
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు పెంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. రిజర్వాయర్ సామర్థ్యం పెంపు సమంజసమా? కాదా? అన్నది నిపుణుల పరిధిలోని అంశమని తెలిపింది. ఈ అంశాలపై న్యాయ సమీక్ష చేయడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రాజెక్టు ఎక్కడ కట్టాలి.. ఎలా కట్టాలి.. ఎంత విస్తీర్ణంలో కట్టాలి.. ఎంత సామర్థ్యంతో కట్టాలి.. తదితర అంశాలన్నీ సాంకేతికపరమైనవని పేర్కొంది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యం పెంపును సవాల్ చేస్తూ విశ్రాంత ఇంజనీర్ దొంతు లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.రామారావు వాదనలు వినిపిస్తూ, రిజర్వాయర్ సామర్థ్యం పెం పు అవసరం లేదన్నారు. 50 టీఎంసీ మేర నీరు లభ్యత సాధ్యం కాదని వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఈ విషయాలను తేల్చేందుకు తాము నిపుణులం కాదని స్పష్టం చేసింది. అయినా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లు అనిపిస్తోందని, రాజకీయ క్రీడలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకునేందు కు తాము ఎంత మాత్రం అంగీకరించబోమని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment