
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం వెయ్యి ఎకరాల ఆలయ భూముల సేకరణను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. దేవాదాయ శాఖ భూములను సాగునీటి ప్రాజెక్టుల కోసమే సేకరించాలని గతంలోనే ద్విసభ్య ధర్మాసనం చెప్పిందని, ఇతర అవసరాల కోసం కాదని స్పష్టంచేసింది. భూ సేకరణ, రెవెన్యూ అధికారులకు సంబంధించిన అంశంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల సంస్థ (టీఎస్‌ఐఐసీ) పిటిషన్ ఎలా దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సిన దేవాదాయ భూ సేకరణపై సింగిల్ జడ్జిని ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది.
రంగారెడ్డి జిల్లా నందివనపర్తి, సింగారంలో ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూ సేకరణపై యథాతథస్థితి విధించింది. నీటి ప్రాజెక్టులకు కాకుండా ఇతర ప్రజావసరాలకు ఆలయ భూములు సేకరించవచ్చన్న నిబంధనలు ఏవైనా ఉంటే.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్‌ఐఐసీ ఎండీ, రెవెన్యూ–దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ ఈవోకు నోటీసులు జారీ చేసింది.
తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు భూ సేకరణపై ముందుకెళ్లరాదని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. దేవాదాయ భూముల సేకరణకు హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో నందివనపర్తి, సింగారం పరిధిలోని ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూముల సేకరణ కోసం టీఎస్‌ఐఐసీ గత నవంబర్‌లో హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. భూ సేకరణకు అనుమతి ఇస్తూ అదే నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. భూ సేకరణ చట్ట ప్రకారం భూమిని సేకరించాలని, ఆ వచ్చిన మొత్తం నగదును ఓంకారేశ్వర స్వామి ఆలయ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. సదరు మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని సింగిల్ జడ్జి చెప్పారు.
ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన భక్తులు మోతెకాని జంగయ్య, కుర్మిడ్డకు చెందిన దేవోజీ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆలయ భూముల సేకరణకు ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి అని.. సింగిల్ జడ్జిని ఆశ్రయించి ఉత్తర్వులు పొందడం చెల్లదన్నారు.
తాగు, సాగు నీటి ప్రాజెక్టులకు మాత్రమే ఆలయ భూములు సేకరించాలని గతంలో డివిజన్ బెంచ్ పేర్కొందన్నారు. భూసేకరణతో ఎలాంటి సంబంధం లేని టీఎస్‌ఐఐసీ పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఆపాలని కోరారు.
ఇతర అవసరాలకు సేకరించవచ్చు...
ఇతర ప్రజావసరాలకు కూడా దేవాదాయ భూములను సేకరించవచ్చని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో దీనికి సంబంధించి పలు తీర్పులు కూడా ఉన్నాయన్నారు. అయితే వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని కోరారు. భూములు ఇచ్చేందుకు ఓంకారేశ్వర ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అంగీకరించాయని చెప్పారు. ఇందులో ఇతరులకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment