జిల్లా అధికారులకు వినతి చేసేందుకు కలెక్టరేట్‌కు విచ్చేసిన లింక్ సూపర్‌వైజర్లు
చిన్నారుల ఆలనా.. పాలనా చూసే అంగన్‌వాడీ కేంద్రాల సక్రమ నిర్వహణను పర్యవేక్షించే లింక్ సూపర్‌వైజర్లను ప్రభుత్వం ఇంటికి పంపింది. బాబు వస్తే జాబు వస్తుందని.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ తీరా గద్దెనెక్కాక ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడంతో వారు నిశ్చేష్టులయ్యారు. ఇకపై తమ జీవనం సాగెదెలా అని మదనపడ్డారు. తమ బాధలు చెప్పుకోవడానికి కలెక్టరేట్‌కు తరలివచ్చారు.
చిత్తూరురూరల్: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడిచే అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించే లింక్ సూపర్‌వైజర్లను తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు గురువారం జిల్లా అధికారులను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు.
జిల్లాలోని ఐసీడీఎస్ పరిధిలో 21 ప్రాజెక్టుల కింద మొత్తం 4, 768 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు 3,640, మినీ కేంద్రాలుగా 1,128 నడుస్తున్నాయి. ఈ కేంద్రాల్లో 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 1,23,517 మంది, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు 72,087 మంది వరకు లబ్ధి పొందుతున్నారు. అలాగే బాలింతలు, గర్భిణులు 42,763 మంది అంగన్‌వాడీల ద్వారా అమలయ్యే పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, కార్యకలపాలు, పథకాలు సక్రమంగా అమలువుతున్నాయా..లేదా పర్యవేక్షించడానికి ప్రాజెక్టుల వారీగా సూపర్‌వైజర్లు అవసరం.
అయితే జిల్లా వ్యాప్తంగా 75 సూపర్‌వైజర్ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోలేదు. సిబ్బంది కొరత కారణంగా కేంద్రం నిర్వహణలో లోపాలు అధికమయ్యాయి. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం లింక్ సూపర్‌వైజర్ల పోస్టులకు ఆహ్వానం పలికింది. ఈ బాధ్యతలను అంగన్‌వాడీ కార్యకర్తలకు అప్పగిస్తేనే సమస్యలను సత్వరం పరిష్కరించగలమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు 2017 ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేస్తూ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకు డిగ్రీ విద్యార్హత కలిగివుండి, పదేళ్లు కార్యకర్తగా పనిచేసిన వారు అర్హులుగా పేర్కొంది. ఈ పోస్టుకు పోటీలు పడి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి 60 మందిని లింక్ సూపర్ వైజర్లుగా భర్తీ చేసుకున్నారు.
వెట్టి చాకిరీ..
లింక్ సూపర్ వైజర్లు అంగన్‌వాడీ నిర్వహణతో పాటు సూచించిన ప్రాజెక్టుల్లో నిత్యం పర్యవేక్షించాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం రూ.2,500 అదనపు వేతనంగా నిర్ణయించింది. దీంతో పాటు ఫిక్స్‌డ్ ట్రావెలింగ్ అలవెన్స్(ఎఫ్‌టీఏ), డీఏలు కూడా అందిస్తామని ప్రకటించింది. అయితే ఏడాదికి గాను ఇంత వరకు లింక్ సూపర్‌వైజర్లకు ఒక్క పైసా ఇవ్వలేదు. నిత్యం అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించేందుకు సూపర్ వైజర్లే ఖర్చు మొత్తం భరించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన ఆన్‌లైన్ పనులను పూర్తి చేసి, అపై సూపర్‌వైజర్ వృత్తిని కొనసాగిస్తూ వచ్చారు. ఈ వృత్తిలో కొనసాగితే భవిష్యత్‌లో పై పోస్టులకు ప్రాధాన్యత ఉంటుందని భావించి పని ఒత్తిడి ఉన్నా చేస్తూ వచ్చారు.
తొలగింపు ఉత్తర్వులు..
లింక్ సూపర్ వైజర్లను అర్ధాంతరంగా తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడంపై వారు భగ్గుమంటున్నారు. కనీసం ఏడాది పాటుగా విధులు నిర్వహించినందుకు అదనపు వేతనం ఇవ్వకుండానే తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కనీసం టీఏ, డీఏలు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు 60 మంది సూపర్‌వైజర్లు గురువారం సాయంత్రం జిల్లా అధికారులను కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇవ్వాల్సిన అదనపు బకాయిలను వెంటనే చెల్లించాలని, రెగ్యులర్ సూపర్‌వైజర్ల పోస్టుల భర్తీలో వయస్సు సడలింపునకు మొదటి ప్రాధన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment