నోరుకొడితే ‘నోటా’నే!
ప్రస్తుత ఎన్నికల్లో ‘నన్ ఆఫ్ ది అబౌ(నోటా)’ ఆప్షన్‌కు పెరిగిన ప్రజాదరణకు ఇదో ఉదాహరణ. ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఎలాంటి నోటీసు ఇవ్వకుండా.. ప్రత్యామ్నాయ పునరావాసం చూపించకుండా అకస్మాత్తుగా తమ గుడిసెలను కూల్చేసి.. వీధుల పాలు చేసినందుకు కోల్‌కతాలోని తప్సియా ప్రాంత మురికి వాడల ప్రజలు ఈ ఎన్నికల్లో నోటాతో నిరసన తెలపాలనుకుంటున్నారు. 2012 నవంబర్‌లోనే వారిని అక్కడినుంచి పంపించేసినా.. ఆ పాత అడ్రస్‌తోనే వారికి ఎన్నికల గుర్తింపు కార్డులున్నాయి. తప్సియా స్లమ్స్‌లో దాదాపు 300కు పైగా కుటుంబాలుండేవి. ఇళ్లను కూల్చేసే సమయంలో వారికి నామమాత్రంగా పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. అప్పటినుంచి వారంతా రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్నారు. నేతలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని, అందుకే తామంతా ఈసారి ఎవరికీ ఓటేయకుండా ‘నోటా’ మీట నొక్కుతామని చెబుతున్నారు.