పేలిన సెల్‌ఫోన్‌లో పూర్తిగా కాలిపోయిన బ్యాటరీ, సెల్‌ఫోన్
వీరఘట్టం విజయనగరం : అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు నమోదు చేసేందుకు ప్రభుత్వం అందించిన స్మార్ట్‌ఫోన్ పేలిపోయింది. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో సోమవారం ఈ ఘటన జరిగింది. దీంతో భయభ్రాంతులకు గురైన అంగన్‌వాడీ కార్యకర్తలు ఉరుకులు పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐసీడీఎస్ కార్యాలయంలో సమావేశం ఉండటంతో అంగన్‌వాడీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.
సూపర్ వైజర్ రాకపోవడంతో చేబియ్యంవలస అంగన్‌వాడీ కార్యకర్త ఎం.వెంకటమ్మ ప్రభుత్వం అందించిన స్మార్ట్‌ఫోన్‌లో అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సమయంలో ఫోన్ ఒక్కసారిగా వేడెక్కి పొగలు రావడంతో వెంటనే విసిరేశారు. తర్వాత పెద్ద శబ్దంతో ఫోన్ పేలిపోయిందని ఆమె తెలిపారు. దూరంగా విసిరేయడంతో ప్రమాదం తప్పిందని వివరించారు.
ఆరు నెలల కిందట వీరఘట్టం ప్రాజెక్టు పరిధిలోని 143మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం కార్బన్ స్మార్ట్‌ఫోన్లను అందజేసింది. వీటిలో అంగన్‌వాడీ కేంద్రాల సమాచారం, కేంద్రాల పరిధిలో ఉన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల వివరాలతో పాటు కేంద్రంలో ఉన్న స్టాకు వివరాలు మొబైల్‌లో నమోదు చేయాలి.
ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల ఈ ఫోన్లు చార్జింగ్ పెట్టేటప్పుడు పేలిపోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరో సంఘటన జరగడంతో ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లు ఉపయోగించేందుకు మిగిలిన అంగన్‌వాడీ కార్యకర్తలు భయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment