Assembly and Parliament elections
-
ప్రలోభాలపై ఈసీ డేగ కన్ను
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రలోభాలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) డేగ కన్ను వేసింది. సంక్షేమ పథకాల పేరుతో ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న పోస్టు డేటెడ్ చెక్కులపై ఆరా తీస్తోంది. సరిగ్గా ఎన్నికల ముందు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే విధంగా జారీ చేసిన చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించడా నికి సునీల్ అరోరా రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఓటును తొలగించాలంటూ ప్రజలు దరఖాస్తు చేయకపోయినా ఇష్టారాజ్యంగా వారి ఓటును తొలగిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తున్నప్పుడు లబ్ధిదారులతో కొందరు వ్యక్తులు ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకుంటున్నామని అన్నారు. సునీల్ అరోరా ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో తప్పులపై వివిధ రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తాం. బోగస్ ఓట్లు, దొంగ ఓట్లపై ఫిర్యాదులు అందుతున్నాయి. రెండు మూడు రోజుల్లోనే మచ్చుకు కొన్ని ఓట్లపై ఆడిట్ చేస్తాం. చాలామంది యువ ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు కాలేదని ఫిర్యాదులు వచ్చాయి. నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకూ కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొంతమంది సర్వేల పేరిట, కులాల పేరిట ఓట్లు తొలగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సూచించాం. కొత్త ఓటర్ల నమోదు కోసం నియమించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఓటర్ నమోదు పాస్వర్డ్ ఇస్తున్నాం. ఇది దుర్వినియోగం అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్లా ఓటర్లుగా ఉన్నవారిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. బదిలీలు, పదోన్నతులపై ఫిర్యాదులు ఎన్నికల ముందు బదిలీలు, ప్రమోషన్లపై.. ముఖ్యంగా పోలీసు శాఖపై చాలా ఫిర్యాదులు అందాయి. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేని బదిలీలు, పదోన్నతులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుత రాష్ట్ర డీజీపీ అధికార పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నారంటూ దీనికి ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం కేసును ఉదాహరణగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు ఎన్ఐఏ పరిధిలో ఉంది. ఇవికాకుండా డీజీపీపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఏమైనా వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడితే ఎంతటి ఉన్నతాధికారి అయినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తాం.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై(ఈవీఎం) అనుమానాలు వ్యక్తం చేయడం అర్థరహితం. 2014 తర్వాత ఎన్నికలు జరిగిన పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కాకుండా వేరే పార్టీలు గెలిచాయి. ఈవీఎంల్లో అవకతవకలు లేవనడానికి ఇదే నిదర్శనం. వచ్చే ఎన్నికలను ఈవీఎంలతోనే నిర్వహిస్తాం. రాష్ట్రంలో తొలిసారిగా శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలను వీవీ ప్యాట్లతో నిర్వహించబోతున్నాం. వచ్చే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టడానికి ఆదాయపు పన్ను(ఐటీ), వాణిజ్య శాఖలతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాం. గత ఎన్నికల్లో కేసులు నమోదైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను ఆదేశించాం. పత్రికల్లో వచ్చే చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిన బదిలీలకు ఫిబ్రవరి 20వ తేదీ వరకు గడువు ఇస్తున్నాం. ఫిర్యాదులపై వంద నిమిషాల్లో చర్యలు గతంలో జరిగిన కర్ణాటకతోపాటు ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగించడం వల్ల సత్ఫలితాలు వచ్చాయి. సి–విజిల్ యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఈ ఫిర్యాదులపై వంద నిమిషాల్లో చర్యలు తీసుకుంటాం. వచ్చిన ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరించడానికి సమాధాన్ యాప్.. నామినేషన్లు, అనుమతులు, ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలను తెలుసుకోవడానికి న్యూసువిధ యాప్‌ను తీసుకొచ్చాం. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, యాప్‌లపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తాం’’ అని సీఈసీ సునీల్ అరోరా వెల్లడించారు. ఈ సమావేశంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా, సుదీప్ జైన్, ఎన్నికల కమిషనర్ అశోక్ లావాస్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తదితరులు పాల్గొన్నారు. -
అభ్యర్థుల పరువుకు పరీక్ష నోటా
త్వరలో జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో నోటా బటన్ వినియోగం నిస్సందేహంగా అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలదని చెప్పవచ్చు. నోటా వినియోగంపై సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పించవలసిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏ అభ్యర్థీ నచ్చనపుడు ‘నన్ ఫర్ ది ఎబౌ’(నోటా) సౌలభ్యాన్ని వినియోగించుకునే అవకాశాన్ని పొందడం భారతీయ ఓటర్ల హక్కులలో ఒక మలుపు. తాజాగా ఈ హక్కుకు మన రాష్ర్ట హైకోర్టు ఇంకొంచెం తీక్షణతను పెంచింది. నోటాకు కూడా ఒక గుర్తును కేటాయించవలసిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడి, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. వీలైతే ఈ ఎన్నికలలో లేదా వచ్చే ఎన్నికలకైనా ఇలాంటి గుర్తును కేటాయించవలసిందని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల సారాంశం. మన ప్రజాస్వామ్యం ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు. కానీ రాను రాను రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టడం తీవ్రం కావడంతో సంస్కరణలు అవసరమవుతున్నాయి. కొన్ని పార్టీలు సృష్టిస్తున్న ఈ కాలుష్యం వల్లనే విద్యావంతులు, మేధావులు ఎన్నికలకు దూరమయ్యారు. నగరాలలో ఇటీవలి వరకు జరిగిన ఎన్నికలలో పోలింగ్ శాతాన్ని గమనిస్తే ఈ అంశం అర్థమవుతుంది. ఈ వైముఖ్యం ప్రమాదకరం. అదీకాక బ్యాలెట్-బులెట్ ఆలోచన ప్రభావంతో హింస, అశాంతి నేటికీ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులలో ప్రజాస్వామిక వ్యవస్థకు ప్రాణప్రదమైన ఓటింగ్‌ను తిరస్కరించడం కంటె, అభ్యర్థికి అర్హత లేదని ఓటరు భావించినట్లయితే, ఓటింగ్‌లో పాల్గొని అసమ్మతి వ్యక్తం చేయటానికి ‘నోటా’ బటన్(నన్ ఆఫ్ ది ఎబౌ) ప్రవేశించింది. గడచిన సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు ఆదేశానుసారం ఈ అవకాశం లభించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం బ్యాలెట్ యూనిట్లో 16 మంది పేర్లకే అవకాశం ఉన్నప్పటికీ ఆఖరున నోటా బటన్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ అవకాశం 16వ లోక్‌సభ ఎన్నికల నుంచి పూర్తి స్థాయిలో ఆరంభమవుతోంది. ఇంతకుముందు ఏ పార్టీకీ, ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేని వారు ఎన్నికల అధికారి ముందు బాహాటంగా దరఖాస్తు ఇవ్వవలసి రావడంతో, రహస్య ఓటు హక్కు నీరుగారేది. నోటాతో అది తప్పుతుంది. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’(పీయూసీఎల్), సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై, ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివమ్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ, ఓటర్లకు తమ మీద ఉన్న అభిప్రాయం ఎలా ఉన్నదో పార్టీలకూ, అభ్యర్థులకూ ప్రతికూల ఓటింగ్ వల్ల తెలిసే అవకాశం కలుగుతుందని వ్యాఖ్యానించింది. ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, బంగ్లాదేశ్, యునెటైడ్ స్టేట్స్, ఫిన్లాండ్, స్వీడన్, కొలంబియా, స్పెయిన్ వంటి దేశాలలో తటస్థంగా ఉండే, అభ్యంతరం తెలిపే, వ్యతిరేకత వ్యక్తం చేసే ప్రక్రియ ఉంది. కానీ, భారత ఎన్నికల కమిషన్ ఈ విషయం గురించిన ప్రచారానికి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. 2013లో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలోనే ఓటర్లకు నోటా వినియోగించే అవకాశం తొలిసారి లభించింది. నక్సల్ ప్రభావిత బస్తర్, సర్గూజా, రాయపూర్, కనార్థా, ఖైరఘర్, ఖల్లారి, డోంగార్గన్ నియోజకవర్గాలలో గెలిచిన, ఓడిన అభ్యర్థుల మధ్య పోలయిన ఓట్ల తేడా కంటె, అధికంగా నోటాకు ఓట్లు పడ్డాయి. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 46వేల మంది ఓటర్లు నోటాను వినియోగించారు. మధ్యప్రదేశ్‌లో పాన్మిమల్ ఎస్టీ నియోజకవర్గంలో 9,228, మెహగాన్లో 136, ఛత్తీస్‌గఢ్, బస్తర్‌లోని చిత్రకోట్‌లో భారీగా 10,848 నోటా ఓట్లు నమోదైనాయి. దేశ రాజధానిలో ఆప్ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అభ్యర్థి షీలా దీక్షిత్‌లు పోటీ పడిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో కూడా 460 మంది నోటా నొక్కారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికలలో ఓటింగ్ యంత్రాలలో నోటా బటన్ సౌకర్యం లేకపోవడంతో తిరస్కృతి తెలిపే అవకాశం ఓటర్లకు లభించలేదు. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో నోటా బటన్ వినియోగం నిస్సందేహంగా అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలదని చెప్పవచ్చు. నోటా వినియోగం పట్ల సామాన్య ప్రజానీకానికి కూడా అవగాహన కల్పించవలసిందిగా సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో పోలింగ్‌ను తిరస్కరించడానికి బదులు, పోటీ చేసే అభ్యర్థులను తిరస్కరించే సౌలభ్యం కల్పిస్తున్న నోటా ఏర్పాటు గొప్ప ముందడుగు. సామాన్య ప్రజలలో, విద్యావంతులలో కొంతమేరకైనా నిరాశా నిస్పృహలను, అనాసక్తిని పోగొట్టే ఆయుధంగా నోటాను భావించవచ్చు. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) -
వైఎస్సార్ సీపీకి వీహెచ్పీఎస్ మద్దతు
యర్రగొండపాలెం టౌన్, న్యూస్‌లైన్: వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) మద్దతు ఇస్తున్నట్లు వీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి గుమ్మా రాజయ్య ప్రకటించారు. వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు నివాస గృహంలో ఆయన్ను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి గుమ్మా రాజయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో పది వేల మంది వికలాంగులుండగా, అందులో 6 వేల మంది ఓటర్లున్నట్లు తెలిపారు. తామంతా రానున్న అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తరువాత వికలాంగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని డేవిడ్‌రాజును కోరారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లను * 200 నుంచి *500కు పెంచారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఐదు హామీలు ప్రకటించారన్నారు. వికలాంగుల పెన్షన్‌ను 500 నుంచి 1000 కు పెంచనున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి హామీలపై తమకు విశ్వాసం ఉందని అన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజుకు తమ సమస్యలు వివరించి, పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా డేవిడ్‌రాజు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన వెంటనే ఐదు హామీల్లో భాగంగా పెన్షన్లు పెంచుతూ సంతకం చేస్తారన్నారు. అనంతరం వీహెచ్పీఎస్ నాయకులకు వైఎస్సార్ సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ నాయకులు షేక్ అబ్దుల్లా, పాటిబండ్ల ప్రసాద్, తెప్పల వెంకటేశ్వర్లు, డీ పిచ్చయ్య, షేక్ అల్లాబక్ష్, షేక్ దిల్షాద్, షేక్ మహ్మద్ రఫీ, షేక్ మహబూబ్‌బాష, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కోటా వెంకటరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మూడమంచు బాలగురవయ్య, వేగినాటి శ్రీనివాస్, జెడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు మూడావత్ మంత్రూనాయక్, సీహెచ్ చేదూరి విజయభాస్కర్, పట్టణ యువజన విభాగం కన్వీనర్ వనిపెంట రామిరెడ్డి, బొమ్మాజి బాలచెన్నయ్య, కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, గోవిందరెడ్డి, పీ మాబూఖాన్ తదితరులు పాల్గొన్నారు.