సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ ఎన్నికల పోలింగ్‌ను మూడు విడతలుగా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. జనవరి 21న తొలి విడత, 25న రెండో విడత, 30న మూడో విడత పోలింగ్ జరుగుతుందన్నారు. తొలి విడత ఎన్ని కల ప్రక్రియ జనవరి 7న ప్రారంభమై 21తో ముగుస్తుందని, రెండో విడత 11న ప్రారంభమై 25తో, మూడో విడత 16న ప్రారంభమై 30తో ముగుస్తుందని వివరించారు. కరీంనగర్ జిల్లాలో 313 గ్రామ పంచాయతీలు.. 2,966 వార్డుల్లో ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా మొత్తం 3985 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఫలితాలు ప్రకటిస్తారు.
ఎన్నికలకు సిద్ధంగా అధికార యంత్రాంగం...
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు మొదలు పోలింగ్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేసింది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పర్యవేక్షణలో పది రోజులుగా కసరత్తు చేసిన పంచాయతీ, రెవెన్యూ అధికారులు 313 గ్రామ పంచాయతీలు, 2,966 వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. 3,985 పోలింగ్ బాక్సులను ఇప్పటికీ సిద్ధం చేయగా, మరో 500 బాక్సుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 9,09,800 బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని గుర్తించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు 4,404 మంది ప్రిసైడింగ్ అధికారులు, అదనపు పోలింగ్ ఆఫీసర్లను నియమించనున్నారు. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ విధుల కోసం రూట్, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ తదితర కేడర్‌లతో పాటు 10 శాతం అదనంగా కలుపుకుని 4,600 మందిని ఎంపిక చేసి, ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు.
నామినేషన్ ఫీజు, ఖర్చుల వివరాలు...
సర్పంచ్‌లుగా పోటీ చేసిన అభ్యర్థులు (జనరల్) రూ.2000, రిజర్వుడు కేటగిరీ రూ.1000, వార్డు మెంబర్ (జనరల్) రూ.500, రిజర్వుడు రూ.250 చొప్పున ధరావతుగా చెల్లించాల్సి ఉంటుంది. 5వేల జనాభా దాటిన పంచాయతీలైతే అభ్యర్థులు రూ.2,50,000 మించి ఖర్చు చేయరాదు. 5వేలకంటే తక్కువ జనాభా కలిగిన గ్రామ పంచాయతీలైతే అభ్యర్థుల ఖర్చును రూ.1,50,000గా నిర్ణయించారు. పరిమితికి మించి ఖర్చుచేస్తే పదవి కోల్పోవాల్సి వస్తుందని ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి హెచ్చరించారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లలో భాగంగా మహిళలకు 156 మందికి సర్పంచ్‌గా, 1,639 మందికి వార్డు సభ్యులుగా అవకాశం కలగనుంది. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తు ఉంటుందని నాగిరెడ్డి వెల్లడించారు.
నేటి నుంచి ఎన్నికల కోడ్...
ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తి మాత్రమే ఓటు వేయటానికి అర్హుడు. ఎనిమిది రకాల గుర్తింపు కార్డుల ద్వారా ఓటును వినియోగించుకోవచ్చు. ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు మైక్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. ఎన్నికల కోడ్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం కొత్త పథకాలు, అధికారిక పర్యటనలు చేయటానికి వీల్లేదు. కాగా బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థి పేరు ఉండదు. సర్పంచ్, వార్డు సభ్యులకు వేర్వేరుగా బ్యాలెట్ పేపర్లు తెలుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి.
పంచాయతీ నగారా
Published Wed, Jan 2 2019 11:22 AM | Last Updated on Wed, Jan 2 2019 11:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment