ఉవ్వెత్తున వెలుగులు | Power Generation At Full Capacity In RTPP | Sakshi
Sakshi News home page

ఉవ్వెత్తున వెలుగులు

Published Thu, Feb 9 2023 4:10 PM | Last Updated on Thu, Feb 9 2023 4:28 PM

 Power Generation At Full Capacity In RTPP - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) వెలుగులు నింపుతోంది. ప్రధానంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు లోఓల్డేజీ సమస్యలను కట్టడి చేస్తోంది. విద్యుత్‌ కోతలకు ఆస్కారం లేకుండా ఆరు యూనిట్లు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. 1650 మెగావాట్లు సామర్థ్యానికి గాను 1450 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు. ఏడాదికి పైగా ఇంతటి సామర్థ్యంలో విద్యుత్‌ ఉత్పత్తి తీయలేదని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తి లభిస్తోంది.  ఒక్కో  యూనిట్‌ 210 మెగావాట్లు సామర్థ్యంతో 5 యూనిట్లు ఆర్టీపీపీలో నెలకొల్పారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒకటి, రెండవ యూనిట్లు నోచుకోగా, 3, 4, 5, 6 యూనిట్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూపుదిద్దుకున్నాయి. 6వ యూనిట్‌ 600 మెగావాట్లు సామర్థ్యంతో నెలకొల్పడంతో మొత్తంగా 1650 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తికి ఆస్కారం ఏర్పడింది. కాగా 2014–19 టీడీపీ సర్కార్‌ హయాంలో తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడింది. ఆశించిన మేరకు విద్యుత్‌ ఉత్పాదన నోచుకోలేదు. ముందుచూపు లేకపోవడంతో టీడీపీ హయాంలో తరచూ బొగ్గు కొరత ఉత్పన్నమైందని కార్మికులు వివరిస్తున్నారు. కాగా ఏడాదిగా ఈ స్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి చేయడం ప్రస్తుత ఉత్పత్తే అరుదు అని యంత్రాంగం వివరిస్తోంది.  

దినదినాభివృద్ధి.... 
రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు దినదినాభివృద్ధి వేగంగా చోటుచేసుకుంది.  ఎన్టీ రామారావు హయాంలో అంకురార్పణ చేసి, తొలి యూనిట్‌ను ప్రారంభించి, రెండవ యూనిట్‌ పనులు కొనసాగించారు. ఆ పనులను చంద్రబాబు సర్కార్‌ పూర్తి చేయించింది. దివంగత సీఎం వైఎస్‌  హయాంలో అత్యంత వేగంగా ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా 3, 4, 5, 6 యూనిట్లు వేగంగా నిర్మించారు. వెరశి ఆర్టీపీపీకి 1650 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని తీసుకవచ్చారు. తద్వారా లో ఓల్టేజీ సమస్యకు చెక్‌ పడింది.   

42 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలు.. 
ఆర్టీపీపీలో అన్ని యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టాలంటే సుమారు రోజుకు 21 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం కానున్నట్లు యంత్రాంగం వివరిస్తోంది. టీడీపీ సర్కార్‌లో ఐదేళ్ల కాలంలో తరచూ బొగ్గు కొరత ఉత్పన్నం కావడంతో ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ ముందు చూపుతో వ్యవహరించింది. ఒకేసారి 6లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఆర్టీపీపీకి చేరాయి. దాంతో బొగ్గు కొరత అనే సమస్యే లేకుండా పోయిందని కార్మికవర్గాలు చెబుతున్నారు. ప్రస్తుతం 42వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఆర్టీపీపీలో సిద్ధంగా ఉన్నాయి.  

డిమాండ్‌ ప్రకారమే విద్యుత్‌ ఉత్పత్తి  
ఏపీ జెన్‌కో యాజమాన్యం సూచన మేరకు డిమాండ్‌ను బట్టి ఆర్టీపీపీలో విద్యుత్‌ ఉత్పత్తి చేపడుతున్నాం. ప్రస్తుతం 6 యూనిట్లు ద్వారా ఉత్పత్తి కొనసాగుతోంది. బొగ్గు కొరత అనే సమస్యే తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఒకేసారి 6 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు చేరింది. ప్రస్తుతం ప్రతిరోజు 6నుంచి 7వ్యాగన్లు బొగు సరఫరా అవుతోంది. జెన్‌కో ఆదేశాల మేరకు  1650 మెగావాట్లుకు గాను 1450 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం. అన్ని యూనిట్ల ద్వారా ఏకధాటిగా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తున్నాం.       
 – మురళీకృష్ణా, సీఈ, ఆర్టీపీపీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement