భూ నిర్వాసితుల దండయాత్ర
ఆర్టీపీపీ ముట్టడి
ఎర్రగుంట్ల:
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ) ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలమైన ఆర్టీపీపీ యాజమాన్యం వైఖరిని తప్పుబడుతూ భూ నిర్వాసితులు శుక్రవారం దండయాత్ర చేశారు. ఇక్కడి 600 మెగావాట్ల ప్రాజెక్ట్ గేట్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు, ఎస్‌పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఒక దశలో తోపులాట జరగడంతో ఏం జరుగుతోందోనని అందరూ ఆందోళనకు గురయ్యారు.
న్యాయం చేయమంటే కేసులా?
ఆర్టీపీపీలో 600 మెగావాట్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన భూములను ఇచ్చినందుకు ప్రతిఫలంతో పాటు నిర్వాసిత కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇస్తామని గతంలో ఒప్పందం చేసుకున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరితే కేసులు పెడతామంటూ యాజమాన్యం బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ గేటు తాళాలు వేసి లోపలికి ఎవరూ పోకుండా అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు, ఎస్‌పీఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన ఆర్టీపీపీ సీఈ కుమారుబాబు ఎస్‌ఈ శేషారెడ్డిని ఆందోళనకారుల వద్దకు చర్చల కోసం పంపారు. ఆయన సుధీర్‌రెడ్డి సమక్షంలో రైతులతో చర్చించారు. రైతుల డిమాండ్ల పరిష్కారం విషయంలో ఏపీ జెన్‌కో సానుకూలంగా ఉందన్నారు. ఏపీ జెన్‌కో డెరైక్టర్ వచ్చి రైతులతో మాట్లాడుతారని హామీ ఇచ్చారు.
దీంతో వారు ఆందోళనను విరమించారు. కలమల్ల గ్రామ సర్పంచ్ నారాయణ, మాజీ సర్పంచ్ పద్మనాభయ్య, ఎమ్మర్పీఎస్ నాయకుడు వెంకటేశ్, వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు గుగ్గల మహేశ్వరరెడ్డి, పులి సుధాక ర్‌రెడ్డి, బీఎంఎస్ నాయకుడు గంగయ్య, ఏఐటీయూసీ నాయకులు పొన్న శివయ్య, సీఐటీయూ నాయకులు రామ్మోహన్, ఎంపీటీసీ సభ్యులు ప్రతాప్, ఎస్.ముస్తాఫ్, 1104 యూనియన్ నాయకుడు మల్లేశ్వరరెడ్డి పాల్గొన్నారు.