సమస్యలపై గళం | Voice issues officers neglected | Sakshi
Sakshi News home page

సమస్యలపై గళం

Published Fri, Jan 9 2015 4:34 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

Voice issues officers neglected

 ముందు నుంచీ
 హెచ్చరిస్తూనే ఉన్నాం:
 అద్దంకి శాసనసభ్యుడు
 గొట్టిపాటి రవికుమార్
 గుండ్లకమ్మ ముంపు గ్రామాలకు సంబంధించి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోశయ్య హయాంలో దేవుడి మాన్యం భూముల్లో పట్టాలు ఇచ్చేందుకు అంగీకరించకపోయినా జీవో ఇప్పించాం. పట్టాలను అర్హులైన వారికి త్వరగా ఇవ్వాలని సూచించాం. కానీ అధికారులు జాప్యం చేస్తున్నారు. మొత్తం 48 మంది వద్దనుంచి 24 లక్షలు వసూలు చేసినట్లు పేర్లతో సైతం మా వద్దకు బాధితులు వచ్చారు. తక్షణమే ధేనువుకొండ ప్రాంత నిర్వాసితులకు  పట్టాలు పంపిణీ చేయాలి. అక్రమంగా డబ్బులు దండుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
 
 సామాజిక కార్యకర్తలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు:
 వై.పాలెం శాసనసభ్యుడు
 పాలపర్తి డేవిడ్‌రాజు
 ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాలను లబ్ధిదారులకు అందించేందుకు అన్ని జిల్లాలకంటే మన జిల్లాలోనే పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రూపొందించిన ప్రణాళిక బాగుంది. కానీ గ్రామ కమిటీల పేరుతో సామాజిక కార్యకర్తలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అధికారులను సైతం శాసిస్తున్నారు. దీనివల్ల సామాన్యమైన పేదవారికి లబ్ధి చేకూరకుండా పోతోంది. చెంచులు, సుగాలీలు నివాసం ఉండే ప్రాంతాలలోని వారికి వైద్య సహాయక చర్యలు అందించేందుకు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారా ఎంపీ నిధులను ఇప్పించాం. తక్షణమే అంబులెన్స్‌ను కొనుగోలుచేసి వారికి వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలి.
 
 మత్తు వైద్యుడు లేకపోతే ఎలా :
 కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు
 కందుకూరు ఏరియా వైద్యశాలలో పిల్లల వార్డును పూర్తిగా మూసేశారు. మరో వార్డుది ఇదే పరిస్థితి. ఉలవపాడులో అయితే ఏకంగా స్టోర్‌రూములో అడుగు మేర నీరు నిలిచిపోతోంది. దానికితోడు మత్తు ఇంజక్షన్ ఇచ్చే వైద్యుడు లేకపోతే ఎలా?ఇక వైద్యుల కొరత సరేసరి.
 
 నీటి పారుదలపై అంత నిర్లక్ష్యమా:
 సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్
 నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సీఈ, ఎస్‌ఈలందరూ ఇదే సమావేశంలో ఉన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి వారివద్ద సరైన సమాచారం లేదు. సర్వసభ్య సమావేశం నిర్వహించే ముందే యాక్షన్ టేకెన్ రిపోర్టుపై అరగంట చర్చ నిర్వహించాలి.
 
 మంత్రి ఉన్నా మాకు ఉపయోగమేంటి:  
 మారం వెంకటరెడ్డి, తాళ్ళూరు జెడ్పీటీసీ
 మా నియోజకవర్గానికి మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఓబీసీలో నీటి పరిమాణం తగ్గిపోయింది. చివరి భూములకు నీరందే పరిస్థితులు లేవు. మంత్రి నియోజకవర్గమైనా ఒరిగిందేముంది.
 పరిహారం ఇవ్వకుండా ఎన్నాళ్ళు : దుగ్గెంపూడి వెంకటరెడ్డి, పెద్దారవీడు జెడ్పీటీసీ
 ప్రాజెక్టుకు అవసరమని రైతుల నుంచి భూములు తీసేసుకున్నారు. కానీ రైతులకు మాత్రం డబ్బులు పంపిణీ చేయలేదు.  ఇప్పటికైనా రైతుల సమస్యపై స్పందించాలి.
 ఆస్పత్రికి వెళ్లాలంటేనే బాధగా ఉంది: కంచర్ల శ్రీకాంత్ చౌదరి, జెడ్పీటీసీ సభ్యుడు కందుకూరు
 కందుకూరు ఏరియా వైద్యశాలలో వైద్య పరీక్షలకు అవసరమైన సామగ్రి ఉండడంలేదు. ఎక్స్‌రేలకు బయటకు పంపించి రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
 
 నిధుల కొరత ఉంటే అధికారులెలా పనిచేస్తారు:
 పట్టభద్రుల శాసనమండలి సభ్యుడు యండపల్లి శ్రీనివాసరెడ్డి
 వెలుగొండ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు అవసరమంటే రూ.75 కోట్లు ఇస్తే అధికారులు మాత్రం ఎలా పనిచేయగలరు. సమష్టిగా ముందుకు వెళితేనే నిర్మాణం పూర్తి చేసుకోగలం.
 
 ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథక
 సమాచారమేదీ:
 పర్చూరు శాసనసభ్యుడు
 ఏలూరి సాంబశివరావు
 ఎన్టీర్ ఆరోగ్య సేవా పథక సమాచారమేదీ. దీనిపై విస్తృత ప్రచారం నిర్వహించాలి. పర్చూరు ఆసుపత్రిలో కనీసం నీరు కూడా లేదు. ఇక వైద్యులు ఆపరేషన్లు ఎలా నిర్వహిస్తారు. తక్షణమే అవసరమైన నిధులకోసం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.
 
 ప్రైవేటు భవనంలోకి ఆసుపత్రి మార్చుతారా?:
 గిద్దలూరు ఎమ్మెల్యే
 ముత్తుముల అశోక్‌రెడ్డి
 పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం, కంభం, వై.పాలెం, దోర్నాల తదితర ప్రాంతాల్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా రక్తం కోసం ఒంగోలు వరకు రావాల్సి వస్తోంది. అందుకే  కంభంలో రక్త నిల్వల కేంద్రం, గిద్దలూరులో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుపై ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చాను. గిద్దలూరు ఏరియా వైద్యశాలను 50 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రికి మార్చారు.  కూలిపోయే భవనంలో ఆస్పత్రిని నిర్మించడం ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయంగా సీమాంక్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు దృష్టి సారించాలి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి తెలియకుండా నిధులు డ్రా చేస్తే తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.
 
 పేద ప్రజల అభ్యున్నతికే ప్రభుత్వం కట్టుబడి ఉంది:
 కనిగిరి శాసనసభ్యుడు కదిరి బాబూరావు
 మా ప్రభుత్వం పేదల పక్షానే ఉంది. అట్టడుగు వర్గాలకు సైతం న్యాయం చేసేందుకే సామాజిక కార్యకర్తలను నియమించామే తప్ప  అడ్డుకోవడానికి కాదు. గతంలో ఇందిరమ్మ కమిటీలు వేసినపుడు ఈ ప్రశ్నలు ఏమయ్యాయి. గురవాజీపేట ఆస్పత్రిలో పేకాట ఆడుకుంటున్నారు. అధికారులు గమనించాలి.
 
 వెలిగొండను పూర్తిచేసేది
 మా ప్రభుత్వమే:
 ఒంగోలు ఎమ్మెల్యే
 దామచర్ల జనార్ధన్‌రావు
 వెలిగొండ ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.75 కోట్లు చూపినా వాస్తవానికి రూ.130 కోట్లు ఖర్చు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో ఏడాదిలోగా తొలిదశ పూర్తిచేసి నీళ్లిస్తాం. ఇందులో ఎటువంటి సందేహంలేదు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది  మా ప్రభుత్వమే. తిరిగి పూర్తిచేసి ప్రారంభించేది కూడా మా ప్రభుత్వమే. రాజకీయంగా మాట్లాడడం సరికాదు.
 
 సీఎం ప్రకటన అలా ఉంటే మీ
 ప్రకటన ఇలానా:
 మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి
  వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను పూర్తిచేసి ఏడాదిలోగా పంటలకు నీరందిస్తామని సీఎం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సీఈ మాత్రం 2016 డిసెంబర్ నాటికి లేదా 2017 నాటికి అంటున్నారు. ఏది వాస్తవం. ఖచ్చితంగా ఎప్పటిలోగా తొలిదశను పూర్తిచేస్తారో చెప్పండి. ఇది జిల్లా అభివృద్ధిలో కీలకమైన అంశం.  రాజకీయాలకు అతీతంగా అవసరమైన నిధులు సాధించుకునేందుకు జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన సీఎంను కలుద్దాం. ప్రజాప్రతినిధులందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా.
 
 సేవలు లేకుండా వైద్యులెందుకు:
 కొండపి శాసనసభ్యుడు డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి
 చాలా ఆసుపత్రుల్లో వైద్యులుంటున్నారు కానీ వైద్య సేవలందడం లేదు. ప్రధానంగా దంత వైద్యానికి సంబంధించిన పరికరాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement