మల్లన్నసాగర్ టెండర్లపై స్టేకు హైకోర్టు నో
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మల్లన్నసాగర్ రిజర్వా యర్ పనుల టెండర్ ప్రక్రియను నిలిపేసేం దుకు ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిం ది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు గురువారం ఉత్తర్వులిచ్చారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రాకుం డానే ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇది చట్ట విరుద్ధమంటూ వేముల ఘాట్‌కు చెందిన జి.లక్ష్మి, మరో ఐదుగురు హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి మరోసారి విచారణ జరిపారు.
ఈ సందర్భం గా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, కాళేశ్వరం భారీ ప్రాజెక్టని, దీని కోసం 17వేల ఎకరాల భూమిని సేకరిస్తున్నామన్నారు. పిటిషనర్లది చిన్న చిన్న పరిమాణంలో ఉన్న భూమి మాత్రమేనని, విస్తృత ప్రజా ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును పిటిషనర్లు అడ్డుకోవాలని చూస్తున్నారని తెలిపారు. పిటిషనర్లకు కావా ల్సింది పరిహారమని, ఈ విషయంలో చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరిస్తామని చెప్పారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది సీహెచ్ రవికుమార్ స్పందిస్తూ... పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేప ట్టడం చట్ట విరుద్ధమన్నారు. తాము కూడా విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టు కునే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశామన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, ఐదారుగురి కోసం ఇంత భారీ ప్రాజెక్టును ఆపడం సరికాదన్నారు. ప్రాజెక్టు పనులపై స్టే ఇవ్వడం సాధ్యం కాదంటూ, ఈ వ్యవహా రంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే పిటిషనర్లను వారి భూముల నుంచి ఖాళీ చేయించవద్దని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.