Palaparti devidraju
-
సమస్యలపై గళం
ముందు నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాం: అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ గుండ్లకమ్మ ముంపు గ్రామాలకు సంబంధించి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోశయ్య హయాంలో దేవుడి మాన్యం భూముల్లో పట్టాలు ఇచ్చేందుకు అంగీకరించకపోయినా జీవో ఇప్పించాం. పట్టాలను అర్హులైన వారికి త్వరగా ఇవ్వాలని సూచించాం. కానీ అధికారులు జాప్యం చేస్తున్నారు. మొత్తం 48 మంది వద్దనుంచి 24 లక్షలు వసూలు చేసినట్లు పేర్లతో సైతం మా వద్దకు బాధితులు వచ్చారు. తక్షణమే ధేనువుకొండ ప్రాంత నిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేయాలి. అక్రమంగా డబ్బులు దండుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాజిక కార్యకర్తలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు: వై.పాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాలను లబ్ధిదారులకు అందించేందుకు అన్ని జిల్లాలకంటే మన జిల్లాలోనే పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రూపొందించిన ప్రణాళిక బాగుంది. కానీ గ్రామ కమిటీల పేరుతో సామాజిక కార్యకర్తలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అధికారులను సైతం శాసిస్తున్నారు. దీనివల్ల సామాన్యమైన పేదవారికి లబ్ధి చేకూరకుండా పోతోంది. చెంచులు, సుగాలీలు నివాసం ఉండే ప్రాంతాలలోని వారికి వైద్య సహాయక చర్యలు అందించేందుకు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారా ఎంపీ నిధులను ఇప్పించాం. తక్షణమే అంబులెన్స్‌ను కొనుగోలుచేసి వారికి వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలి. మత్తు వైద్యుడు లేకపోతే ఎలా : కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కందుకూరు ఏరియా వైద్యశాలలో పిల్లల వార్డును పూర్తిగా మూసేశారు. మరో వార్డుది ఇదే పరిస్థితి. ఉలవపాడులో అయితే ఏకంగా స్టోర్రూములో అడుగు మేర నీరు నిలిచిపోతోంది. దానికితోడు మత్తు ఇంజక్షన్ ఇచ్చే వైద్యుడు లేకపోతే ఎలా?ఇక వైద్యుల కొరత సరేసరి. నీటి పారుదలపై అంత నిర్లక్ష్యమా: సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సీఈ, ఎస్ఈలందరూ ఇదే సమావేశంలో ఉన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి వారివద్ద సరైన సమాచారం లేదు. సర్వసభ్య సమావేశం నిర్వహించే ముందే యాక్షన్ టేకెన్ రిపోర్టుపై అరగంట చర్చ నిర్వహించాలి. మంత్రి ఉన్నా మాకు ఉపయోగమేంటి: మారం వెంకటరెడ్డి, తాళ్ళూరు జెడ్పీటీసీ మా నియోజకవర్గానికి మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఓబీసీలో నీటి పరిమాణం తగ్గిపోయింది. చివరి భూములకు నీరందే పరిస్థితులు లేవు. మంత్రి నియోజకవర్గమైనా ఒరిగిందేముంది. పరిహారం ఇవ్వకుండా ఎన్నాళ్ళు : దుగ్గెంపూడి వెంకటరెడ్డి, పెద్దారవీడు జెడ్పీటీసీ ప్రాజెక్టుకు అవసరమని రైతుల నుంచి భూములు తీసేసుకున్నారు. కానీ రైతులకు మాత్రం డబ్బులు పంపిణీ చేయలేదు. ఇప్పటికైనా రైతుల సమస్యపై స్పందించాలి. ఆస్పత్రికి వెళ్లాలంటేనే బాధగా ఉంది: కంచర్ల శ్రీకాంత్ చౌదరి, జెడ్పీటీసీ సభ్యుడు కందుకూరు కందుకూరు ఏరియా వైద్యశాలలో వైద్య పరీక్షలకు అవసరమైన సామగ్రి ఉండడంలేదు. ఎక్స్‌రేలకు బయటకు పంపించి రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నిధుల కొరత ఉంటే అధికారులెలా పనిచేస్తారు: పట్టభద్రుల శాసనమండలి సభ్యుడు యండపల్లి శ్రీనివాసరెడ్డి వెలుగొండ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు అవసరమంటే రూ.75 కోట్లు ఇస్తే అధికారులు మాత్రం ఎలా పనిచేయగలరు. సమష్టిగా ముందుకు వెళితేనే నిర్మాణం పూర్తి చేసుకోగలం. ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథక సమాచారమేదీ: పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు ఎన్టీర్ ఆరోగ్య సేవా పథక సమాచారమేదీ. దీనిపై విస్తృత ప్రచారం నిర్వహించాలి. పర్చూరు ఆసుపత్రిలో కనీసం నీరు కూడా లేదు. ఇక వైద్యులు ఆపరేషన్లు ఎలా నిర్వహిస్తారు. తక్షణమే అవసరమైన నిధులకోసం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రైవేటు భవనంలోకి ఆసుపత్రి మార్చుతారా?: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం, కంభం, వై.పాలెం, దోర్నాల తదితర ప్రాంతాల్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా రక్తం కోసం ఒంగోలు వరకు రావాల్సి వస్తోంది. అందుకే కంభంలో రక్త నిల్వల కేంద్రం, గిద్దలూరులో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుపై ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చాను. గిద్దలూరు ఏరియా వైద్యశాలను 50 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రికి మార్చారు. కూలిపోయే భవనంలో ఆస్పత్రిని నిర్మించడం ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయంగా సీమాంక్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు దృష్టి సారించాలి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి తెలియకుండా నిధులు డ్రా చేస్తే తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. పేద ప్రజల అభ్యున్నతికే ప్రభుత్వం కట్టుబడి ఉంది: కనిగిరి శాసనసభ్యుడు కదిరి బాబూరావు మా ప్రభుత్వం పేదల పక్షానే ఉంది. అట్టడుగు వర్గాలకు సైతం న్యాయం చేసేందుకే సామాజిక కార్యకర్తలను నియమించామే తప్ప అడ్డుకోవడానికి కాదు. గతంలో ఇందిరమ్మ కమిటీలు వేసినపుడు ఈ ప్రశ్నలు ఏమయ్యాయి. గురవాజీపేట ఆస్పత్రిలో పేకాట ఆడుకుంటున్నారు. అధికారులు గమనించాలి. వెలిగొండను పూర్తిచేసేది మా ప్రభుత్వమే: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌రావు వెలిగొండ ప్రాజెక్టు కోసం బడ్జెట్లో రూ.75 కోట్లు చూపినా వాస్తవానికి రూ.130 కోట్లు ఖర్చు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో ఏడాదిలోగా తొలిదశ పూర్తిచేసి నీళ్లిస్తాం. ఇందులో ఎటువంటి సందేహంలేదు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది మా ప్రభుత్వమే. తిరిగి పూర్తిచేసి ప్రారంభించేది కూడా మా ప్రభుత్వమే. రాజకీయంగా మాట్లాడడం సరికాదు. సీఎం ప్రకటన అలా ఉంటే మీ ప్రకటన ఇలానా: మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను పూర్తిచేసి ఏడాదిలోగా పంటలకు నీరందిస్తామని సీఎం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సీఈ మాత్రం 2016 డిసెంబర్ నాటికి లేదా 2017 నాటికి అంటున్నారు. ఏది వాస్తవం. ఖచ్చితంగా ఎప్పటిలోగా తొలిదశను పూర్తిచేస్తారో చెప్పండి. ఇది జిల్లా అభివృద్ధిలో కీలకమైన అంశం. రాజకీయాలకు అతీతంగా అవసరమైన నిధులు సాధించుకునేందుకు జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన సీఎంను కలుద్దాం. ప్రజాప్రతినిధులందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా. సేవలు లేకుండా వైద్యులెందుకు: కొండపి శాసనసభ్యుడు డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి చాలా ఆసుపత్రుల్లో వైద్యులుంటున్నారు కానీ వైద్య సేవలందడం లేదు. ప్రధానంగా దంత వైద్యానికి సంబంధించిన పరికరాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. -
వైఎస్సార్ సీపీకి వీహెచ్పీఎస్ మద్దతు
యర్రగొండపాలెం టౌన్, న్యూస్‌లైన్: వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) మద్దతు ఇస్తున్నట్లు వీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి గుమ్మా రాజయ్య ప్రకటించారు. వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు నివాస గృహంలో ఆయన్ను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి గుమ్మా రాజయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో పది వేల మంది వికలాంగులుండగా, అందులో 6 వేల మంది ఓటర్లున్నట్లు తెలిపారు. తామంతా రానున్న అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తరువాత వికలాంగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని డేవిడ్‌రాజును కోరారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లను * 200 నుంచి *500కు పెంచారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఐదు హామీలు ప్రకటించారన్నారు. వికలాంగుల పెన్షన్‌ను 500 నుంచి 1000 కు పెంచనున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి హామీలపై తమకు విశ్వాసం ఉందని అన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజుకు తమ సమస్యలు వివరించి, పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా డేవిడ్‌రాజు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన వెంటనే ఐదు హామీల్లో భాగంగా పెన్షన్లు పెంచుతూ సంతకం చేస్తారన్నారు. అనంతరం వీహెచ్పీఎస్ నాయకులకు వైఎస్సార్ సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ నాయకులు షేక్ అబ్దుల్లా, పాటిబండ్ల ప్రసాద్, తెప్పల వెంకటేశ్వర్లు, డీ పిచ్చయ్య, షేక్ అల్లాబక్ష్, షేక్ దిల్షాద్, షేక్ మహ్మద్ రఫీ, షేక్ మహబూబ్‌బాష, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కోటా వెంకటరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మూడమంచు బాలగురవయ్య, వేగినాటి శ్రీనివాస్, జెడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు మూడావత్ మంత్రూనాయక్, సీహెచ్ చేదూరి విజయభాస్కర్, పట్టణ యువజన విభాగం కన్వీనర్ వనిపెంట రామిరెడ్డి, బొమ్మాజి బాలచెన్నయ్య, కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, గోవిందరెడ్డి, పీ మాబూఖాన్ తదితరులు పాల్గొన్నారు.