గ్రామాల్లో గులాబీ బలగం | TRS Party Is Panchayat Wines In Adilabad | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో గులాబీ బలగం

Published Mon, Feb 4 2019 10:04 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

TRS Party Is Panchayat Wines In Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: గ్రామాల పాలక మండళ్లే పార్టీ నిర్మాణంగా మారిన అరుదైన అవకాశం అధికార టీఆర్‌ఎస్‌కు లభించింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన సర్పంచులు, వార్డు సభ్యులే మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడంతో గ్రామస్థాయిలో పార్టీకి బలమైన బలగం లభించినట్లయింది. టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీలు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేకపోగా, గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులతో కూడిన పాలక మండళ్లే గ్రామ కమిటీలుగా క్రియాశీలక పాత్రపోషించబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్‌ఎస్‌కు ఉమ్మడి ఆదిలాబాద్‌లో తొలి నుంచీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం లేదు.

జిల్లా పార్టీ అధ్యక్షులు, కన్వీనర్ల నియామకంతోనే సరిపెట్టే పార్టీలో మిగతా వారంతా జిల్లా, నియోజకవర్గ, మండల
నాయకులుగానే చలామణి అవుతున్నారు. పార్టీ ఏర్పాటైన తొలినాళ్లలో 2004, 2009లలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయాలు నమోదు చేసుకున్నప్పటికీ, సంస్థాగతంగా మండల, జిల్లా కార్యవర్గాల ఏర్పాటు జరగలేదు. ఇక 2014లో పార్టీ అధికారం చేపట్టినా, అదే పరిస్థితి. తాజాగా 2018 ఎన్నికల్లో సైతం పార్టీ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించింది. 18 సం వత్సరాల పార్టీ ప్రస్థానంలో ఎలాంటి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిర్వహించని టీఆర్‌ఎస్‌కు ఈసారి ఏకంగా అధికార హోదాలోనే పార్టీ సంస్థాగత నిర్మాణం ఏర్పాటు కావడం అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు. 

933 పంచాయతీల్లో గులాబీదే హవా! 
ఉమ్మడి ఆదిలాబాద్‌ పరిధిలోని నాలుగు జిల్లాల్లో 1,508 గ్రామ పంచాయతీలకు గాను 1,493 చోట్ల ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏకగ్రీవం, ఎన్నికలు జరిగిన గ్రామాలు కలుపుకొని 933 పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన సర్పంచు అభ్యర్థులే విజయకేతనం ఎగరేశారు. ఒక్కో గ్రామంలో 6 నుంచి 12 మంది వార్డు సభ్యులు కూడా ఆ పార్టీ మద్ధతుదారులే. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాజకీయ పార్టీల ఏకీకరణ పేరుతో ఇతర పార్టీలకు చెందిన వారందరినీ గులాబీ గూటికి చేర్చుకొంది.

. ఇటీవల పం చాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతోపాటు ఓడిపోయిన వారు కూడా టీఆర్‌ఎస్‌ మద్ధతుదారులే ఎక్కువగా ఉండడం ఇందుకు ఉదాహరణ. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 10 నియోజకవర్గాల్లో తొమ్మిది చోట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉండగా, జెడ్పీటీసీలు,  ఎంపీటీసీలు కూడా ఆ పార్టీకి చెంది న వారే అధికం. ఇప్పుడు గ్రామ కమిటీలు కూడా టీఆర్‌ఎస్‌ చేతికే చిక్కడంతో సంస్థాగత పార్టీ ని ర్మాణంతో సంబంధంలేకుండా...అధికార హోదా ల్లో టీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా ఆవిర్భవించింది.

కాంగ్రెస్‌కు 265 పంచాయతీలే.. 
మొన్నటి శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్‌ కేవలం ఆసిఫాబాద్‌లోనే స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. నిర్మల్‌ జిల్లాలో అత్యధికంగా 82 చోట్ల కాంగ్రెస్‌ గెలిచింది. ఆదిలాబాద్‌లో 65, కుమురంభీంలో 67, మంచిర్యాలలో 51 స్థానాలు గెలిచింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఎందరు కాంగ్రెస్‌లో కొనసాగుతారనేది ప్రశ్న. ఇక స్వతంత్రులు గెలిచిన 249 స్థానాల్లో 200 మందికి పైగా టీఆర్‌ఎస్‌ గూటికి చేరే అవకాశం ఉంది.

భవిష్యత్‌ ఎన్నికల్లో ప్రభావం 
పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించిన టీఆర్‌ఎస్‌ అదే ఊపుతో రాబోయే ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగరేయాలనే పట్టుదలతో ఉంది. త్వరలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని భావిస్తుండగా, ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న ఏడు మున్సిపాలిటీలకు తోడు మరో నాలు గు కొత్తవి ఏర్పాటు కాబోతున్నాయి. 11 మున్సిపాలిటీల్లోనూ అభ్యర్థులను గెలిపించుకోవాలని  ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నా రు. లోక్‌సభ ఎన్నికల్లో పట్టణ, గ్రామాల్లోని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులే ఎంపీ అభ్యర్థుల విజయానికి దోహదపడే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement