- కేసీఆర్.. నిర్వాసితులను అనుగ్రహించకపోవడమే కారణం
- అడుగడుగునా పనులు అడ్డుకుంటున్న స్థానికులు
- నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్
- నెల రోజులుగా నిలిచిన భూసార పరీక్షలు
ఏటూరునాగారం : కంతనపల్లి ప్రాజెక్టు గ్రహణం పట్టుకుంది. మార్చి 29న సీఎం కేసీఆర్ వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆగ్రహించిన భూ నిర్వాసితులు భూసార పరీక్షలను అడ్డుకున్నారు. ఇటీవల బ్యారేజీ నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇసుక తీస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చి వెళ్లినప్పటి నుంచి తట్టెడు మట్టిని కూడా తీయనివ్వడం లేదు. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత పనులు ఊపందుకుంటాయని భావించగా ఇక్కడ సీన్ రివర్‌స అయ్యింది.
దీనికంతటికి కారణం నిర్వాసితులకు నమ్మకం కలిగేలా సరైన హామీ ఇవ్వకపోవడమే. ఆదుకుంటారని ఆశతో ఎదురు చూసిన కంతనపల్లి ముంపు బాధితులకు సీఎం నిరాశే మిగిల్చారు. దీంతో ఆగ్రహించిన బాధితులు ఒక్క పనికూడా సాగనివ్వమని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన, సముచితమైన హామీ వచ్చే వరకు పనులు కొనసాగించేది లేదని ఆ రోజే ప్రకటించిన విషయం తెలిసిందే.
కంతనపల్లి వద్ద గోదావరి నదిపై మొదటి దశలో రూ.1609 కోట్లతో నిర్మించతలపెట్టిన బ్యారేజ్ నిర్మాణం పనుల కోసం సేకరించిన భూమికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. గోదావరి నదిపై 3.5 కిలోమీటర్ల పొడవు, 172 గేట్ల నిర్మాణంతో చేపట్టనున్న పనుల కోసం యంత్రాలను ఏర్పాటు చేసుకునేందుకు ఏజెన్సీ రిత్విక్, ఎస్‌ఈడబ్ల్యూ కంపెనీలు కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. యంత్రాలు, ఇతర సామగ్రిని నిల్వ చేసుకునేందుకు తీసుకున్న భూములకు ఎలాంటి లీజు(కిరాయి) కానీ, నష్టపరిహారం ఇవ్వలేదు.
వ్యవసాయం చేసుకునే భూముల్లో కంపెనీ వారు యంత్రాలు ఏర్పాటు చేసుకున్నారేగానీ ఇంత వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని భూ నిర్వాసితులు వాపోయారు. కాగా కంతనపల్లి గ్రామంలోని 1400 ఎకరాల భూములు బ్యాక్ వాటర్‌లో కలిసిపోతాయని అంచనా. కానీ అక్కడ ఉన్న రైతులకు కేవలం 777 ఎకరాల అసైన్‌డ భూమిలో కేవలం 335 ఎకరాలకు మాత్రమే రైతుల పేర పట్టాలు ఉన్నాయి. పట్టాలు ఉన్న వారికి పరిహారం ఇప్పిస్తామని చెప్పడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పట్టాలు లేని రైతులు పట్టాలు ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
‘కంతనపల్లి’కి గ్రహణం
Published Mon, May 4 2015 3:30 AM | Last Updated on Wed, Jul 25 2018 2:52 PM
Advertisement