక్షంలో రాబోయే రోజుల్లో చక్కెర కర్మాగారాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయనే ఆందోళన అటు కర్మాగారాలు, ఇటు చెరుకు రైతులు వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement