అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 3,310 పోలింగ్ కేంద్రాలుండగా, 7 వేల కంట్రోల్ యూనిట్లు, 8,200 బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన వీటిని వారం రోజుల క్రితం బెంగళూ రు నుంచి తెప్పించారు. ప్రస్తుతం స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని గోదాములో వీటిని భద్రపరిచారు. ఒక్కో బ్యాలెట్ యూనిట్‌లో గరిష్టంగా 16 మంది దాకా అభ్యర్థులకు చోటు కల్పించనున్నారు. ఇంకా అభ్యర్థులున్నట్లయితే మరో బ్యాలెట్ యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
తొలిసారిగా నోటా బటన్
మే 7న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా నోటా (నన్ ఆఫ్ అబౌ) బటన్ ఆప్షన్ వినియోగించేలా ఎన్నికల కమిషన్ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. పాత ఈవీఎంలలో ఓటు (నోటా)తిరస్కరణ బటన్ ఉండేది కాదు. ప్రస్తుతం ఈ ఏడాది నుంచి ఈవీఎంలలో కొత్తగా నో టా బటన్ ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులందరి పేర్ల తర్వాత చివరలో నోటా బటన్ ఉంటుంది.
ఓట్ కన్ఫర్మేషన్ మెథడ్
మనం వేసే ఓటు ఎవరికి పడిందనేది తెలుసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం ఈ పర్యాయం కల్పించింది. ఈవీఎంలో ఓటు వేసిన తరువాత ఆ ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవాలంటే పోలింగ్ అధికారిని సంప్రదించాలి. పోలింగ్ అధికారి ఈవీఎంలో ఓటు కన్ఫర్మేషన్ బటన్‌ను నొక్కుతారు. అప్పుడు ఈవీఎం స్క్రీన్ ముందు పది సెకన్‌ల పాటు ఓటరు నిల్చోవాలి.
ఈవీఎం స్క్రీన్‌లో ఓటు ఎవరికి పడిందనేది డిస్‌ప్లే అవుతుంది. అప్పటికీ ఓటరుకు నమ్మకం కుదరకపోతే అందుకు సంబంధించిన స్లిప్ కావాలని కూడా అడగవచ్చు. ఇందుకు సంబంధించిన స్లిప్‌ను పోలింగ్ అధికారి తీసి ఓటరుకు చూపిస్తారు. కానీ ఆ స్లిప్‌ను బయటకు ఇవ్వరు. ఆ స్లిప్‌ను ఈవీఎంకు పక్కనే ఉంచిన సీల్డ్ పెట్టెలో వేస్తారు. దీన్నే ఓట్ కన్ఫర్మేషన్ పద్ధతి అంటారు. ఈ విధానాన్ని మన జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఎన్నికల సంఘం చేపట్టనుండడం గమనార్హం.
ఈవీఎంలపై అధికారులకు అవగాహన కల్పించిన కలెక్టర్
బెంగళూరు నుంచి కొత్తగా తెప్పించిన ఈవీఎంలపై కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులకు అవగాహన కల్పించారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, డీఆర్వో హేమసాగర్, రిటర్నింగ్ అధికారులతో కలిసి స్థానిక ఈవీఎం గోదాములో ఈవీఎంలను పరిశీలించారు. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్‌లను ఎలా వినియోగించాలనే విధానంపై కూలంకుషంగా వివరించారు.
సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధం
Published Tue, Apr 8 2014 2:31 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM
Advertisement
Advertisement