సీఎం చెంతకు దళారులు, దోపిడీదారులు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క
వైరా: సీఎం కేసీఆర్ చేసే దోపిడీలో మాకు భాగం కావాలని దళారులు, దోపిడీదారులు, కాంట్రాక్టర్లు పార్టీలు మారి ఆయన వెంట వెళ్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ముసుగులో.. బంగారు తెలంగాణ పేరుతో దోపిడీ జరుగుతోందని, రాష్ట్రంలో జరిగే దోపిడీని అరికట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, తానే స్వయంగా కండువాలు వేసి రాజ్యాంగ సంక్షోభానికి తెర తీశారన్నారు. సాక్షాత్తూ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే.. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని అనడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రభుత్వంలోనే కుట్రలు జరుగుతున్నందున ఇష్టారాజ్యాంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అధికారం కొత్తేమీ కాదని, ప్రభుత్వాన్ని కూల్చే దుష్ట సంస్కృతి తమకు లేదన్నారు. భూసేకరణలో రైతులు, ప్రజలకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఐతం సత్యం, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్, పార్టీ అధికార ప్రతినిధి పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు, నాయకులు శీలం వెంకటనర్సిరెడ్డి, ఏదునూరి సీతారాములు పాల్గొన్నారు.