సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ, రెవెన్యూ శాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లకు చెందిన భూమి సేకరణ విషయంలో ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని 2009లో అటవీ శాఖ, రెవెన్యూ అధికారులను ఆదేశించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే ఆదేశాలను ఉల్లంఘించారంటూ అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.శోభ, రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ సునీత ఎం.భగవత్, డీఎఫ్‌వో జానకీరామ్, అడిషనల్ కలెక్టర్ ఎస్.తిరుపతిరావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎ.శాంతకుమారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డి.అమోయ్‌కుమార్‌కు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధించింది. రూ.2 వేల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్ ఇటీవల తీర్పునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సర్వే నంబర్ 222/1 నుంచి 222/20లో మహ్మద్ సిరాజుద్దీన్ తదితరులకు 383 ఎకరాల భూమి ఉంది. అటవీ అధికారులు ఈ భూమిని రిజర్వు ఫారెస్టుగా మార్చాలని నిర్ణయించి సేకరించాలని భావించారు. అయితే ఈ భూమిని రిజర్వు ఫారెస్టుగా మార్చడం సాధ్యం కాదంటూ అటవీశాఖ సెటిల్‌మెంట్ ఆఫీసర్ 2008లో కలెక్టర్‌కు లేఖ రాశారు. అటవీ శాఖ అధికారుల నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సిరాజుద్దీన్ తదితరులు హైకోర్టును ఆశ్రయించగా, ఈ భూమిసేకరణ ప్రక్రియపై ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని 2009లో అటవీ, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆరేళ్లయినా అటవీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా ఆ భూమిని తమకు అప్పగించకపోవడాన్ని సవాల్‌చేస్తూ సిరాజుద్దీన్ తదితరులు 2015లో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment