Nota button
-
NOTA: నోటా.. కోరల్లేని పులి!
దశాబ్దం క్రితం దేశ ఎన్నికల్లో వినూత్న ప్రయోగానికి తెరలేచింది. పోటీలో ఉన్న అభ్యర్థులు, పార్టీల్లో ఎవరూ నచ్చకపోతే ఏం చేయాలనే ఓటర్ల సందిగ్దతకు తెరదించుతూ ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)లో ప్రత్యామ్నాయం లభించింది. అదే ‘నోటా’. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని చెప్పే బటన్. అయితే దీన్ని ఎంచుకుంటున్న ఓటర్ల సంఖ్య అంతంతే ఉంటోంది. అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా నోటాకు వేసే ఓట్లతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఇది కోరల్లేని పులిగా మారిందనేది విశ్లేషకుల వాదన. ఇండోర్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుని షాకివ్వడం, దాంతో నోటాకే ఓటేయాలని పార్టీ పిలుపునివ్వడం తెలిసిందే. దాంతో నోటా మరోసారి చర్చల్లోకి వచి్చంది... ప్రయోజనం.. ప్చ్! పారీ్టలు ఎన్నికల్లో నేరచరితులు, కళంకితులైన అభ్యర్థులను నిలబెట్టకుండా చూడటమే లక్ష్యంగా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబరీ్టస్ (పీయూసీఎల్) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. పోటీలో ఉన్నవారెవరూ ఓటర్లకు నచ్చని పక్షంలో తాము ఎవరికీ ఓటువేయాలనుకోవడం లేదని చెప్పేందుకు బ్యాలెట్ పేపర్లు/ఈవీఎంలలో తగిన ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ 2013 సెపె్టంబర్లో కోర్టు తీర్పు వెలువరించింది. అలా ఈవీఎంలలోకి నోటా బటన్ వచ్చి చేరింది. ఈవీఎం బ్యాలెట్ యూనిట్‌లోని 16 బటన్లలో చివరి ఆప్షన్‌గా నోటా ఉంటుంది. దీనికి కూడా ప్రత్యేకంగా ఇంటూ (గీ) మార్కు కూడా కేటాయించారు. 2013లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నోటా గుర్తును తొలిసారి ప్రవేశపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దీనికి మరింత ప్రాచుర్యం లభించింది. గత ఐదేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో కలిపి నోటాకు 1.29 కోట్ల ఓట్లొచ్చాయి. అయినా కళంకితులకు టికెట్లిచ్చే విషయంలో పారీ్టల తీరులో మార్పేమీ రాలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరచరితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం నోటాకు ఎక్కువ ఓట్లు పడుతుండటం విశేషం!ఆ పవర్ ఇస్తేనే...ప్రస్తుత నిబంధనల ప్రకారం నోటాకు అభ్యర్థులందరి కంటే ఎక్కువ ఓట్లొచి్చనా ఎన్నికపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. ఆ ఓట్లన్నింటినీ పక్కనపెట్టి అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు వచి్చన వారే విజేత అవుతారు. అలా నోటా కేవలం అభ్యర్థులపై ఓటర్లు అసమ్మతిని వ్యక్తం చేసే ఆప్షన్‌గా మిగిలిపోతోంది. అలాగాక నోటాకే ఎక్కువ ఓట్లు పోౖలైతే తిరస్కరణకు గురైన అభ్యర్థులు మళ్లీ పోటీ చేయకుండా నిషేధించాలి. అప్పుడే పారీ్టలు నేరచరితులను పక్కన పెడతాయి’’ అని యాక్సిస్ ఇండియా చైర్మన్ ప్రదీప్ గుప్తా అభిప్రాయపడ్డారు. నోటాకు నిర్దిష్ట శాతానికి మించి ఓట్లు పోలైతే అభ్యర్థులను మార్చడం, మళ్లీ ఎన్నిక నిర్వహించడం వంటి మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. 👉 ఏడీఆర్ డేటా ప్రకారం ఎన్నికల్లో నోటాకు 0.5 శాతం నుంచి 1.5 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. 👉 2019 లోక్‌సభ ఎన్నికల్లో నోటాకు ఏకంగా 1.06 శాతం ఓట్లు రావడం విశేషం! 👉 లోక్‌సభ ఎన్నికల చరిత్రలో నోటాకు లక్షద్వీప్‌లో అతి తక్కువగా 100 ఓట్లే పడ్డాయి. 👉 బిహార్‌లోని గోపాల్‌గంజ్ ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో నోటాకు అత్యధికంగా 51,660 ఓట్లు వచ్చాయి. 👉 2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా నోటాకు 1.98 శాతం ఓట్లు దక్కాయి. 👉 మహారాష్ట్రలోని లాతూర్ రూరల్ అసెంబ్లీ స్థానంలో నోటాకు అత్యధికంగా 27,500 ఓట్లు పడ్డాయి. మొత్తం ఓట్లలో ఇవి ఏకంగా 13 తం! అక్కడ 67 శాతం ఓట్లతో గెలిచిన ధీరజ్ దేశ్‌ముఖ్ తర్వాత నోటాకే రెండో స్థానం దక్కడం విశేషం. 👉 ఇటీవలి ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో నోటా మూడో స్థానంలో నిలిచింది! 👉 మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాల్లో గెలిచిన అభ్యర్థి సాధించిన మెజారిటీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి! 👉 క్రిమినల్ కేసులున్న ముగ్గురికి మించి అభ్యర్థులు పోటీ చేసే రెడ్ అలర్ట్ నియోజకవర్గాల్లో 2018 నుంచి నోటాకు 27.77 లక్షల ఓట్లు పోలయ్యాయి. -
పంచాయతీ నగారా
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ ఎన్నికల పోలింగ్‌ను మూడు విడతలుగా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. జనవరి 21న తొలి విడత, 25న రెండో విడత, 30న మూడో విడత పోలింగ్ జరుగుతుందన్నారు. తొలి విడత ఎన్ని కల ప్రక్రియ జనవరి 7న ప్రారంభమై 21తో ముగుస్తుందని, రెండో విడత 11న ప్రారంభమై 25తో, మూడో విడత 16న ప్రారంభమై 30తో ముగుస్తుందని వివరించారు. కరీంనగర్ జిల్లాలో 313 గ్రామ పంచాయతీలు.. 2,966 వార్డుల్లో ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా మొత్తం 3985 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికలకు సిద్ధంగా అధికార యంత్రాంగం... గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు మొదలు పోలింగ్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేసింది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పర్యవేక్షణలో పది రోజులుగా కసరత్తు చేసిన పంచాయతీ, రెవెన్యూ అధికారులు 313 గ్రామ పంచాయతీలు, 2,966 వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. 3,985 పోలింగ్ బాక్సులను ఇప్పటికీ సిద్ధం చేయగా, మరో 500 బాక్సుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 9,09,800 బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని గుర్తించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు 4,404 మంది ప్రిసైడింగ్ అధికారులు, అదనపు పోలింగ్ ఆఫీసర్లను నియమించనున్నారు. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ విధుల కోసం రూట్, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ తదితర కేడర్లతో పాటు 10 శాతం అదనంగా కలుపుకుని 4,600 మందిని ఎంపిక చేసి, ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. నామినేషన్ ఫీజు, ఖర్చుల వివరాలు... సర్పంచ్‌లుగా పోటీ చేసిన అభ్యర్థులు (జనరల్) రూ.2000, రిజర్వుడు కేటగిరీ రూ.1000, వార్డు మెంబర్ (జనరల్) రూ.500, రిజర్వుడు రూ.250 చొప్పున ధరావతుగా చెల్లించాల్సి ఉంటుంది. 5వేల జనాభా దాటిన పంచాయతీలైతే అభ్యర్థులు రూ.2,50,000 మించి ఖర్చు చేయరాదు. 5వేలకంటే తక్కువ జనాభా కలిగిన గ్రామ పంచాయతీలైతే అభ్యర్థుల ఖర్చును రూ.1,50,000గా నిర్ణయించారు. పరిమితికి మించి ఖర్చుచేస్తే పదవి కోల్పోవాల్సి వస్తుందని ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి హెచ్చరించారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లలో భాగంగా మహిళలకు 156 మందికి సర్పంచ్‌గా, 1,639 మందికి వార్డు సభ్యులుగా అవకాశం కలగనుంది. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తు ఉంటుందని నాగిరెడ్డి వెల్లడించారు. నేటి నుంచి ఎన్నికల కోడ్... ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తి మాత్రమే ఓటు వేయటానికి అర్హుడు. ఎనిమిది రకాల గుర్తింపు కార్డుల ద్వారా ఓటును వినియోగించుకోవచ్చు. ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు మైక్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. ఎన్నికల కోడ్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం కొత్త పథకాలు, అధికారిక పర్యటనలు చేయటానికి వీల్లేదు. కాగా బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థి పేరు ఉండదు. సర్పంచ్, వార్డు సభ్యులకు వేర్వేరుగా బ్యాలెట్ పేపర్లు తెలుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి. -
నోరుకొడితే ‘నోటా’నే!
ప్రస్తుత ఎన్నికల్లో ‘నన్ ఆఫ్ ది అబౌ(నోటా)’ ఆప్షన్‌కు పెరిగిన ప్రజాదరణకు ఇదో ఉదాహరణ. ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఎలాంటి నోటీసు ఇవ్వకుండా.. ప్రత్యామ్నాయ పునరావాసం చూపించకుండా అకస్మాత్తుగా తమ గుడిసెలను కూల్చేసి.. వీధుల పాలు చేసినందుకు కోల్‌కతాలోని తప్సియా ప్రాంత మురికి వాడల ప్రజలు ఈ ఎన్నికల్లో నోటాతో నిరసన తెలపాలనుకుంటున్నారు. 2012 నవంబర్లోనే వారిని అక్కడినుంచి పంపించేసినా.. ఆ పాత అడ్రస్‌తోనే వారికి ఎన్నికల గుర్తింపు కార్డులున్నాయి. తప్సియా స్లమ్స్‌లో దాదాపు 300కు పైగా కుటుంబాలుండేవి. ఇళ్లను కూల్చేసే సమయంలో వారికి నామమాత్రంగా పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. అప్పటినుంచి వారంతా రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్నారు. నేతలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని, అందుకే తామంతా ఈసారి ఎవరికీ ఓటేయకుండా ‘నోటా’ మీట నొక్కుతామని చెబుతున్నారు. -
అభ్యర్థుల పరువుకు పరీక్ష నోటా
త్వరలో జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో నోటా బటన్ వినియోగం నిస్సందేహంగా అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలదని చెప్పవచ్చు. నోటా వినియోగంపై సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పించవలసిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏ అభ్యర్థీ నచ్చనపుడు ‘నన్ ఫర్ ది ఎబౌ’(నోటా) సౌలభ్యాన్ని వినియోగించుకునే అవకాశాన్ని పొందడం భారతీయ ఓటర్ల హక్కులలో ఒక మలుపు. తాజాగా ఈ హక్కుకు మన రాష్ర్ట హైకోర్టు ఇంకొంచెం తీక్షణతను పెంచింది. నోటాకు కూడా ఒక గుర్తును కేటాయించవలసిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడి, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. వీలైతే ఈ ఎన్నికలలో లేదా వచ్చే ఎన్నికలకైనా ఇలాంటి గుర్తును కేటాయించవలసిందని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల సారాంశం. మన ప్రజాస్వామ్యం ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు. కానీ రాను రాను రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టడం తీవ్రం కావడంతో సంస్కరణలు అవసరమవుతున్నాయి. కొన్ని పార్టీలు సృష్టిస్తున్న ఈ కాలుష్యం వల్లనే విద్యావంతులు, మేధావులు ఎన్నికలకు దూరమయ్యారు. నగరాలలో ఇటీవలి వరకు జరిగిన ఎన్నికలలో పోలింగ్ శాతాన్ని గమనిస్తే ఈ అంశం అర్థమవుతుంది. ఈ వైముఖ్యం ప్రమాదకరం. అదీకాక బ్యాలెట్-బులెట్ ఆలోచన ప్రభావంతో హింస, అశాంతి నేటికీ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులలో ప్రజాస్వామిక వ్యవస్థకు ప్రాణప్రదమైన ఓటింగ్‌ను తిరస్కరించడం కంటె, అభ్యర్థికి అర్హత లేదని ఓటరు భావించినట్లయితే, ఓటింగ్‌లో పాల్గొని అసమ్మతి వ్యక్తం చేయటానికి ‘నోటా’ బటన్(నన్ ఆఫ్ ది ఎబౌ) ప్రవేశించింది. గడచిన సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు ఆదేశానుసారం ఈ అవకాశం లభించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం బ్యాలెట్ యూనిట్లో 16 మంది పేర్లకే అవకాశం ఉన్నప్పటికీ ఆఖరున నోటా బటన్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ అవకాశం 16వ లోక్‌సభ ఎన్నికల నుంచి పూర్తి స్థాయిలో ఆరంభమవుతోంది. ఇంతకుముందు ఏ పార్టీకీ, ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేని వారు ఎన్నికల అధికారి ముందు బాహాటంగా దరఖాస్తు ఇవ్వవలసి రావడంతో, రహస్య ఓటు హక్కు నీరుగారేది. నోటాతో అది తప్పుతుంది. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’(పీయూసీఎల్), సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై, ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివమ్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ, ఓటర్లకు తమ మీద ఉన్న అభిప్రాయం ఎలా ఉన్నదో పార్టీలకూ, అభ్యర్థులకూ ప్రతికూల ఓటింగ్ వల్ల తెలిసే అవకాశం కలుగుతుందని వ్యాఖ్యానించింది. ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, బంగ్లాదేశ్, యునెటైడ్ స్టేట్స్, ఫిన్లాండ్, స్వీడన్, కొలంబియా, స్పెయిన్ వంటి దేశాలలో తటస్థంగా ఉండే, అభ్యంతరం తెలిపే, వ్యతిరేకత వ్యక్తం చేసే ప్రక్రియ ఉంది. కానీ, భారత ఎన్నికల కమిషన్ ఈ విషయం గురించిన ప్రచారానికి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. 2013లో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలోనే ఓటర్లకు నోటా వినియోగించే అవకాశం తొలిసారి లభించింది. నక్సల్ ప్రభావిత బస్తర్, సర్గూజా, రాయపూర్, కనార్థా, ఖైరఘర్, ఖల్లారి, డోంగార్గన్ నియోజకవర్గాలలో గెలిచిన, ఓడిన అభ్యర్థుల మధ్య పోలయిన ఓట్ల తేడా కంటె, అధికంగా నోటాకు ఓట్లు పడ్డాయి. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 46వేల మంది ఓటర్లు నోటాను వినియోగించారు. మధ్యప్రదేశ్‌లో పాన్మిమల్ ఎస్టీ నియోజకవర్గంలో 9,228, మెహగాన్లో 136, ఛత్తీస్‌గఢ్, బస్తర్‌లోని చిత్రకోట్‌లో భారీగా 10,848 నోటా ఓట్లు నమోదైనాయి. దేశ రాజధానిలో ఆప్ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అభ్యర్థి షీలా దీక్షిత్‌లు పోటీ పడిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో కూడా 460 మంది నోటా నొక్కారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికలలో ఓటింగ్ యంత్రాలలో నోటా బటన్ సౌకర్యం లేకపోవడంతో తిరస్కృతి తెలిపే అవకాశం ఓటర్లకు లభించలేదు. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో నోటా బటన్ వినియోగం నిస్సందేహంగా అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలదని చెప్పవచ్చు. నోటా వినియోగం పట్ల సామాన్య ప్రజానీకానికి కూడా అవగాహన కల్పించవలసిందిగా సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో పోలింగ్‌ను తిరస్కరించడానికి బదులు, పోటీ చేసే అభ్యర్థులను తిరస్కరించే సౌలభ్యం కల్పిస్తున్న నోటా ఏర్పాటు గొప్ప ముందడుగు. సామాన్య ప్రజలలో, విద్యావంతులలో కొంతమేరకైనా నిరాశా నిస్పృహలను, అనాసక్తిని పోగొట్టే ఆయుధంగా నోటాను భావించవచ్చు. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) -
సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధం
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 3,310 పోలింగ్ కేంద్రాలుండగా, 7 వేల కంట్రోల్ యూనిట్లు, 8,200 బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన వీటిని వారం రోజుల క్రితం బెంగళూ రు నుంచి తెప్పించారు. ప్రస్తుతం స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని గోదాములో వీటిని భద్రపరిచారు. ఒక్కో బ్యాలెట్ యూనిట్లో గరిష్టంగా 16 మంది దాకా అభ్యర్థులకు చోటు కల్పించనున్నారు. ఇంకా అభ్యర్థులున్నట్లయితే మరో బ్యాలెట్ యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తొలిసారిగా నోటా బటన్ మే 7న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా నోటా (నన్ ఆఫ్ అబౌ) బటన్ ఆప్షన్ వినియోగించేలా ఎన్నికల కమిషన్ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. పాత ఈవీఎంలలో ఓటు (నోటా)తిరస్కరణ బటన్ ఉండేది కాదు. ప్రస్తుతం ఈ ఏడాది నుంచి ఈవీఎంలలో కొత్తగా నో టా బటన్ ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులందరి పేర్ల తర్వాత చివరలో నోటా బటన్ ఉంటుంది. ఓట్ కన్ఫర్మేషన్ మెథడ్ మనం వేసే ఓటు ఎవరికి పడిందనేది తెలుసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం ఈ పర్యాయం కల్పించింది. ఈవీఎంలో ఓటు వేసిన తరువాత ఆ ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవాలంటే పోలింగ్ అధికారిని సంప్రదించాలి. పోలింగ్ అధికారి ఈవీఎంలో ఓటు కన్ఫర్మేషన్ బటన్‌ను నొక్కుతారు. అప్పుడు ఈవీఎం స్క్రీన్ ముందు పది సెకన్ల పాటు ఓటరు నిల్చోవాలి. ఈవీఎం స్క్రీన్‌లో ఓటు ఎవరికి పడిందనేది డిస్ప్లే అవుతుంది. అప్పటికీ ఓటరుకు నమ్మకం కుదరకపోతే అందుకు సంబంధించిన స్లిప్ కావాలని కూడా అడగవచ్చు. ఇందుకు సంబంధించిన స్లిప్‌ను పోలింగ్ అధికారి తీసి ఓటరుకు చూపిస్తారు. కానీ ఆ స్లిప్‌ను బయటకు ఇవ్వరు. ఆ స్లిప్‌ను ఈవీఎంకు పక్కనే ఉంచిన సీల్డ్ పెట్టెలో వేస్తారు. దీన్నే ఓట్ కన్ఫర్మేషన్ పద్ధతి అంటారు. ఈ విధానాన్ని మన జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఎన్నికల సంఘం చేపట్టనుండడం గమనార్హం. ఈవీఎంలపై అధికారులకు అవగాహన కల్పించిన కలెక్టర్ బెంగళూరు నుంచి కొత్తగా తెప్పించిన ఈవీఎంలపై కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులకు అవగాహన కల్పించారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, డీఆర్వో హేమసాగర్, రిటర్నింగ్ అధికారులతో కలిసి స్థానిక ఈవీఎం గోదాములో ఈవీఎంలను పరిశీలించారు. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లను ఎలా వినియోగించాలనే విధానంపై కూలంకుషంగా వివరించారు. -
నచ్చకపోతే ‘నోటా’ నొక్కండి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మీకు నచ్చలేదా.. మీరు మీ ఓటును ఎవరికీ వేయకుండా తిరస్కరించాలనుకుంటున్నారా.. గతంలో కాకున్నా ఇప్పుడు అది సాధ్యమే.. వచ్చే సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికల నిర్వహణలో పలు మార్పులు తీసుకువచ్చింది. నిర్వహణతోపాటు ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)మిషన్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన మార్పులు తీసుకురానుంది. ఈవీఎం మిషన్‌లో ‘నోటా’ అనే బటాన్ అమర్చనుంది. మీకు ఓటు వేయాలని ఉండి పోలింగ్ బూత్‌కు వెళ్లిన తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే ఈవీఎంలో గల ‘నోటా’ బటన్నోక్కితే చాలు.. మీ తిరస్కరణ ఓటు అందులో నమోదు అవుతుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ సారి ఓటింగ్ యంత్రాలను సరికొత్త పద్ధతిలో రూపొందించింది. ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని ఈ నోటా బటాన్ నొక్కితే చాలు మీకు అబ్యర్థులెవరూ నచ్చలేదని తెలిసిపోతుంది. ఒటరకు ఈ నోటా ఒక వజ్రాయుధంగా మారనుంది. ముఖ్యంగా గతంలో కంటే ఈ ఏడు 18 సంవత్సరాలు నిండిన యువతలో చాలా మార్పు వచ్చింది. ఓటు హక్కును వజ్రాయుధంలా మార్చుకొని సమాజంలో అన్యాయన్ని కూకటి వేళ్లతో పెకిలిద్దామనే సంకేతాలు యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓటుద్వారా సమసమాజ నిర్మాణం కోసం యువత ఎదురు చూస్తోంది. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ‘నోటా’ బటన్ తీసుకురావడంపట్ల యువత ఆనందంగా ఉంది. గతంలో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లామంటే అభ్యర్థి నచ్చినా.. నచ్చకున్నా ఎవరికో ఒకరికి ఓటు వేసి వచ్చేవాళ్లు. ఈసారి నోటా రావడంతో యువతకు ఎన్నికలపై ఆసక్తి ఏమేరకు ఉందో తెలియనుంది. ఓటింగ్ యంత్రాల్లో కొత్తగా వస్తున్న ఈ తిరస్కరణాస్త్రంను ఎంత మంది ఉపయోగిస్తారో కూడా నోటా ద్వారా తేలనుంది. ఈవీఎం గోదాం ప్రారంభం.. నిజామాబాద్ మండలం పాంగ్రా గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నం 443లో నిర్మిస్తున్న ఈవీయం మిషన్ల గొదాం ప్రారంభానికి సిద్ధమయ్యింది. గతంలో ఈవీఎం, బ్యాలెట్ బాక్సులను నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్‌లోని ఓ హల్లో ఉంచేవారు. వాటికి సెక్యురిటీ సరిగా లేకపొవడంతో గతంలో ఈవీఎం హాల్షెట్టర్ ను గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టారు. దీంతో జిల్లా యంత్రాంగం మండలంలోని ప్రభుత్వ భూమిలో ఈవీఎం గొదాం కోసం అప్పటి కలెక్టర్ క్రిస్టినా చోంగ్తూ 1200 గజాల భూమికి ప్రతిపాదనలు సిద్ధం చేసి గోదాం నిర్మాణం కోసం ఈసీ అనుమతి కోసం కోరారు. కలెక్టర్ కోరిక మేరకు ఈవీఎం, ఎలక్షన్ సామగ్రి కోసం సొంత గోదాం ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈసీ కూడా గోదాం నిర్మాణానికి రూ. 98లక్షలు మంజూరు చేసింది. దీంతో అధికారులు పనులు ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో గొదాంను త్వరగా పూర్తి చేశారు. గోదాం ప్రారంభం అయితే దాదాపు జిల్లాలోని 2వేలకు పైగా ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాల్లోనే ఈవీఎం యంత్రాలన్ని ఈ గొదాంలో భద్రపరుచనున్నారు. రెండుమూడు రోజుల్లో ఈవీఎం మిషన్లను భద్రపరిచే గోదాంను ప్రారంభించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. -
‘నోటా’కు బాగానే పడ్డాయ్!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘నోటా’కు భారీగా ఓట్లు పడ్డాయి. రాజకీయ పార్టీలపై ఆశలు కోల్పోయిన చాలామంది ‘పై అభ్యర్థుల్లో ఎవరూ కాదు’(నోటా) బటన్‌ను నొక్కారు. రాజకీయ పోటీ తీరును మార్చడానికి దీనికి ఓటేశామని వారు చెప్పారు. ఓటర్లకు అభ్యర్థులందర్నీ తిరస్కరించే హక్కు ఉందని, దీని కోసం ఈవీఎంలలో బటన్‌ను ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశంపై రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలతోపాటు ఢి ల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘నోటా’ను అమల్లోకి తీసుకొచ్చారు. తమకు నోటా బటన్‌ను నొక్కే మంచి అవకాశం ఈ ఎన్నికల్లో లభించిందని పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి వాసి అరవింద్ త్యాగి చెప్పారు. తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను ఆయన ఏకరువు పెట్టారు. ఈ బటన్‌ను ఇదివరకే తీసుకొచ్చి ఉంటే బాగుండేదని మరో ఓటరు చెప్పారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ పోటీ చేస్తున్న కృష్ణ నగర్లో చాలా మంది యువతీయువకులు నోటాకు ఓటేశామన్నారు. అయితే ఈ దీని గురించి తమకు తెలియదని దక్షిణ ఢిల్లీలోని చాలామంది ఓటర్లు తెలిపారు. నోటా వల్ల ఉపయోగం లేదని, దానికి ఓటేసే బదులు ఇంట్లోనే కూర్చుంటే సరిపోతుందని సర్దార్ బజార్ అనే వ్యక్తి అన్నాడు.