ఘోరం: చితి పేర్చుకుని రైతు సజీవదహనం | Telangana: Vemulaghat Farmer Ends Life In Self Made Pyre | Sakshi
Sakshi News home page

ఘోరం: చితి పేర్చుకుని రైతు సజీవదహనం

Published Sat, Jun 19 2021 3:22 AM | Last Updated on Sat, Jun 19 2021 3:26 AM

Telangana: Vemulaghat Farmer Ends Life In Self Made Pyre - Sakshi

రైతు సజీవదహనమైన ఇల్లు

దుబ్బాకటౌన్‌ / తొగుట (దుబ్బాక): ఏళ్లుగా ఉన్న ఊరిని, సొంత ఇంటిని విడిచి పోతున్నానని తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా భావిస్తున్న ఓ రైతు.. కూల్చివేసిన తన ఇంట్లోనే చితిలో సజీవ దహనమై 
కన్పించాడు. ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం వేములఘాట్‌లో చోటుచేసుకుంది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద ఇల్లు కేటాయించలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తుండగా.. అధికారులు మాత్రం ఆయనకు భూమి, ఇల్లుకు సంబంధించిన నష్టపరిహారంతో పాటు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి సంబంధించిన చెక్కులను కూడా అందజేసినట్లు చెప్పారు.


రెండు నెలలుగా అద్దె ఇంట్లో.. 
తొగుట ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు .. వేములఘాట్‌ గ్రామానికి చెందిన తూటుకూరి మల్లారెడ్డి (70) రైతు. అతని భార్య అమృతమ్మ కొన్ని నెలల క్రితం చనిపోయింది. మల్లారెడ్డికి వివాహాలైన ముగ్గురు కుమార్తెలు ఉండగా.. ఇల్లరికం ఉన్న పెద్ద అల్లుడు భగవాన్‌రెడ్డి, కుమార్తె కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించారు. వీరికి ఉన్న ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు మల్లారెడ్డితోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి మనవరాళ్లకు సైతం వివాహం జరిపించి అత్తగారింటికి పంపించాడు. అయితే 50 టీఎంసీలతో మల్లన్న సాగర్‌ నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం.. ముంపు గ్రామమైన వేములఘాట్‌ను ఖాళీ చేయించే పనికి పూనుకుంది. దీంతో మల్లారెడ్డి కూడా మిగతా గ్రామస్తుల మాదిరిగానే తనకున్న వ్యవసాయ భూమిని, ఇంటిని అప్పగించాడు. సాగర్‌ నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకోవడంతో అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అధికారులు మల్లారెడ్డి ఇంటిని కూల్చివేశారు. దీంతో రెండు నెలల క్రితం చిన్న కూతురు భాగ్యలక్ష్మి, అల్లుడితో కలిసి గజ్వేల్‌ మండలం పిడిచెడ్‌ గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.

ఇల్లు చూసి వస్తానని చెప్పి.. 
ఈ నేపథ్యంలోనే.. కూల్చిన ఇల్లు పరిస్థితి ఏ విధంగా ఉందో చూసి వస్తానని కుమార్తెతో చెప్పిన మల్లారెడ్డి పిడిచెడ్‌ నుంచి గురువారం మధ్యాహ్నం వేములఘాట్‌ చేరుకున్నాడు. రాత్రి 9.30 వరకు చుట్టు పక్కల ఇళ్ల వారితో మాట్లాడాడు. రాత్రి 10.00 గంటలకు కుమార్తె ఫోన్‌ చేస్తే.. మోకాళ్లు నొప్పిగా ఉన్నాయి, ఉదయం అల్లుడిని పంపిస్తే బైక్‌పై వస్తానని చెప్పాడు. అర్ధరాత్రి చుట్టుపక్కల వారు నిద్రపోయాక కూల్చివేసిన తన ఇంట్లోనే కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కూతురు ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. దీంతో ఆమె చుట్టు పక్కల వారికి ఫోన్‌ చేసింది. వారు వెళ్లి చూడగా కట్టెల్లో కాలిపోయి కన్పించాడు. దీనిపై మల్లారెడ్డి మనవడు తిరుపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొగుట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట ఆర్డీఓ అనంతరెడ్డి మాట్లాడుతూ పుట్టి పెరిగిన గ్రామం నుంచి, ఇంటి నుంచి వెళ్లిపోతున్నాననే మనస్తాపంతో మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తెలిపారు. పోలీసులు కూడా ఈ మేరకు కేసు నమోదు చేశారు.

ఇల్లు కేటాయించలేదని..!
అయితే పరిహారం కింద మల్లారెడ్డికి గజ్వేల్‌ శివారులో నిర్మించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో అధికారులు ఇల్లు కేటాయించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇల్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో పాటు సర్పంచ్‌ను మల్లారెడ్డి పలుమార్లు వేడుకున్నా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం అధికారులు ఇళ్ల కోసం తయారు చేసిన లిస్టులో 715 నంబర్‌గా మల్లారెడ్డి పేరు ఉన్నప్పటికీ ఇల్లు మాత్రం కేటాయించలేదని తెలిపారు. తనకు ఇల్లు లేకుండా పోయిందనే మనస్తాపంతోనే కట్టెలతో చితిని పేర్చుకొని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు.

  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement