నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు
తహసీల్దారు ఎదుట స్పష్టం చేసిన గండవరం ఎంపీటీసీ
కొడవలూరు: తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని కొడవలూరు మండలం గండవరం ఎంపీటీసీ సభ్యుడు ఎందోటి శ్రీనివాసులు తహసీల్దారు రామకృష్ణ ఎదుట సోమవారం రాత పూర్వకంగా తెలియజేశారు. గండవరం ఎంపీటీసీ సభ్యుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎంపీటీసీ సభ్యుడే స్వతహాగా సోమవారం ఉదయం తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు.
ఆ తరువాత నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు ఇక్కడికి చేరుకున్నారు. వారి సమక్షంలోనే ఎంపీటీసీ సభ్యుడు తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తానే స్వతహాగా వ్యక్తిగత అవసరాలపై గత కొద్దిరోజులుగా గ్రామంలో లేకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్‌లో తెలపాలని కోరారు.
పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనందున తాను స్టేట్‌మెంట్ తీసుకోకూడదంటూ తహసీల్దారు దాటవేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జోక్యం చేసుకుని మండల మేజిస్ట్రేట్‌గా ప్రజలు కోరితే తీసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని, ఒక వేళ తీసుకునేందుకు వీలులేని పక్షంలో ఆ విషయాన్ని రాత పూర్వకంగా తెలియజేయాలని తహసీల్దారును కోరుతూ కోట మండలంలో జరిగిన ఇదే ఉదంతాన్ని గుర్తు చేశారు. అనంతరం నెల్లూరు ఆర్డీఓతో ఫోన్‌లో మాట్లాడిన తహసీల్దారు ఎంపీటీసీ సభ్యుని నుంచి రాత పూర్వక స్టేట్‌మెంట్ తీసుకున్నారు.
తానే స్వతహాగా సొంత పనులపై వెళ్లానే తప్ప ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆ విషయాన్ని స్టేషన్ ఎస్‌ఐకి దృష్టికి తీసుకుపోవాలని అందులో ఎంపీటీసీ సభ్యుడు కోరారు. ఆ స్టేట్ మెంట్ కాపీని తహసీల్దారు ధ్రువీకరించాక ఎస్‌ఐ దృష్టికి తీసుకెళ్లారు. వారి వెంట వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, నాయకుడు రూప్‌కుమార్ యాదవ్ తదితరులున్నారు.