మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్న సీఈసీ సునీల్ అరోరా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రలోభాలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) డేగ కన్ను వేసింది. సంక్షేమ పథకాల పేరుతో ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న పోస్టు డేటెడ్ చెక్కులపై ఆరా తీస్తోంది. సరిగ్గా ఎన్నికల ముందు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే విధంగా జారీ చేసిన చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించడా నికి సునీల్ అరోరా రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఓటును తొలగించాలంటూ ప్రజలు దరఖాస్తు చేయకపోయినా ఇష్టారాజ్యంగా వారి ఓటును తొలగిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తున్నప్పుడు లబ్ధిదారులతో కొందరు వ్యక్తులు ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకుంటున్నామని అన్నారు. సునీల్ అరోరా ఇంకా ఏం చెప్పారంటే...
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో తప్పులపై వివిధ రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తాం. బోగస్ ఓట్లు, దొంగ ఓట్లపై ఫిర్యాదులు అందుతున్నాయి. రెండు మూడు రోజుల్లోనే మచ్చుకు కొన్ని ఓట్లపై ఆడిట్ చేస్తాం. చాలామంది యువ ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు కాలేదని ఫిర్యాదులు వచ్చాయి. నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకూ కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొంతమంది సర్వేల పేరిట, కులాల పేరిట ఓట్లు తొలగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సూచించాం. కొత్త ఓటర్ల నమోదు కోసం నియమించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఓటర్ నమోదు పాస్‌వర్డ్ ఇస్తున్నాం. ఇది దుర్వినియోగం అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్లా ఓటర్లుగా ఉన్నవారిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం.
బదిలీలు, పదోన్నతులపై ఫిర్యాదులు
ఎన్నికల ముందు బదిలీలు, ప్రమోషన్లపై.. ముఖ్యంగా పోలీసు శాఖపై చాలా ఫిర్యాదులు అందాయి. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేని బదిలీలు, పదోన్నతులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుత రాష్ట్ర డీజీపీ అధికార పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నారంటూ దీనికి ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం కేసును ఉదాహరణగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు ఎన్‌ఐఏ పరిధిలో ఉంది. ఇవికాకుండా డీజీపీపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఏమైనా వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడితే ఎంతటి ఉన్నతాధికారి అయినా ఉపేక్షించే ప్రసక్తే లేదు.
ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తాం..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై(ఈవీఎం) అనుమానాలు వ్యక్తం చేయడం అర్థరహితం. 2014 తర్వాత ఎన్నికలు జరిగిన పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కాకుండా వేరే పార్టీలు గెలిచాయి. ఈవీఎంల్లో అవకతవకలు లేవనడానికి ఇదే నిదర్శనం. వచ్చే ఎన్నికలను ఈవీఎంలతోనే నిర్వహిస్తాం. రాష్ట్రంలో తొలిసారిగా శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలను వీవీ ప్యాట్‌లతో నిర్వహించబోతున్నాం. వచ్చే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టడానికి ఆదాయపు పన్ను(ఐటీ), వాణిజ్య శాఖలతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాం. గత ఎన్నికల్లో కేసులు నమోదైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను ఆదేశించాం. పత్రికల్లో వచ్చే చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిన బదిలీలకు ఫిబ్రవరి 20వ తేదీ వరకు గడువు ఇస్తున్నాం.
ఫిర్యాదులపై వంద నిమిషాల్లో చర్యలు
గతంలో జరిగిన కర్ణాటకతోపాటు ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగించడం వల్ల సత్ఫలితాలు వచ్చాయి. సి–విజిల్ యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఈ ఫిర్యాదులపై వంద నిమిషాల్లో చర్యలు తీసుకుంటాం. వచ్చిన ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరించడానికి సమాధాన్ యాప్.. నామినేషన్లు, అనుమతులు, ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలను తెలుసుకోవడానికి న్యూసువిధ యాప్‌ను తీసుకొచ్చాం. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు, యాప్‌లపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తాం’’ అని సీఈసీ సునీల్ అరోరా వెల్లడించారు. ఈ సమావేశంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా, సుదీప్ జైన్, ఎన్నికల కమిషనర్ అశోక్ లావాస్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment