ఎవరో చేసిన తప్పుకి.. తనను తాను శిక్షించుకోవటం! | Dr N Anantalakshmi's Suggestions And Precautions On Reducing Anger | Sakshi
Sakshi News home page

తన కోపమె.. తన శత్రువు!

Published Mon, Aug 5 2024 8:00 AM | Last Updated on Mon, Aug 5 2024 8:00 AM

Dr N Anantalakshmi's Suggestions And Precautions On Reducing Anger

మంచి మాట

కోపం తెచ్చుకోవటం అంటే ఎవరో చేసిన తప్పుకి తనను తాను శిక్షించుకోవటం అని ఒక ఆంగ్ల సామెత ఉంది. దీనికి సమానార్థకంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది. ‘‘ఏ కట్టెకి నిప్పు ఉంటే ఆ కట్టే కాలుతుంది’’ అని. ఆలోచిస్తే రెండు ఎంత నిజమో కదా అనిపించక తప్పదు. సుమతీ శతకకారుడు కూడా అదే విషయాన్ని నిర్ధారించాడు – ‘‘తన కోపమె తన శత్రువు’’ అని. గొప్ప గొప్ప శాస్త్రీయమైన సత్యాలని సామాన్యమైన మాటల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటం అన్ని సమాజాలలో ఉన్న పెద్దలు చేసిన పని. వారికి రాబోయే తరాల మీద ఉన్న ప్రేమకి అది నిదర్శనం. గమనించండి! కోపం తెప్పించిన వారిని కానీ, పరిస్థితులని కానీ ఎవరైనా మార్చ గలరా? కోపానికి కారణమైన వారు బాగానే ఉంటారు. సమస్య కోపం తెచ్చుకున్న వారిదే.

ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది? తనని ఎవరయినా తప్పు పట్టినా, నిందించినా, దెబ్బకొట్టినా (శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా, సామాజికంగా), తాను అనుకున్నది సాధించలేక పోయినా ఇలా ఎన్నో కారణాలు. ఒక్క క్షణం ఆలోచించండి! వీటిలో ఏ ఒక్కటి అయినా మన అధీనంలో ఉన్నదా? లేనప్పుడు అనవసరంగా ఆయాస పడటం ఎందుకు? కోపపడి, ఆవేశ పడితే ఎడ్రినల్‌  అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. దానివల్ల ముందుగా శరీరంలో ఉన్న శక్తి అంతా ఖర్చు అయిపోతుంది.

కోపంతో ఊగిపోయినవారు తగ్గగానే నీరసపడటం గమనించ వచ్చు. ఇది పైకి కనపడినా లోపల జరిగేది జీవప్రక్రియ అస్తవ్యస్తం కావటం. దానికి సూచనగా కళ్ళు ఎర్ర బడతాయి. కాళ్ళు చేతులు వణుకుతాయి, మాట తడబడుతుంది. ఆయాసం వస్తుంది. రక్త ప్రసరణలో మార్పు తెలుస్తూనే ఉంటుంది. పరీక్ష చేసి చూస్తే రక్త పోటు విపరీతంగా పెరిగి ఉంటుంది. ఇది తరచుగా జరిగితే ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తక తప్పదు. కోపం తెప్పించిన వారు మాత్రం హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కోపాన్ని వ్యక్త పరిస్తే వచ్చే వాటిలో ఇవి కొన్ని. లోపలే అణుచుకుంటే వచ్చేవి మరెన్నో! ఎసిడిటీ, విరేచనాలు, మలబద్ధకం నుండి మధుమేహం, గుండె పోటు వరకు.

తాను చేయని తప్పుకి ఈ శిక్ష ఎందుకు? మరేం చేయాలి? ఆలోచించి, కోపకారణాన్ని తెలుసుకోవాలి. మనని ఎవరైనా తప్పు పడితే – అది నిజంగా తప్పా? కాదా? అని తెలుసుకోవాలి. తప్పు అయితే సరిదిద్దుకోవాలి. (ఎత్తి చూపినవారికి మనసులోనైనా కృతజ్ఞతలు తెలుపుకుంటూ) తప్పు కాకపోతే, మనకి అనవసరం. అనుకున్నది సాధించ లేక తన మీద తనకే కోపం వస్తే, చేయలేక పోవటానికి ఉన్న కారణాలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఈ రకమైన విశ్లేషణ చేయటానికి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం అవసరం. అందుకే అంటారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకో కూడదు అని.

మానవ మాత్రులం కనక కోపం రావటం సహజం. కానీ దానిని అదుపులో ఉంచుకుని, దానినే ఆయుధంగా ఉపయోగించుకుంటే అదే ఉపకరణంగా మారి లక్ష్యసాధనకి సహకరిస్తుంది. శ్రీరామచంద్రుడు కోపాన్ని అదుపులో ఉంచుకున్నాడు. అది ఆయన చెప్పు చేతల్లో ఉంది. రమ్మంటే వస్తుంది. ΄÷మ్మంటే పోతుంది. అందుకే ఆయనని ‘జితక్రోధుడు’ అన్నాడు వాల్మీకి. అవసరానికి కోపం వచ్చినట్టు కనపడాలి. దాని ప్రయోజనం దానికీ ఉంది.

పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లి కేకలు వేస్తుంది. అమ్మకి కోపం వచ్చింది అనుకుంటారు. నిజానికి అది కోపమా? ఇంతలో అత్తగారో, భర్తో పిలిస్తే మామూలుగానే మాట్లాడుతుంది. అమ్మవారి చేతిలో క్రోధము అనే అంకుశం ఉంది అని లలితారహస్యనామసాహస్రంలో ఉంది. అంటే తన అశక్తత మీద కోపం తెచ్చుకుని అనుకున్నది సాధించాలి అని అర్థం. ఇది కోపాన్ని ఆయుధంగా వాడటం. శత్రువుని సాధనంగా మలచుకుని ముల్లుని ముల్లుతోనే తీయటం. – డా.ఎన్‌. అనంతలక్ష్మి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement