సమావేశంలో మాట్లాడుతున్న జయరాజ్
- నిర్వాసితుల పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ జయరాజ్
తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన వేములఘాట్‌లో 144 సెక‌్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని భూనిర్వాసితుల పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ జయరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామంలో 144 సెక‌్షన్ విధించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు.
రైతులు 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా భూములిస్తామన్నా ప్రభుత్వం 123 జీఓ కింద భూములు తీసుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం పేద రైతుల నుంచి దౌర్జన్యంగా భూములు లాక్కోవడం తగదన్నారు. హైకోర్టును ఆశ్రయించిన రైతులను రెవెన్యూ అధికారులు భూములివ్వాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు.
123 జీఓతో భూసేకరణ మూలంగా రెండు వేల కోట్లు రైతులు నష్టపోయారన్నారు. రైతుల కోరిన విధంగా భూసేకరణ చేపడతామన్న కలెక్టర్ హమీని రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టు పేరుతో నిరుపేదలను రోడ్డు పాలుచేయడం అన్యాయమన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జయరాజ్ తెలిపారు. సమావేశంలో సిఐటీయూ జిల్లా నాయకులు గోపాలస్వామి, వేములఘాట్ రైతులు మల్లారెడ్డి, అంజగౌడ్, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.