దిగ్గజాలకు శృంగభంగం | Srngabhangam legends | Sakshi
Sakshi News home page

దిగ్గజాలకు శృంగభంగం

Published Sun, May 18 2014 4:02 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

దిగ్గజాలకు శృంగభంగం - Sakshi

దిగ్గజాలకు శృంగభంగం

  • చివరి ఎన్నికలు అనుకుంటే..   ఓటమి భారం
  • పరాజయం పాలైన ముద్దుకృష్ణమ,అరుణకుమారి, కుతూహలమ్మ
  • వారసులను రాజకీయాల్లోకి తెచ్చే యత్నంలో ముద్దు, కుతూహలమ్మను కుంగదీసిన ఓటమి
  • అరుణమ్మకు ఊరటనిచ్చిన జయదేవ్ గెలుపు
  •  జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన ముగ్గురు రాజకీయ దిగ్గజాలకు శృంగభంగం జరిగింది. వయసురీత్యా పోటీ చేసేందుకు ఇవే చివరి ఎన్నికలు అనుకుంటున్న సమయంలో ఆ ముగ్గురిని ఓటమి భారం కుంగదీసింది.

    సాక్షి, తిరుపతి: జిల్లా రాజకీయాల్లో తమకంటూ ఒక ముద్ర వేసుకున్న గాలి ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి, గుమ్మడి కుతూహలమ్మ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ ముగ్గురి ఓటమి తీవ్రం గా కలచివేసినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ముద్దుకృష్ణమ నాయుడు ఆరు దఫాలు, కుతూహలమ్మ, అరుణకుమారి నాలుగు దఫాలు శాసనసభ్యులుగా ఎన్నికై రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రులుగా వ్యవహరించారు.

    రాజకీయ ప్రవేశం నుంచి కాంగ్రెస్ వాదులుగా ఉంటూ వచ్చిన కుతూహలమ్మ, అరుణమ్మ ప్రత్యేక పరిస్థితుల్లో 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరారు. ముద్దుకృష్ణమ నాయుడు తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ మధ్యలో రెండు దఫాలు కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. వయస్సు పైబడుతుండటంతో వారసులను రాజకీయాల్లోకి తెచ్చేందుకు ఈ ముగ్గు రు నేతలు ఎన్నికల ముందు విశ్వప్రయత్నాలు చేశారు.

    అదృష్టం కలిసిరావడంతో గల్లా అరుణకుమారి తన కుమారుడు జయదేవ్‌ను గుంటూరు లోక్‌సభ స్థానంనుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. అక్కడ నుంచి ఆయన ఎన్నికయ్యారు. ముద్దుకృష్ణమ నాయుడు, కుతూహలమ్మ కూడా తమ కుమారులకు ఈ ఎన్నికల్లో టికెట్టు ఇప్పించేందుకు చంద్రబాబును పలు దఫాలు కలసి విజ్ఞప్తి చేశారు. కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రయోగాలకు తావులేదని చంద్రబాబు స్పష్టం చేయడంతో చివరకు వారే రంగంలోకి దిగారు.

    వారికి పరాభవం తప్పలేదు. దశాబ్దం తరువాత పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో తన ఓటమి ముద్దుకృష్ణమను మరింత బాధించినట్టు చెబుతున్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితుల్లో వారసుల రాజకీయ భవిష్యత్తుపై వారిలో ఆందోళన నెలకొన్నట్టు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లోనూ ముద్దుకృష్ణమ, కుతూహలమ్మ కోసం వారి కుమారులే ఎక్కువ శ్రమించారు.
     
    ఎనిమిది సార్లు పోటీ..ఆరుసార్లు ఎన్నిక

    ఎన్‌టీ.రామారావు చొరవతో 1983లో రాజకీయ అరంగేట్రం చేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు
    అప్పటి నుంచి ఇప్పటి వరకు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. ఎన్‌టీఆర్ మరణానంతరం కొంతకాలం లక్ష్మీపార్వతి పార్టీలో కొనసాగారు. ఆ తరువాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 1983 నుంచి 94 వరకు జరిగిన నాలుగు శాసనసభ ఎన్నికల్లోనూ పుత్తూరు నుంచి ఆయన వరుసగా విజయం సాధించారు.

    1999లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2004లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో పుత్తూరు నియోజకవర్గం రద్దయింది. అనూహ్య పరిస్థితుల్లో 2009 ఎన్నికల్లో టీడీపీ లో చేరి నగరి నుంచి పోటీచేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో తన వారసులను రంగంలోకి తీసుకురావాలని భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించక తానే పోటీ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తనకు మాత్రం పరాభవం ఎదురైంది.

    కాంగ్రెస్ వారసత్వాన్ని వదులుకుని.. మట్టికరచిన గల్లా

    కరుడుగట్టిన కాంగ్రెస్ వాది పాటూరు రాజగోపాల్‌నాయుడు వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన గల్లా అరుణకుమారికి ఈ ఎన్నికలు కొంత మోదాన్ని కొంత ఖేదాన్ని కలిగించాయి. దశాబ్దాల అనుబంధం తెంచుకుని కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇవే చివరివన్న నిర్ణయానికి వచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమె చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోవడం ఆవేదన కలిగించినప్పటికీ కుమారుడు జయదేవ్ గుంటూరు నుంచి లోక్‌సభకు ఎన్నిక కావడం ఊరటనిచ్చింది.

    కాంగ్రెస్ పార్టీకి తండ్రి రాజగోపాల్‌నాయుడు చేసిన సేవలు గుర్తించి 1989లో అరుణకుమారికి చంద్రగిరి టికెట్టు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె స్వల్ప ఆధిక్యతతో శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వరుసగా 2009 వరకు కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశారు. 1994లో ఒక్కసారి ఓడిపోయారు. అయితే రాష్ట్ర విభజన పరిణామాల్లో 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరి పోటీ చేసినప్పటికీ పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆమె పలు మంత్రి పదవులను అలంకరించారు.
     
    రాజకీయాల నుంచి తప్పుకునే సమయంలో..

    శాసనసభకు ఐదుసార్లు ఎన్నికైన గుమ్మడి కుతూహలమ్మకూ ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని వారసులను రంగంలోకి తేవాలని భావిస్తున్న తరుణంలో ఆమెకు ఈ ఓటమి ఇబ్బందికరంగా మారింది. 1985లో తొలిసారి వేపంజేరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన ఆమెను వరుస విజయాలు వరించాయి. 1994లో ఒక్కసారి ఆమెకు టికెట్టు దక్కలేదు. ఆ ఒక్కసారి మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ పోటీచేసి విజయం సాధించారు.

    2009 ఎన్నికల్లో వేపంజేరి నియోజకవర్గం రద్దయింది. కొత్తగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడిన గంగాధరనెల్లూరు నుంచి 2009లో పోటీ చేసి ఎన్నికయ్యారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు. చివరి ఎన్నికలు అనుకుంటున్న తరుణంలో ఆమెను ఓటమి భారం కుంగదీసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. శాసనసభ డెప్యూటీ స్పీకర్‌గా కూడా కొంతకాలం ఉన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement