యర్రగొండపాలెం టౌన్, న్యూస్‌లైన్: వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్) మద్దతు ఇస్తున్నట్లు వీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి గుమ్మా రాజయ్య ప్రకటించారు. వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు నివాస గృహంలో ఆయన్ను కలిసి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా వీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి గుమ్మా రాజయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో పది వేల మంది వికలాంగులుండగా, అందులో 6 వేల మంది ఓటర్లున్నట్లు తెలిపారు. తామంతా రానున్న అన్ని ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తరువాత వికలాంగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని డేవిడ్‌రాజును కోరారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లను * 200 నుంచి *500కు పెంచారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఐదు హామీలు ప్రకటించారన్నారు.
వికలాంగుల పెన్షన్‌ను 500 నుంచి 1000 కు పెంచనున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి హామీలపై తమకు విశ్వాసం ఉందని అన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజుకు తమ సమస్యలు వివరించి, పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా డేవిడ్‌రాజు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన వెంటనే ఐదు హామీల్లో భాగంగా పెన్షన్లు పెంచుతూ సంతకం చేస్తారన్నారు.
అనంతరం వీహెచ్‌పీఎస్ నాయకులకు వైఎస్సార్ సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ నాయకులు షేక్ అబ్దుల్లా, పాటిబండ్ల ప్రసాద్, తెప్పల వెంకటేశ్వర్లు, డీ పిచ్చయ్య, షేక్ అల్లాబక్ష్, షేక్ దిల్‌షాద్, షేక్ మహ్మద్ రఫీ, షేక్ మహబూబ్‌బాష, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కోటా వెంకటరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మూడమంచు బాలగురవయ్య, వేగినాటి శ్రీనివాస్, జెడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు మూడావత్ మంత్రూనాయక్, సీహెచ్ చేదూరి విజయభాస్కర్, పట్టణ యువజన విభాగం కన్వీనర్ వనిపెంట రామిరెడ్డి, బొమ్మాజి బాలచెన్నయ్య, కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, గోవిందరెడ్డి, పీ మాబూఖాన్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీకి వీహెచ్‌పీఎస్ మద్దతు
Published Sun, Mar 30 2014 3:41 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement