తెరపైకి మళ్లీ పెద్దిరెడ్డి..! | Huzurabad Constituency Suspense Karimnagar | Sakshi
Sakshi News home page

తెరపైకి మళ్లీ పెద్దిరెడ్డి..!

Published Sat, Nov 17 2018 7:40 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Huzurabad Constituency Suspense Karimnagar - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ టికెట్‌ మహాకూటమికి కేటాయించనున్నారా..? ఉమ్మడి కరీంనగర్‌లో ఇప్పటివరకు సీపీఐకి మాత్రమే ఒక్కసీటును కేటాయించిన కాంగ్రెస్‌ హుజూరాబాద్‌ టీడీపీకి ఇవ్వనుందా..? కూకట్‌పల్లి వ్యూహం బెడిసికొట్టడంతో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డిని బుజ్జగించిన చంద్రబాబు హుజూరాబాద్‌ నుంచి రంగంలోకి దింపనున్నారా..? ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డిని బాబు అమరావతికి పిలుచుకున్నారా..? టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డికి తొలి, రెండో జాబితాలో అవకాశం కల్పించకపోవడం వెనుక ఆసలు కారణం ఇదేనా..? హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పుడు జోరుగా చర్చించుకుంటున్న అంశాలు ఇవి.

రెండు రోజులుగా రాష్ట్ర, దేశ రాజధానిలలో జరుగుతున్న పరిణామాలు కూడా వీటినే సూచిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఒకటి సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్‌ పార్టీ 10 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. హుజూరాబాద్, కోరుట్లలో మాత్రం ఎవరినీ ప్రకటించలేదు. తాజాగా శనివారం కాంగ్రెస్‌ మూడో జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. హుజూరాబాద్‌ నుం చి మహాకూటమి అభ్యర్థిగా పెద్దిరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం శుక్రవారం నుంచి జోరందుకుంది.
 
కూకట్‌పల్లి వ్యూహం బెడిసినందు వల్లే... హుజూరాబాద్‌కు పెద్దిరెడ్డి పేరు ప్రతిపాదన..
మహాకూటమికి రూపకల్పన జరిగిన మరుసటి రోజు నుంచే తెలుగుదేశం పార్టీ హుజూరాబాద్, కోరుట్ల స్థానాలను అడుగుతోంది. అదేవిధంగా సీపీఐ హుస్నాబాద్, టీజేఎస్‌ కరీంనగర్, హుజూరాబాద్, రామగుండంలపై దృష్టి పెట్టాయి. అయితే.. కాంగ్రెస్, కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు పలు దఫాలుగా జరిపిన చర్చల అనంతరం సీట్ల సర్దుబాటులో రాజీ ధోరణి ప్రదర్శించాయి. ఇదే సమయంలో మొదట హుజూరాబాద్‌ స్థానాన్ని ఆశించిన ఇనుగాల పెద్దిరెడ్డి అధిష్టానం అంగీకారంతో కూకట్‌పల్లికి మారారు. ఇక మొదట కోరుట్ల నుంచి పోటీ చేయాలనుకున్న టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ కూడా విముఖత వ్యక్తం చేయడంతో జిల్లాలో ఆ రెండు స్థానాలకు టీడీపీ దూరమైంది.

మూడు స్థానాలపై కన్నేసిన టీజేఎస్‌ సైతం స్థబ్దుగా ఉండగా, హుస్నాబాద్‌పై సీపీఐ మాత్రం పట్టు వీడలేదు. ఈ నేపథ్యంలో సీపీఐకి హుస్నాబాద్‌కు కేటాయించిన కాంగ్రెస్‌ పార్టీ హుజూరాబాద్, కోరుట్లలో తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది. అప్పటికే రెండు విడతల్లో 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇదే సమయంలో కూకట్‌పల్లి స్థానాన్ని నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినికి కేటాయించడంతో అక్కడ పెద్దిరెడ్డికి షాక్‌ తగిలింది.

దీంతో మనస్థాపానికి గురైన పెద్దిరెడ్డి తనదైన శైలిలో చంద్రబాబు తీరుపై అసంతృప్తి వెళ్లగక్కారు. ఇదిలా వుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఆయన భార్య, అల్లుడు వరసయ్యే మరొకరికి ఇప్పటికే టికెట్లు ఇచ్చినందువల్ల హుజూరాబాద్‌ నుంచి పాడి కౌశిక్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వవద్దని కొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని హుజూరాబాద్‌ నుంచి పెద్దిరెడ్డిని పోటీలోకి దింపాలన్న యోచనలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

అమరావతిలో చంద్రబాబుతో పెద్దిరెడ్డి భేటీ.. ఢిల్లీ నుంచి కౌశిక్‌రెడ్డి తిరుగుపయనం..
తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం అమరావతికి పిలిపించుకున్నారు. కూకట్‌పల్లి టికెట్‌ అనివార్యంగా సుహాసినికి ఇవ్వాల్సి రావడంతో హుజూరాబాద్‌ నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసే విషయమై చంద్రబాబు అమరావతిలో పెద్దిరెడ్డితో చర్చించినట్లు తెలిసింది. కూకట్‌పల్లిపై మాట ఇవ్వడంతో అక్కడ తాను ప్రచారం చేసుకున్న తరుణంలో హఠాత్తుగా జరిగిన మార్పుపై ఈ సందర్భంగా పెద్దిరెడ్డి కొంత ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా.. హుజూరాబాద్‌ నుంచి పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ, సైకిల్‌ గుర్తుపై పోటీ చేస్తే ఓట్లు పడవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఉమ్మడి జిల్లాలో ఓ స్థానం నుంచి ఖచ్చితంగా పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ నేత కోరుట్ల విషయమై కూడా కొంత సమాలోచనలు జరిపినట్లు చెప్తున్నారు. ఒకవేళ హుజూరాబాద్‌ నుంచి పోటీ చేయాల్సి వస్తే టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీ నుంచి చేయి గుర్తుపై చేస్తే ఫలితం ఉంటుందన్న చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలా వుంటే మొదటి జాబితాలోనే తన పేరు వస్తుందని భావించిన పాడి కౌశిక్‌రెడ్డి తొలి, రెండో జాబితాల్లో రాకపోవడంతో ఖంగుతిన్నారు. చివరి ప్రయత్నంగా శుక్రవారం ఆయన ఢిల్లీకి రాహుల్‌గాంధీని కలిసినా విషయం తేలకపోవడంతో కౌశిక్‌రెడ్డి తిరుగు పయనమయ్యారు. కాగా.. శనివారం కాంగ్రెస్‌ తుది జాబితా ప్రకటన నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇటు కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు, అటు టీడీపీ నాయకులు మరోమారు సమావేశం అవుతున్నట్లు ప్రకటించారు. చివరి నిమిషంలో ఏ పరిణామాలు జరుగుతాయి? కాంగ్రెస్, టీడీపీలు హుజూరాబాద్‌ నుంచి ఎవరిని బరిలోకి దింపుతాయి? హుజూరాబాద్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డా? పెద్దిరెడ్డా? అన్న సస్పెన్స్‌కు నేడు తెరపడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement