⇒ ప్రభుత్వ ఖాతాలు మరోసారి ఫ్రీజ్
⇒ ట్రెజరీలో అన్నిరకాల చెల్లింపులు నిలిపివేత
⇒ గురువారం రాత్రి నుంచి ఫ్రీజ్‌లో ఖాతాలు
⇒ చెక్కులు తీసుకున్నా బ్యాంకుల్లో నగదు ఇవ్వని వైనం
⇒ నెల రోజుల్లో రెండోసారి ఈ పరిస్థితి
⇒ ప్రభుత్వ తీరుతో బిక్కముఖం వేస్తున్న కాంట్రాక్టర్లు, ఉద్యోగులు
గుడివాడ : ప్రభుత్వ ఖజానా మరోసారి నిండుకుంది. నెలలో రెండో సారి, అదీ లక్షా యాభై ఏడువేల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మరుసటి రోజే ప్రభుత్వ ఖజానా ఖాళీగా మారింది. దీంతో ట్రెజరీ అధికారులు అన్ని రకాల చెల్లింపులను నిలుపుదల చేసి చేతులెత్తేశారు. గురువారం రాత్రి నుంచి అన్ని రకాల పద్దుల చెల్లింపులు ఫ్రీజింగ్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఖజానా చెక్కులు తీసుకుని బ్యాంకుకు వెళ్లిన వారు తెల్లముఖం వేసి వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. నెలలో ఇది రెండోసారి ఖాతాలను ఫ్రీజింగ్ చేయడం గమనార్హం. ఫలితంగా ప్రభుత్వ అభివృద్ధి పనులు చేసినవారు బిల్లులను నగదుగా మార్చుకోలేక ఆందోళన చెందుతున్నారు.
అన్ని ఖాతాలదీ అదే పరిస్థితి..
ప్రభుత్వ శాఖలకు సంబంధించి మున్సిపాల్టీ, ఇతర ప్రభుత్వ శాఖలు, 13, 14వ ఆర్థిక సంఘాల నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఉన్న అన్ని ఖాతాలు నిలుపుదల చేశారు. కనీసం సమాచారం లేకుండా ఒక్కసారిగా ఆన్‌లైన్ ద్వారా ఫ్రీజింగ్‌లో ఉంచటంతో అధికారులు అవాక్కయ్యారు. గత నెల 8న ఫ్రీజింగ్‌లో ఉంచిన ప్రభుత్వం దాదాపు నెలరోజులపాటు తీయలేదు. ఈ నెలలో ప్రారంభమైన శాసన సభ బడ్జెట్ సమావేశాల ముందు ఫ్రీజింగ్ ఎత్తి వేశారు. బడ్జెట్ ముగిసిన వెంటనే మళ్లీ అన్ని ఖాతాలు ఫ్రీజింగ్‌లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం అనేక కార్యాలయాలు ఈ గవర్నెన్స్ విధానంలో పనిచేయడంతో బిల్లులు, జీతాలు చెల్లింపులు చెక్కులు ఇచ్చే సమయంలో సంబంధిత బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్ ద్వారా కంప్యూటర్‌లో నమోదు చేస్తేనే బ్యాంకుకు వెళ్లాలి. ఖాతాలు ఫ్రీజింగ్ అవ్వటంతో చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి.
వారం రోజులే చెల్లింపులు చేసింది...
ఫిబ్రవరి 8న ప్రభుత్వ ఖాతాలు ఫ్రీజింగ్‌లో ఉంచిన ప్రభుత్వం మార్చి 8వ తేదీ వరకు ఎటువంటి చెల్లింపులు జరపలేదు. మార్చి 16 వరకు మాత్రమే చెల్లింపులు జరిపారు. ఇంకా అనేక చెక్కులకు చెల్లింపులు జరపాల్సి ఉన్నా ఇవ్వలేదు. బ్యాంకు కు చెక్కులు తీసుకుని వెళ్తే గురువారం రాత్రి నుంచి ఫ్రీజింగ్ చేశారని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.
చిరుద్యోగుల ఇక్కట్లు..
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే చిరుద్యోగులు, వీఆర్‌ఏలు, అంగన్‌వాడీలు, కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు, వివిధ అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఖాతాల ఫ్రీజ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతినెలా మొదటి వారంలో వేతనాలు పొందే వీఆర్‌ఏలు, ఇతర శాఖల కాంట్రాక్టు సిబ్బందికి ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తాయి. కాంట్రాక్టర్లు అయితే చెల్లింపులు లేవనే సరికి పనులు ఎలా చేయాలని తలలు పట్టుకుంటున్నారు. ఆర్భాటంగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం ఒక్కరోజు గడవక ముందే ఇలా చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మళ్లీ ఖాళీ..
Published Sat, Mar 18 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
Advertisement
Advertisement