బొబ్బిలి, న్యూస్‌లైన్: పిల్లలు ఆడుకునేందుకు అవకాశం కల్పించమంటే ‘మాకేటి’ అని చేయి జాపుతున్నారు. ప్లాన్‌కు ఆమోద ముద్ర వేయాలంటే ఒక నెల అద్దె సొమ్ము ఆమ్యామ్యాగా ఇమ్మంటున్నారు. కొలతలు తీయాలంటే రూ. ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకూ అవుతుందని బేరమాడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా పిల్లలు, అంగన్‌వాడీ కార్యకర్తలు అవస్థలు పడవలసి వస్తోంది.
పట్టణాల్లో ఉండే అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ కల్పించాలని, పిల్లలకు ఆటపాటలు నేర్పాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం విధివిధానాలను ప్రకటించింది. మారిన నిబంధనల ప్రకారం రెండు పూటలా కేంద్రాన్ని నిర్వహిస్తూ పిల్లలకు ఆటపాటలు నేర్పాలి. మరుగుదొడ్లు వంటి సదుపాయాలున్న ఇళ్లను అద్దెకు తీసుకుని అందులో కేంద్రాలను నిర్వహించాలి. ఇది అమలులోకి వస్తే... ఇంతవరకూ ఇరుకు గదుల్లో, ఎటువంటి సదుపాయాలూ లేని ఇళ్లలో మగ్గిపోతున్న పిల్లలకు కొంత సౌకర్యంగా ఉంటుంది. ఈ నింబంధనలు ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని విజయనగరం పురపాలక సంఘంలో 127 అంగన్‌వాడీ కేంద్రాలు, బొబ్బిలి మున్సిపాలిటీలో 104 కేంద్రాలు, పార్వతీపురం మున్సిపాలిటీలో 55 కేంద్రాలు, సాలూరు పురపాలక సంఘంలో 102 కేంద్రాలున్నాయి. వీటిని చిన్న చిన్న ఇళ్లల్లో నిర్వహిస్తున్నారు. వీటికి ప్రస్తుతం రూ 750 ఇంటి అద్దెగా చెల్లిస్తున్నారు. అయితే పై సదుపాయాలుంటే మూడు వేల రూపాయలు అద్దె ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్‌అండ్‌బీ అధికారులు కొలతలు తీసి, ఆమోద ముద్ర వేస్తేనే అద్దె నిర్ణయించి మంజూరు చేయడానికి, కొత్త భవనాల్లోకి కేంద్రాలను మార్చడానికి వీలవుతుంది.
దీని కోసం కొంతమంది అధికారులు... అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అద్దెకు తీసుకున్న ఇళ్లకు సంబంధించిన ప్లాన్‌లు వేయడానికి, వాటిని ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి సొమ్ము డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. దీని కోసం ఇప్పటికే ప్రైవేటుగా ప్లాన్‌లు గీసేవారితో ఆర్‌అండ్‌బీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్లానులు గీయడానికి ఒక్కొక్క కేంద్రానికి ఏడు వందల రూపాయల నుంచి వేయి రూపాయలు, ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి ఒకనెల అద్దె చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇస్తామన్నా.. ఆర్‌అండ్‌బీ అధికారులు లెక్కల ప్రకారమైతే ఎంత పెద్ద ఇల్లు అయినా రూ 15 వందల నుంచి రూ 2 వేలు దాటి అద్దె నిర్ణయించే పరిస్థితి లేకపోవడం, బయట అద్దెలు అంతకు రెండింతలు ఉండడంతో ఏమి చేయాలో అంగన్‌వాడీ కార్యకర్తలకు పాలుపోవడం లేదు.
ఇప్పటికే ఐసీడీఎస్ అధికారులు ఒత్తిడితో ఇళ్లను అద్దెకు తీసుకున్న వారు సొంతంగాఅద్దె డబ్బులు చెల్లించుకొనే పరిస్థితి దాపురించింది. అదీ కాక ప్లానులు గీస్తామంటే ఎవరూ ఇళ్లను అద్దెకు ఇవ్వడం లేదు. కొత్త అద్దెలు రావాలంటే కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయి ఇంటి ప్లానులు జత చేయాలని ఆంక్షలు ఉండడం కార్యకర్తలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. పిల్లలు ఆడుకోవడానికి మైదానం ఉండాలని అధికారులు చెబుతుంటే, ఇళ్ల ముందు ఉండే ఖాళీ జాగాలను లెక్కల్లోకి తీసుకోకుండా కొలతలు వేస్తుండడంపై కూడా కార్యకర్తలు మండిపడుతున్నారు.