బైఠాయించిన మహిళా ఎంపీటీసీలు
మహిళలంటే వివక్ష ... ‘ఆ... ఏం చేస్తారు...ఏమి అడుగుతారులే ... మనం ఏదంటే అదే అనే ధీమా’. ఆ అధికార అహంకారమే గత నాలుగేళ్లుగా నిర్లక్ష్యం చేసింది. ప్రజా ప్రతినిధులైన ఈ మహిళామణులు వినతులతో విజ్ఞప్తులు చేశారు. అవస్థలు...అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను వివరించారు. సంబంధిత మండల టీడీపీ ప్రజా ప్రతినిధులు పెడ చెవిన పెట్టారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ... జన్మభూమి కమిటీల కన్నెర్రతోపాటు కలంపోటులకు భయపడి చూసీ చూడనట్టు వ్యవహరించడంతో కొంగు నడుంకు చుట్టి పిడికిలి బిగించారు. సోమవారం తహసీల్దారు కార్యాలయంలో జరిగిన ప్రజావాణిని వేదికగా చేసుకొని బైఠాయించారు. తాము ‘అబలలం కాదు సబలలం’ అని నినదించారు.
గోకవరం (జగ్గంపేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీలమైన తమపై అధికారులు వివక్ష చూపుతున్నారని, పింఛన్లు కేటాయించకుండా చులకనగా చూస్తున్నారని మహిళా ఎంపీటీసీలు నిరసన తెలిపారు. గోకవరంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమాన్ని మండల పరిషత్ ప్రతిపక్షనేత వరసాల కుమారి, గోకవరం–2 ఎంపీటీసీ కారం నాగమణిలు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రజావాణి జరుగుతున్న ప్రదేశంలో బైఠాయించి నిరసన తెలిపారు. దళిత, గిరిజన ఎంపీటీసీలమైన తమ వార్డులకు పింఛన్లు కేటాయించకుండా, రేషన్‌కార్డులు మంజూరు చేయకుండా వివక్షకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలకే పింఛన్లు పంపిణీ చేసే అధికారం కట్టబెట్టడంతో తమ వార్డులకు చెందిన అర్హులకు పింఛన్లు అందించకుండా వారికిష్టమైన వారికి అందిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రాంతంలో కనీసం వీధిరోడ్లు వేయడంలేదని, ఇళ్ల స్థలాలు, ఇంటి రుణాలు మంజూరు చేయడం లేదని వాపోయారు. ఈ చర్యల ద్వారా తమను అవమానపరుస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న గోకవరం ఎస్సైలు జి.ఉమామహేశ్వరరావు, ఎ.తిరుమలరావులు సిబ్బందితో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జగ్గంపేట కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ అక్కడకు చేరుకుని వారికి మద్దతుగా నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ కేవలం తమ పార్టీకి చెందిన దళిత, గిరిజన ఎంపీటీసీలను లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎం.వెంకటరమణారావు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ అధికారం తనకు లేదన్నారు. జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన వారికే పింఛన్లు అందిస్తున్నామన్నారు. దీనిపై మహిళా ఎంపీటీసీలు, కో ఆర్డినేటర్, ఇతర నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రాంతంలో అర్హులైన వారికి పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేసే వరకూ ఆందోళన విరమించేదిలేదని భీష్మించారు.
దీనిపై ఎంపీడీఓ స్పందిస్తూ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తహసీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ అర్హులకు రేషన్‌కార్డుల మంజూరుకు కృషి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ముత్యం నాని, ఎంపీటీసీ నల్లల వెంకన్నబాబు, నాయకులు కర్రి సూరారెడ్డి, దాసరి ధర్మరాజు, గౌడు లక్ష్మీ, మంగరౌతు శ్రీను, బిజ్జి రాజు, మచ్చా జయలక్ష్మి, తేలు ఈశ్వరి, ఏనుగుపల్లి సుబ్బలక్ష్మి, ఉంగరాల ఆదివిష్ణు, దాకారపు ధర్మరాజు, మైపాల పాండు, ఆండ్రు నాగేంద్రుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment