అభ్యర్థుల పరువుకు పరీక్ష నోటా
త్వరలో జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో నోటా బటన్ వినియోగం నిస్సందేహంగా అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలదని చెప్పవచ్చు. నోటా వినియోగంపై సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పించవలసిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఏ అభ్యర్థీ నచ్చనపుడు ‘నన్ ఫర్ ది ఎబౌ’(నోటా) సౌలభ్యాన్ని వినియోగించుకునే అవకాశాన్ని పొందడం భారతీయ ఓటర్ల హక్కులలో ఒక మలుపు. తాజాగా ఈ హక్కుకు మన రాష్ర్ట హైకోర్టు ఇంకొంచెం తీక్షణతను పెంచింది. నోటాకు కూడా ఒక గుర్తును కేటాయించవలసిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడి, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. వీలైతే ఈ ఎన్నికలలో లేదా వచ్చే ఎన్నికలకైనా ఇలాంటి గుర్తును కేటాయించవలసిందని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల సారాంశం.
మన ప్రజాస్వామ్యం ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు. కానీ రాను రాను రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టడం తీవ్రం కావడంతో సంస్కరణలు అవసరమవుతున్నాయి. కొన్ని పార్టీలు సృష్టిస్తున్న ఈ కాలుష్యం వల్లనే విద్యావంతులు, మేధావులు ఎన్నికలకు దూరమయ్యారు. నగరాలలో ఇటీవలి వరకు జరిగిన ఎన్నికలలో పోలింగ్ శాతాన్ని గమనిస్తే ఈ అంశం అర్థమవుతుంది. ఈ వైముఖ్యం ప్రమాదకరం. అదీకాక బ్యాలెట్-బులెట్ ఆలోచన ప్రభావంతో హింస, అశాంతి నేటికీ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులలో ప్రజాస్వామిక వ్యవస్థకు ప్రాణప్రదమైన ఓటింగ్‌ను తిరస్కరించడం కంటె, అభ్యర్థికి అర్హత లేదని ఓటరు భావించినట్లయితే, ఓటింగ్‌లో పాల్గొని అసమ్మతి వ్యక్తం చేయటానికి ‘నోటా’ బటన్(నన్ ఆఫ్ ది ఎబౌ) ప్రవేశించింది. గడచిన సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు ఆదేశానుసారం ఈ అవకాశం లభించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం బ్యాలెట్ యూనిట్‌లో 16 మంది పేర్లకే అవకాశం ఉన్నప్పటికీ ఆఖరున నోటా బటన్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ అవకాశం 16వ లోక్‌సభ ఎన్నికల నుంచి పూర్తి స్థాయిలో ఆరంభమవుతోంది. ఇంతకుముందు ఏ పార్టీకీ, ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేని వారు ఎన్నికల అధికారి ముందు బాహాటంగా దరఖాస్తు ఇవ్వవలసి రావడంతో, రహస్య ఓటు హక్కు నీరుగారేది. నోటాతో అది తప్పుతుంది.
‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’(పీయూసీఎల్), సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై, ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివమ్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ, ఓటర్లకు తమ మీద ఉన్న అభిప్రాయం ఎలా ఉన్నదో పార్టీలకూ, అభ్యర్థులకూ ప్రతికూల ఓటింగ్ వల్ల తెలిసే అవకాశం కలుగుతుందని వ్యాఖ్యానించింది. ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, బంగ్లాదేశ్, యునెటైడ్ స్టేట్స్, ఫిన్లాండ్, స్వీడన్, కొలంబియా, స్పెయిన్ వంటి దేశాలలో తటస్థంగా ఉండే, అభ్యంతరం తెలిపే, వ్యతిరేకత వ్యక్తం చేసే ప్రక్రియ ఉంది. కానీ, భారత ఎన్నికల కమిషన్ ఈ విషయం గురించిన ప్రచారానికి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు.
2013లో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలోనే ఓటర్లకు నోటా వినియోగించే అవకాశం తొలిసారి లభించింది. నక్సల్ ప్రభావిత బస్తర్, సర్గూజా, రాయపూర్, కనార్థా, ఖైరఘర్, ఖల్లారి, డోంగార్‌గన్ నియోజకవర్గాలలో గెలిచిన, ఓడిన అభ్యర్థుల మధ్య పోలయిన ఓట్ల తేడా కంటె, అధికంగా నోటాకు ఓట్లు పడ్డాయి. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 46వేల మంది ఓటర్లు నోటాను వినియోగించారు. మధ్యప్రదేశ్‌లో పాన్మిమల్ ఎస్టీ నియోజకవర్గంలో 9,228, మెహగాన్‌లో 136, ఛత్తీస్‌గఢ్, బస్తర్‌లోని చిత్రకోట్‌లో భారీగా 10,848 నోటా ఓట్లు నమోదైనాయి. దేశ రాజధానిలో ఆప్ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అభ్యర్థి షీలా దీక్షిత్‌లు పోటీ పడిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో కూడా 460 మంది నోటా నొక్కారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికలలో ఓటింగ్ యంత్రాలలో నోటా బటన్ సౌకర్యం లేకపోవడంతో తిరస్కృతి తెలిపే అవకాశం ఓటర్లకు లభించలేదు.
రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో నోటా బటన్ వినియోగం నిస్సందేహంగా అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలదని చెప్పవచ్చు. నోటా వినియోగం పట్ల సామాన్య ప్రజానీకానికి కూడా అవగాహన కల్పించవలసిందిగా సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో పోలింగ్‌ను తిరస్కరించడానికి బదులు, పోటీ చేసే అభ్యర్థులను తిరస్కరించే సౌలభ్యం కల్పిస్తున్న నోటా ఏర్పాటు గొప్ప ముందడుగు. సామాన్య ప్రజలలో, విద్యావంతులలో కొంతమేరకైనా నిరాశా నిస్పృహలను, అనాసక్తిని పోగొట్టే ఆయుధంగా నోటాను భావించవచ్చు.
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)