పాత నిబంధన, కొత్త నిబంధనలు ఉన్న టెండర్ పేజీ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ సరఫరా చేసే గోధుమలను మర ఆడి, గోధుమ పిండి (ఆటా)గా తయారుచేసి తిరిగి కార్పొరేషన్‌కు సరఫరా చేసే కాంట్రాక్ట్ కేటాయింపులో గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. చినబాబు సన్నిహితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి రోలర్ ఫ్లోర్‌మిల్‌కు కాంట్రాక్ట్ దక్కే విధంగా నిబంధనలను చివరి నిమిషంలో అధికారులు మార్చారు. కేవలం ఒక రోలర్ ఫ్లోర్‌మిల్‌కే కాంట్రాక్ట్ దక్కే విధంగా నిబంధనలు మార్చడంపై ఇతర కాంట్రాక్టర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పాత నిబంధనలివే..
పౌరసరఫరాల సంస్థ ద్వారా ప్రతి నెలా 1839.970 మెట్రిక్ టన్నుల గోధుమలు తీసుకుని వాటిని ఆటాగా మార్చి తిరిగి ఒక కిలో ప్యాకెట్లుగా తయారుచేసి, వాటిని 50 కిలోల సంచుల్లో నింపి రాష్ట్రంలోని పౌరసరఫరాల గోదాములకు సరఫరా చేయడం కోసం ఈ– టెండర్లు పిలిచారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను ఒకటో జోన్‌గాను, చిత్తూరు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలను రెండో జోన్‌గానూ, కర్నూలు, అనంతపురం జిల్లాలను మూడో జోన్ కింద పెట్టారు. ఏ జోన్‌లో మిల్లర్లు ఆ జోన్‌లోనే టెండర్లు దాఖలు చేయాలి. టెండర్ల ప్రకారం రోజుకు 100 మెట్రిక్ టన్నుల గోధుమలు మరపట్టే సామర్థ్యం ఉండాలి.
ఏడాదికి రూ.10 కోట్ల టర్నోవర్ చేసి ఉండాలి. టెండర్‌ను సోమవారం (ఏప్రిల్ 23) సాయంత్రంలోగా దాఖలు చేయాలని, 24న టెండర్లు తెరిచి తక్కువ కొటేషన్ ఉన్నవారికి టెండర్లు ఇస్తామని పేర్కొన్నారు. అయితే సోమవారం సాయంత్రం టెండర్ నిబంధనలను మార్చుతూ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం గత ఆర్థిక ఏడాదిలో 3వేల మెట్రిక్ టన్నుల ఆటాను ప్రభుత్వ సంస్థకు సరఫరా చేసి ఉండాలనే కొత్త నిబంధన విధించారు. కొత్త నిబంధనలకు అనుకూలంగా టెండర్‌ను ఈ నెల 26 వరకు దాఖలు చేయొచ్చని, 27న టెండర్లు వేలం నిర్వహిస్తామని ప్రకటించారు.
చినబాబు సన్నిహితుడికి కట్టబెట్టేందుకే..
చినబాబు సహకారంతో చిత్తూరులోని జయరామ్ చౌదరికి చెందిన సుద్దలగుంట ఫ్లోర్‌మిల్ గతేడాది ఆటా సరఫరా చేసే కాంట్రాక్టును దక్కించుకుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రన్న కానుకతో సహా నెలవారీ ఇచ్చే ఆటా టెండర్లూ ఆ మిల్‌కే దక్కాయి. కొత్త నిబంధనల మేరకు ఈ ఏడాది కూడా అదే మిల్‌కు టెండర్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఈ టెండర్ విలువ రూ.35 కోట్ల వరకు ఉంటుందని, కనీసం 2 కోట్ల వరకు చేతులు మారే అవకాశం ఉందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం రాయలసీమనే కాకుండా రాష్ట్రమంతా ఈ మిల్‌కే వచ్చినా ఆశ్చర్యం లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. కాగా సుద్దలగుంట ఫ్లోర్‌మిల్‌పై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ మిల్ సరఫరా చేసే గోధుమపిండిలో నాణ్యత లేదనే విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment