Karimnagar mla
-
పంచాయతీ నగారా
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ ఎన్నికల పోలింగ్‌ను మూడు విడతలుగా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. జనవరి 21న తొలి విడత, 25న రెండో విడత, 30న మూడో విడత పోలింగ్ జరుగుతుందన్నారు. తొలి విడత ఎన్ని కల ప్రక్రియ జనవరి 7న ప్రారంభమై 21తో ముగుస్తుందని, రెండో విడత 11న ప్రారంభమై 25తో, మూడో విడత 16న ప్రారంభమై 30తో ముగుస్తుందని వివరించారు. కరీంనగర్ జిల్లాలో 313 గ్రామ పంచాయతీలు.. 2,966 వార్డుల్లో ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా మొత్తం 3985 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికలకు సిద్ధంగా అధికార యంత్రాంగం... గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు మొదలు పోలింగ్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేసింది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పర్యవేక్షణలో పది రోజులుగా కసరత్తు చేసిన పంచాయతీ, రెవెన్యూ అధికారులు 313 గ్రామ పంచాయతీలు, 2,966 వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. 3,985 పోలింగ్ బాక్సులను ఇప్పటికీ సిద్ధం చేయగా, మరో 500 బాక్సుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 9,09,800 బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని గుర్తించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు 4,404 మంది ప్రిసైడింగ్ అధికారులు, అదనపు పోలింగ్ ఆఫీసర్లను నియమించనున్నారు. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ విధుల కోసం రూట్, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ తదితర కేడర్లతో పాటు 10 శాతం అదనంగా కలుపుకుని 4,600 మందిని ఎంపిక చేసి, ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. నామినేషన్ ఫీజు, ఖర్చుల వివరాలు... సర్పంచ్‌లుగా పోటీ చేసిన అభ్యర్థులు (జనరల్) రూ.2000, రిజర్వుడు కేటగిరీ రూ.1000, వార్డు మెంబర్ (జనరల్) రూ.500, రిజర్వుడు రూ.250 చొప్పున ధరావతుగా చెల్లించాల్సి ఉంటుంది. 5వేల జనాభా దాటిన పంచాయతీలైతే అభ్యర్థులు రూ.2,50,000 మించి ఖర్చు చేయరాదు. 5వేలకంటే తక్కువ జనాభా కలిగిన గ్రామ పంచాయతీలైతే అభ్యర్థుల ఖర్చును రూ.1,50,000గా నిర్ణయించారు. పరిమితికి మించి ఖర్చుచేస్తే పదవి కోల్పోవాల్సి వస్తుందని ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి హెచ్చరించారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లలో భాగంగా మహిళలకు 156 మందికి సర్పంచ్‌గా, 1,639 మందికి వార్డు సభ్యులుగా అవకాశం కలగనుంది. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తు ఉంటుందని నాగిరెడ్డి వెల్లడించారు. నేటి నుంచి ఎన్నికల కోడ్... ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తి మాత్రమే ఓటు వేయటానికి అర్హుడు. ఎనిమిది రకాల గుర్తింపు కార్డుల ద్వారా ఓటును వినియోగించుకోవచ్చు. ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు మైక్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. ఎన్నికల కోడ్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం కొత్త పథకాలు, అధికారిక పర్యటనలు చేయటానికి వీల్లేదు. కాగా బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థి పేరు ఉండదు. సర్పంచ్, వార్డు సభ్యులకు వేర్వేరుగా బ్యాలెట్ పేపర్లు తెలుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి. -
తెరపైకి మళ్లీ పెద్దిరెడ్డి..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ టికెట్ మహాకూటమికి కేటాయించనున్నారా..? ఉమ్మడి కరీంనగర్లో ఇప్పటివరకు సీపీఐకి మాత్రమే ఒక్కసీటును కేటాయించిన కాంగ్రెస్ హుజూరాబాద్ టీడీపీకి ఇవ్వనుందా..? కూకట్పల్లి వ్యూహం బెడిసికొట్టడంతో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డిని బుజ్జగించిన చంద్రబాబు హుజూరాబాద్ నుంచి రంగంలోకి దింపనున్నారా..? ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డిని బాబు అమరావతికి పిలుచుకున్నారా..? టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డికి తొలి, రెండో జాబితాలో అవకాశం కల్పించకపోవడం వెనుక ఆసలు కారణం ఇదేనా..? హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు జోరుగా చర్చించుకుంటున్న అంశాలు ఇవి. రెండు రోజులుగా రాష్ట్ర, దేశ రాజధానిలలో జరుగుతున్న పరిణామాలు కూడా వీటినే సూచిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకటి సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. హుజూరాబాద్, కోరుట్లలో మాత్రం ఎవరినీ ప్రకటించలేదు. తాజాగా శనివారం కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. హుజూరాబాద్ నుం చి మహాకూటమి అభ్యర్థిగా పెద్దిరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం శుక్రవారం నుంచి జోరందుకుంది. కూకట్పల్లి వ్యూహం బెడిసినందు వల్లే... హుజూరాబాద్‌కు పెద్దిరెడ్డి పేరు ప్రతిపాదన.. మహాకూటమికి రూపకల్పన జరిగిన మరుసటి రోజు నుంచే తెలుగుదేశం పార్టీ హుజూరాబాద్, కోరుట్ల స్థానాలను అడుగుతోంది. అదేవిధంగా సీపీఐ హుస్నాబాద్, టీజేఎస్ కరీంనగర్, హుజూరాబాద్, రామగుండంలపై దృష్టి పెట్టాయి. అయితే.. కాంగ్రెస్, కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు పలు దఫాలుగా జరిపిన చర్చల అనంతరం సీట్ల సర్దుబాటులో రాజీ ధోరణి ప్రదర్శించాయి. ఇదే సమయంలో మొదట హుజూరాబాద్ స్థానాన్ని ఆశించిన ఇనుగాల పెద్దిరెడ్డి అధిష్టానం అంగీకారంతో కూకట్‌పల్లికి మారారు. ఇక మొదట కోరుట్ల నుంచి పోటీ చేయాలనుకున్న టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కూడా విముఖత వ్యక్తం చేయడంతో జిల్లాలో ఆ రెండు స్థానాలకు టీడీపీ దూరమైంది. మూడు స్థానాలపై కన్నేసిన టీజేఎస్ సైతం స్థబ్దుగా ఉండగా, హుస్నాబాద్‌పై సీపీఐ మాత్రం పట్టు వీడలేదు. ఈ నేపథ్యంలో సీపీఐకి హుస్నాబాద్‌కు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్, కోరుట్లలో తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది. అప్పటికే రెండు విడతల్లో 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇదే సమయంలో కూకట్పల్లి స్థానాన్ని నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినికి కేటాయించడంతో అక్కడ పెద్దిరెడ్డికి షాక్ తగిలింది. దీంతో మనస్థాపానికి గురైన పెద్దిరెడ్డి తనదైన శైలిలో చంద్రబాబు తీరుపై అసంతృప్తి వెళ్లగక్కారు. ఇదిలా వుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఆయన భార్య, అల్లుడు వరసయ్యే మరొకరికి ఇప్పటికే టికెట్లు ఇచ్చినందువల్ల హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని హుజూరాబాద్ నుంచి పెద్దిరెడ్డిని పోటీలోకి దింపాలన్న యోచనలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అమరావతిలో చంద్రబాబుతో పెద్దిరెడ్డి భేటీ.. ఢిల్లీ నుంచి కౌశిక్‌రెడ్డి తిరుగుపయనం.. తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం అమరావతికి పిలిపించుకున్నారు. కూకట్పల్లి టికెట్ అనివార్యంగా సుహాసినికి ఇవ్వాల్సి రావడంతో హుజూరాబాద్ నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసే విషయమై చంద్రబాబు అమరావతిలో పెద్దిరెడ్డితో చర్చించినట్లు తెలిసింది. కూకట్‌పల్లిపై మాట ఇవ్వడంతో అక్కడ తాను ప్రచారం చేసుకున్న తరుణంలో హఠాత్తుగా జరిగిన మార్పుపై ఈ సందర్భంగా పెద్దిరెడ్డి కొంత ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా.. హుజూరాబాద్ నుంచి పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ, సైకిల్ గుర్తుపై పోటీ చేస్తే ఓట్లు పడవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో ఓ స్థానం నుంచి ఖచ్చితంగా పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ నేత కోరుట్ల విషయమై కూడా కొంత సమాలోచనలు జరిపినట్లు చెప్తున్నారు. ఒకవేళ హుజూరాబాద్ నుంచి పోటీ చేయాల్సి వస్తే టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి చేయి గుర్తుపై చేస్తే ఫలితం ఉంటుందన్న చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలా వుంటే మొదటి జాబితాలోనే తన పేరు వస్తుందని భావించిన పాడి కౌశిక్‌రెడ్డి తొలి, రెండో జాబితాల్లో రాకపోవడంతో ఖంగుతిన్నారు. చివరి ప్రయత్నంగా శుక్రవారం ఆయన ఢిల్లీకి రాహుల్‌గాంధీని కలిసినా విషయం తేలకపోవడంతో కౌశిక్‌రెడ్డి తిరుగు పయనమయ్యారు. కాగా.. శనివారం కాంగ్రెస్ తుది జాబితా ప్రకటన నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, అటు టీడీపీ నాయకులు మరోమారు సమావేశం అవుతున్నట్లు ప్రకటించారు. చివరి నిమిషంలో ఏ పరిణామాలు జరుగుతాయి? కాంగ్రెస్, టీడీపీలు హుజూరాబాద్ నుంచి ఎవరిని బరిలోకి దింపుతాయి? హుజూరాబాద్ అభ్యర్థి కౌశిక్రెడ్డా? పెద్దిరెడ్డా? అన్న సస్పెన్స్‌కు నేడు తెరపడనుంది. -
‘సెటిల్మెంట్’ వివాదంలో.. మోహన్‌రెడ్డి
కోర్టు కేసుల విచారణ అంటేనే మోహన్‌రెడ్డికి ములాఖత్‌ల వ్యవహారంగా మారింది. విచారణకు వచ్చిన ప్రతీసారి మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి ములాఖత్‌లతో తన వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటున్నాడనే ఆరోపణలకు బలం చేకూర్చింది తాజా సంఘటన. కేసుల విచారణకు కరీంనగర్ వచ్చే ఆయన ముందు.. తర్వాత.. హోటళ్లు, దాబాల్లో అడ్డాలు పెట్టి కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలతో తనకు కావాల్సినంత సమయం తీసుకొని సెటిల్మెంట్స్ నడిపిస్తున్నారనే విమర్శలు గతం నుంచి కూడా ఉన్నాయి. మార్చి 25న ఏకంగా కోర్టు ఎదుట గణేష్భవన్లో నిబంధనలకు విరుద్ధంగా ములాఖత్‌లు జరిపారంటూ ఆయన బాధితుల సంఘం, లోక్‌సత్తా పోలీసు, జైలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఈనెల 1న కరీంనగర్ సబ్‌కోర్టులో హాజరయ్యేందుకు వచ్చిన మోహన్‌రెడ్డి లగ్జరీ ఏసీ కారు (క్రేటా)లో యూనిఫాంలో ఉన్న ఎస్కార్టు పోలీసులతో ఓ హోటల్లో కొందరితో ములాఖత్ నిర్వహించడం, ప్రైవేట్ కారు, హోటల్‌కు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు శుక్రవారం మోహన్‌రెడ్డి బాధితుల సంఘం, లోక్‌సత్తా పోలీసు, జైలు ఉన్నతాధికారులకు మరోమారు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. – సాక్షిప్రతినిధి, కరీంనగర్ సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రసాద్‌రావు ఆత్మహత్య కేసులో అరెస్టై ఇప్పటికి 72 కేసులను ఎదుర్కొంటున్న మోహన్‌రెడ్డి చాలా కాలం కరీంనగర్ జైలులో ఉన్నారు. ఈ తరుణంలోనే సంచలన వీడియో బయటపడడం, కరీంనగర్ జైలు అధికారి కార్యాలయంలోనే నిబంధనలకు విరుద్ధంగా ములాఖత్‌లు నిర్వహిం చారన్న ఆరోపణలపై జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం, మోహన్‌రెడ్డి, ఆయన బావమరిదిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించింది. కరీంనగర్ జైల్లో ఉన్నప్పుడు వీఐపీలాగా జైల్లోనే ములాఖత్‌లు పెట్టడం, వీడియో దృశ్యాలు బయటపడడంతో మోహన్‌రెడ్డిని వరంగల్ జైలుకు తరలించారు. అయినా మోహన్‌రెడ్డి ములాఖత్‌లకు ఎక్కడా భంగం వాటిల్లినట్లు కనబడకపోగా, ఆయనకు పోలీసుశాఖకు చెందిన టాటా సుమో ఏసీ వాహనం సమకూర్చడం అప్పట్లో వివాదం అయ్యింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి మోహన్‌రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరు పరచే నిమిత్తం గతంలో టీఎస్09–పీఏ1339 నంబర్ గల ఏసీ టాటా సుమో మఫ్టీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌తో తీసుకురావడం కూడా వివాదాస్పదమైంది. ఆ విషయం మరువక ముందే మార్చి 25న ఎస్కార్ట్ పోలీసుల సమక్షంలో మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులను, అనుమాయులను కలిసి చర్చించడమే కాకుండా పోలీసులకు నజరానా ముట్టజెప్పిన దృశ్యాల వీడియోలు బయటపడడం సంచలనం రేపింది. కరీంనగర్ కోర్టుకు వచ్చిన మోహన్‌రెడ్డి, దానికి ఎదురుగా ఉన్న గణేష్భవన్ ఉడిపి హోటల్లో సాయంత్రం 6.02 గంటలకు ప్రవేశించి ఏకంగా 23 నిమిషాలు హోటల్లో గడిపారు. ఈ క్రమంలో ఆయన తన కుమారుడు అక్షయ్‌రెడ్డి తమ్ముడు బొబ్బల మహేందర్‌రెడ్డితోపాటు బంధువులు, మణింధర్సింగ్తో చర్చలు జరిపారు. 6.24 నిమిషాలకు మోహన్‌రెడ్డి సూచనల మేరకు చర్చల అనంతరం మహేందర్‌రెడ్డి హోటల్ బెంచీపై డబ్బులు పెట్టాడు. మోహన్‌రెడ్డి లేవగానే అక్కడున్న కానిస్టేబుల్ ఆ మొత్తాన్ని తన జేబులో పెట్టుకొని నడుస్తున్న దృశ్యం వీడియోలో స్పష్టంగా కనిపించడం కలకలం రేపగా, ఎస్కార్టు పోలీసులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. తాజా సంఘటన మరోమారు కలకలానికి కారణమైంది. మోహన్‌రెడ్డి, ఎస్కార్టుపై చర్యలు తీసుకోవాలి..: బాధితుల సంఘం సబ్‌కోర్టు నంబర్ 416లో ఓ కేసు విచారణ నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటళ్లో సెటిల్మెంట్ చేసి ఎస్కార్టు పోలీసులతో ఏసీ కారులో బయటకు వెళ్తున్న వీడియో దృశ్యాలు బయట పెట్టిన బాధితుల సంఘం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఈనెల 1న కరీంనగర్ కోర్టుకు వచ్చినప్పుడు జిల్లా సమీపంలో ఒక ప్రైవేట్ భోజనశాలల్లో కూర్చొని సన్నిహితులతో ములాఖత్ నిర్వహించారని, సెటిల్మెంట్ చేసుకున్నారని, మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డితోపాటు ఆయనకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ముస్కు మహేందర్‌రెడ్డి, బండమీది సామన్న ఒక ప్రకటనలో కోరారు. ప్రైవేట్ వాహనాన్ని అనుమతించి మోహన్‌రెడ్డి ప్రైవేట్ ములాఖా™Œత్‌కు సహకరించిన ఎస్కార్ట్ పోలీసులపై తక్షణమే చర్య తీసుకోవాలని బాధితుల సంఘం ప్రకటనలో డిమాండ్ చేసింది. విషయం తెలిసింది.. విచారణకు ఆదేశించాం.. కోర్టు కేసు నిమిత్తం కరీంనగర్‌కు వచ్చిన మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి, ఎస్కార్టు పోలీసుల విష యం మా దృష్టికి వచ్చింది. డీఐజీ దృష్టికి కూడా తీసుకెళ్లి విచారణకు ఆదేశించాం. వీడియోలో వ్యక్తులు స్పష్టంగా కనిపించడం లేదు. అయినప్పటికీ ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం. ఎస్కార్టు పోలీసుల తీరుపైనా ఆరా తీస్తున్నాం. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వీబీ కమలాసన్ రెడ్డి, పోలీసు కమిషనర్, కరీంనగర్ -
ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు తప్పిన ముప్పు
గజ్వేల్ : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన వాహనాన్ని....ఎదురుగా వస్తున్న ఓ కారు ఢీకొంది. శుక్రవారం ఉదయం గంగుల కమలాకర్ హైదరాబాద్ వస్తుండగా మెదక్ జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే అక్కడ నుంచి వేరే వాహనంలో హైదరాబాద్ బయల్దేరారు.