చక్కెర పరిశ్రమ నెత్తిన పాలు! | Sugar Industry Crisis in indian market | Sakshi
Sakshi News home page

చక్కెర పరిశ్రమ నెత్తిన పాలు!

Published Tue, Jul 8 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

చక్కెర పరిశ్రమ నెత్తిన పాలు!

చక్కెర పరిశ్రమ నెత్తిన పాలు!

సాధారణంగా పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించడంతోపాటు, బహిరంగ మార్కెట్లో ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు ‘ఉద్దీపన’ ప్యాకేజీలను ప్రకటిస్తూ  ఉంటాయి. కాని ప్రస్తుతం చక్కెర పరిశ్రమ విషయంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది.
 
చక్కెర పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కనుగొన్న మంత్రం పంచదార మిల్లుల యజమానులకు తీయగా ఉండొచ్చునేమోగానీ, అది వినియోగదారులకు మాత్రం కచ్చితంగా చేదు గుళికే. సుగర్ మిల్లులకు ‘ఉద్దీపన’ ప్యాకేజీ ప్రకటించిన మర్నాడే షేర్‌మార్కెట్లో చక్కెర కంపెనీల షేర్లు పది శాతం దాకా తారాజువ్వలా దూసుకుపోయాయి. అదేస్థాయిలో కొన్ని రోజుల్లోనే బహిరంగ మార్కెట్లో పంచదార ధర దాదాపు కిలోకు రెండు రూపాయల దాకా ప్రియమవుతుందంటే నరేంద్ర మోడీ సర్కార్ ఏ వర్గం కొమ్ముకాస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా పండగ సీజన్ వచ్చిందంటే చక్కెర రేటుకు రెక్కలు వస్తాయి. కాని దానికన్న కొన్ని నెలల ముందుగానే ప్రభుత్వమే ధర పెరిగేలా నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మామూలుగా పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించడంతోపాటు, బహిరంగ మార్కెట్లో ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు ‘ఉద్దీపన’ ప్యాకేజీలను ప్రకటిస్తూ  ఉంటాయి. కాని ప్రస్తుతం చక్కెర పరిశ్రమ విషయంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది.  పరిశ్రమ నెత్తిన పాలుపోసి, వినియోగదారులకు కాళ్లకింద మంటపెట్టినట్టయ్యింది! నిజానికి వినియోగదారులకు అన్ని రకాలుగా ఒకేసారి కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రభుత్వం ‘ఉద్దీపన’ ప్యాకేజీ ఇచ్చిందంటే అది ‘ఆమ్‌ఆద్మీ’ జేబులోంచి ఇవ్వాల్సిందే కదా. తర్వాత సొంత అవసరాలకు మార్కెట్లో చక్కెరను అధిక రేటుకు కొనుగోలు చేయాల్సి వస్తుంది!

 చక్కెరపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి 40 శాతానికి పెంచడం, సెప్టెంబర్‌వరకు వర్తించేలా ఎగుమతి సబ్సిడీని టన్నుకు రూ.3,300 చొప్పున కొనసాగించడం వంటి చర్యలు కచ్చితంగా మార్కెట్లోని ఇన్వెస్టర్లను సంతోషపెట్టాయి. అంతేగాదు చక్కెర మిల్లుల యజమానులకు అదనంగా రూ. 4,400 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను ఇవ్వడానికి కూడా కేంద్రం ముందుకు వచ్చింది. అంతకుముందు ఈ పద్ధతిలో రూ. 6,600 కోట్ల దాకా రుణాలు సమకూర్చింది. చెరుకు రైతులకు చెల్లించాల్సిన దాదాపు రూ.11,000 కోట్ల దాకా బకాయిలను చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే ప్యాకేజీ ఇస్తామని పాశ్వాన్ అంటున్నారు. కానీ సెప్టెంబర్‌లోగా రైతుల బకాయిలను తీర్చాల్సిందిగా మిల్లు యాజమాన్యాలను మంత్రి గట్టిగా ఎందుకు ఆదేశించలేకపోతున్నారో అర్థం కాదు.
 మన దేశంలో ఒక రైతు కుటుంబం నెలకు సగటు ఆదాయం రూ. 2,400 కన్నా తక్కువనే ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ పార్లమెంట్‌లో ప్రకటించింది. ఈ దేశానికి తిండిపెట్టే అన్నదాత పేదరికంలో మగ్గుతూ క్షుద్బాధతో అలమటించేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయంటే ఇంతకన్నా అవహేళన మరొకటి ఉంటుందా?

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్‌ఆర్‌ఈజీఏ) రోజు కూలీలుగా పనిచేసే వారిలో దాదాపు 60 శాతం మందిదాకా భూమి సొంతంగా ఉన్న రైతులే ఉన్నారంటే ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. మరో విషయం ఏమంటే.... దేశంలోని రైతుల్లో దాదాపు 58 శాతం మంది ఒక పూట పస్తులతో గడుపుతున్నారు. ఇక చెరుకు రైతుల పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. ఏదో ఒకటీ అరా పెద్ద రైతులను మినహాయిస్తే అనేకమంది సన్నకారు  రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఒక్క యూపీలోనే రైతుల బకాయిలు రూ. 7,900 కోట్ల మేరకు పేరుకుపోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

అధిక స్థాయిలో ఉన్న చెరుకు మద్దతు ధరల సమస్య పరిష్కారం కాకపోతే చక్కెర పరిశ్రమ నిలదొక్కుకోలేదని ఆర్థికవేత్తలు అంటున్నారు. చెరుకు ధరలను తగ్గించాలన్నదే వారు సూచించే పరిష్కార మార్గం. ఈ వాదనతో నేను ఏకీభవించను. రైతుల ప్రయోజనాల కోసమే చెరుకు ధరలను తగ్గించాలని వాదించేవారు అసలు మిల్లులకు ఎందుకు నష్టాలు వస్తున్నాయో, దాని వెనక నిజమైన కారణమేమిటో తెలివిగా దాటవేస్తున్నారు. మిల్లుల ఆధునీకరణకు యాజ మాన్యాలు ఎంతమాత్రం సిద్ధంగా లేవు. పచ్చి నిజం ఏమంటే... చక్కెర పరిశ్రమ యజమానుల అసమర్థ నిర్వాకానికీ అటు రైతులూ, ఇటు వినియోగదారులూ భారీగా మూల్యం చెల్లించుకోవల్సి వస్తోంది.    
 
(వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు)   దేవందర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement