కంకర తేలిన కాన్గల్ రోడ్డు
తొగుట: మండలంలోని కాన్గల్, గుడికందుల గ్రామాల మధ్య నిర్మించిన రోడ్డు అధ్వానంగా తయారైంది. సుమారు మూడు కిలోమీటర్లు రోడ్డుపై కంకర తేలి ప్రజలు నడవలేని పరిస్థితి నెలకొంది. రోడ్డుపై వాహనాలు నడుపడానికి వాహనదారులు జంకుతున్నారు. నిత్యం గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ బావుల వద్దకు ఈ రోడ్డు ద్వారానే వెళుతుంటారు. కాగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి బురదగా మారి ప్రజలు నడవలేని పరిస్థి నెలకొంది.
మరోదారి లేకపోవడంతో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో బావి పనుల కోసం వెళ్లి వస్తున్న క్రమంలో జారీ బురదలో పడిపోతున్నారు. ద్విచక్ర వాహనదారులు సైతం ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా కాన్గల్ గ్రామ ప్రజలు తమ అవసరాల కోసం ఈ రోడ్డుపైన సిద్దిపేటకు వెళుతుటారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.