యంత్రాలతో తవ్వుకోనివ్వండి!
⇒ నిబంధనలు సడలించండి.. కాంట్రాక్టర్లకు అనుమతివ్వండి
⇒ అలా అయితేనే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ఊపు
⇒ ఇసుక తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వంపై ఎమ్మెల్యేల ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కోసం నదుల్లో కూడా ఇసుకను తవ్వుకునేందుకు నిర్మాణ సంస్థలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, యంత్రాలతో తోడి టిప్పర్లతో తరలించుకునేందుకు కూడా అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆ మేరకు నిబంధనలు సడలించాలంటూ ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు ఈమేరకు మూకుమ్మడి డిమాండ్ చేస్తుండటంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం వరకు... యంత్రాలతో ఇసుక తోడద్దనే నిబంధనను సడలిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని పరిశీలిస్తోంది.
అసలే... కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతుం డటంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతున్న తరుణంలో, ఈ నిబంధన అడ్డుగా ఉండి మరింత జాప్యం జరగటానికి కారణమవుతోందని ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. డబుల్ బెడ్రూంఇళ్లను చేపట్టేందుకు వీలుగా కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేందుకు వారికి ఇసుకను ఉచితంగా అందించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అయినా పెద్దగా స్పందన లేకపోవటంతో... వాగులు.. వంకలతోపాటు నదుల్లో కూడా ఇసుకను ఉచితంగా తోడుకునేందుకు ఇటీవలే వెసులుబాటు ఇచ్చింది. కానీ.. కేవలం ట్రాక్టర్లతో ఇసుకను తెచ్చుకునేందుకు మాత్రమే అనుమతి ఉండటంతో... భారీ ప్రాజెక్టులుగా రూపుదాల్చే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఇది ఇబ్బందిగా మారుతోందని ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటున్నారు.
భారీ ఎత్తున ఇసుక అవసరమవుతున్నందున కాంట్రాక్టర్లు పొక్లెయిన్ల ద్వారా ఇసుకను తోడి టిప్పర్లతో తరలించుకుపోయేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఎక్కడి పనులు అక్కడే పడకేసి ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్‌లో జరిగిన సమీక్షలో ఇసుక విషయంపై కలెక్టర్ యోగితారాణా తీరును తప్పుపడుతూ ఎమ్మెల్యేలు గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. నిబంధనలు కచ్చితంగా అమలుచేస్తున్న కలెక్టర్‌పై వారు విరుచుకుపడ్డారు. అంతకుముందే పలు జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు ఇదే తీరులో ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసి ఉండటంతో.. ప్రభుత్వం ఇప్పుడు ఆ అంశాన్ని పరిశీలిస్తోంది.
అక్రమాలకు అవకాశం ఇచ్చినట్టే...
యంత్రాలతో ఇసుకను తోడేందుకు వెసులుబాటు ఇస్తే అక్రమాలకు అవకాశం కల్పించినట్టే అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిచోటా నిఘా వేయటం సాధ్యం కానందున, రెండు పడక గదుల ఇంటి పథకం పేరుతో భారీమొత్తంలో ఇసుకను అక్రమంగా తరలించుకుపోయే ప్రమాదం ఉంటుందని వారు అంటున్నారు. యంత్రాలతో నేరుగా కాంట్రాక్టర్లే ఇసుక తరలించేలా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచిస్తున్నారు. ట్రాక్టర్లతో కొంచెం కొంచెంగా ఇసుకను తరలిస్తే కాంట్రాక్టర్లు వేగంగా పనులు చేసే అవకాశం లేనందున, ప్రభుత్వమే ఇసుకను భారీమొత్తంలో తరలించి వారికి అందుబాటులో ఉంచితే అక్రమాలకు అవకాశం ఉండదని కొందరు ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. ఎక్కువ మంది మాత్రం నేరుగా కాంట్రాక్టర్లే యంత్రాలతో ఇసుకతోడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తుండటం విశేషం.